ప్రజల బెదిరింపుల వల్ల అధికారుల్లో మార్పు వస్తుందా?

By iDreamPost 12-11-2019 02:21 PM
ప్రజల బెదిరింపుల వల్ల అధికారుల్లో మార్పు వస్తుందా?

ఎంఆర్ఓ విజయారెడ్డి సజీవ దహనం ఘటన తర్వాత, ఒక్కసారిగా ప్రభుత్వ కార్యాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి గురించి ప్రజలందరిలో చర్చకు దారితీసింది. ఐతే ఈ హత్యను సమర్ధిస్తూ కొందరు నిందితుడు "సురేష్" చేసింది సరైనదే అని వాదిస్తే, మరికొందరు సురేష్ చేసింది తప్పని అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత రైతులు కొందరు పెట్రోల్ తీసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులను బెదిరిస్తున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది నిజంగా మంచిపరిణామమా అని విశ్లేషిస్తే కాదనే అంటున్నారు విశ్లేషకులు.

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకుంటున్నారు అనేది జగమెరిగిన సత్యం. కానీ ఆ అవినీతిని అరికట్టడానికి ఏసీబీ డిపార్ట్మెంట్ ఉందనే విషయాన్నీ ప్రజలు అసలు గుర్తించడంలేదు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించమని ప్రభుత్వం విస్తృతంగా ప్రకటనలు ఇస్తున్న ప్రజలు పట్టించుకోవడం లేదు. ఏసీబీ అధికారులు ఉన్నది ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధించడానికి అని ప్రజలు మర్చిపోయినట్లు ఉన్నారు. కేవలం కొందరు మాత్రమే ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.

నిజానికి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ తహసీల్దార్ కార్యాలయంలో కానీ వెంటనే పని జరగడం కోసం లంచాలు ఇవ్వడానికి కూడా కొందరు ప్రజలు వెనుకాడటం లేదు. ఏ కార్యాలయంలో అయినా మధ్యస్థ స్థాయి అధికారికి పనులు చేయడం కొంచెం కష్టమైన విషయమే. పై స్థాయి అధికారుల నుడి కిందిస్థాయి అధికారుల వరకు రకరకాల ఆంక్షలు, ప్రలోభాలు ఎదురవుతాయి. వారినందరిని సమన్వయం చేస్తూ ఎవరికీ బాధ కలుగకుండా పనులు చేయాలి అంటే కత్తిమీద సామే. రకరకాల ఒత్తిడుల వలన ఏదొక సందర్భంలో అధికారి అవినీతి బాట పడతాడు. దీన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించాలి. అధికారులుపై పై అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడి లేకుండా చేయడం వల్ల కొంత అవినీతి తగ్గే అవకాశం ఉంది.

రైతుకుటుంబాల గొప్పతనం గురించి కష్టాల గురించి ఏకరువు పెట్టేవాళ్లంతా నీతిమంతులు అని భావించలేం. ఉదాహరణకు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబంలోని వ్యక్తికి ఒకవేళ "సర్కారీ కొలువు" వస్తే, ఆ వ్యక్తికి పెళ్లి సంబంధాలు చూసే విషయంలో తనకు వచ్చే జీతం 40000/- కానీ, జీతంపైన లంచం నెలకు లక్ష పైనే వస్తుందని డాబుసరి మాటలు చెప్పే కొందరు బంధువులు, స్నేహితులు, రైతుల గొప్పతనం గురించి, వ్యవస్థలో ఉన్న లంచాలు గురించి మాట్లాడుతుండటం కలవరపరిచే అంశమే. దీన్నే "తెలివైన మూర్ఖత్వం" అనొచ్చు. ప్రజలు కూడా తమ జీవన విధానంలో లంచాలకు అలవాటు పడ్డారు. ఇది ప్రజలు అంగీకరించని సత్యం.

ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు తీసుకోవడం తగ్గాలి అంటే ప్రజలు ఆలోచించే విధానంలో సమూలంగా మార్పు రావాలి. కానీ ఆ మార్పుని ప్రజలు కూడా ఆహ్వానించలేనంతగా అవినీతి ప్రజల మనసుల్లో చొచ్చుకుపోయింది. ఆ మార్పు ప్రజల్లో రాకుండా వ్యవస్థని సమాజాన్ని మార్చడం సాధ్యం కాదు. హత్య చేస్తేనో భయపెడితోనో వ్యవస్థ మారడం అనేది జరగదు. ఇది గుర్తించకుండా ప్రజలు తిరగబడినా వచ్చే మార్పు ఏమీ ఉండదు . అవినీతి జరుగుతున్నప్పుడు లంచం అడుగుతున్నప్పుడు ప్రజలంతా ఏసీబీ అధికారులను ఆశ్రయించి లంచం అడిగే అధికారుల్లో భయాన్ని కలిగించాలి. అవినీతిని అరికట్టడంలో ఏసీబీ పాత్ర ఎంత ఉంటుందో ప్రజలందరిలో అవగాహన ఏర్పడేలా ప్రభుత్వం కృషి చేయాలి. అవినీతి అధికారులకు శిక్షలు కఠినంగా ఉండేలా చట్టాలు తీసుకురావాలి. దీనివల్ల అవినీతి అధికారుల్లో భయం ఏర్పడి అవినీతి తగ్గే అవకాశం ఉంది

ప్రజలు కూడా అధికారులు చేసే అవినీతిని బహిర్గతం చేయాలి. అధికారులు కూడా సొంత పనుల కోసం తమపై ఒత్తిడి పెంచుతున్న నాయకుల గురించి బహిర్గతం చేసినప్పుడు కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆలా కాకుండా బెదిరించడం వల్లనో హత్య చేయడం వల్లనో వ్యవస్థలో మార్పు రాదు. ఈ హత్యల వల్ల కుటుంబాలు వీధిన పడటం మినహా ఒరిగేదేమి ఉండదు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News