తూర్పులో ఆ రెండు మున్సిపాలిటీలపైనే ఆసక్తి..!

By Voleti Divakar Mar. 05, 2021, 08:30 pm IST
తూర్పులో ఆ రెండు మున్సిపాలిటీలపైనే ఆసక్తి..!

వాస్తు శాస్త్రం నమ్మేవారికి తూర్పు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో సహా రాష్ట్రంలో ని రాజకీయ నేతలంతా తూర్పులో బోణీ కొడితే ఆ ఎన్నికల్లో విజయం తమదేనన్న నమ్మకంతో ఉండేవారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసిపి ఎకగ్రీవాలతో బోణీ కొట్టింది. ఇది శుభపరిణామంగా భావిస్తున్నారు .

పంచాయతీ ఫలితాలు పునరావృతమవుతున్నాయన్న ఉత్తేజం వైసిపి శ్రేణుల్లో కలుగుతోంది. అదే సమయంలో గత పంచాయితీ ఎన్నికల్లో టిడిపి - జనసేన కాంబినేషన్ పురపాలక సంఘాల ఎన్నికల్లో పనికి వచ్చేలా లేదు. జిల్లా వ్యాప్తంగా అమలాపురం, మండపేట, తుని, రామచంద్రపురం, సామర్లకోట, పెదాపురం, పిఠాపురం పురపాలక సంఘాలతో పాటు గొల్లప్రోలు, ముమ్మిడివరం , ఏలేశ్వరం నగర పంచాయితీలకు మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి.

అమలాపురానికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రపురం నుంచి బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబో యిన వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, తుని , పిఠాపురం, ముమ్మిడివరంలకు వైసిపి ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా , పెండెం దొరబాబు, పొన్నాడ సతీష్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో వైపు పెద్దాపురం నియోజకవరానికి మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, మాజీ మంత్రి నిమ్మకాయలకు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి .

పంచాయితీ ఫలితాలు పునరావృతమవుతాయా ?

అమలా పురం పురపాలక సంఘంలోని 6 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోనే పెద్ద పురపాలక సంఘం, కోనసీమలో రాజకీయ కేంద్రమైన అమలాపు రంలో అధికార పార్టీ విజయం దాదాపు ఖాయమన్న ధీమాతో ఆధికారపార్టీ ఉంది. మొత్తం 30 వార్డులకు గాను 4 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 63 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మార్చి10 న జరిగే ఎన్నికలకు 72 మంది ఆభ్యరులు బరిలో నిలిచారు. అమలా పురంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పార్టీ అభ్యర్థులను ఎకగ్రీవంగా గెలిపించడంతో పాటు , పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు తన రాజకీయ అనుభవాన్ని వినియోగించి, వ్యూహాలకు పదును పెడుతున్నారు .కోనసీమలోని నగరపంచాయితీ ముమ్మిడివరంలో కూడా వైసిపి అభ్యర్థి ఎకగ్రీవంగా ఎన్నికయ్యేలా సానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చక్రం తిప్పారు. కోనసీమ ఫలితాలు జిల్లా వైసిపిలో నూతనోత్తే దాన్ని నింపుతున్నాయి .

నిమ్మకాయల చినరాజప్ప ఇలాఖా పెద్దాపురంలో 29 వార్డుల్లో పోటీ అనివార్యమైనా 10వ డివిజన్లో టిడిపి అభ్యర్థి పోటీకి దూరం కావడంతో జనసేనకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే మరో అభ్యర్థి కూడా పోటీకి దూరం కావడంతో స్వతంత్ర అభ్యర్థికి టిడిపి మద్దతు ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికార వైసిపి విజయం తధ్యమన్నభావన వ్యక్త మవుతోంది.

పిఠాపురంలో ఇద్దరు టిడిపి అభ్యరులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో వైసిపి ఆభ్యరులు ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. తునిలో 30 వారులకు గాను 15 వార్డుల్లో వైసిపి అభ్యర్థులు ఎకగ్రీవమయ్యారు. దీంతో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి నియో జకవర్గంలో టిడిపి పరిస్థితి దారుణంగా మారింది. ఇక్కడ వైసిపి విజయం ;లాంఛనమే. చెల్లుబోయిన వేణు ప్రాతినిధ్యం వహిసున్న రామచంద్రపురంలో 28 వార్డులకు గాను 10 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రామచంద్రాపురం లో అధికార పార్టీ గెలుపు నల్లేరు మీద నడక మాదిరిగా సాగనుంది.

మండపేట మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా.. అన్ని వార్డుల్లోనూ పోటీ నెలకొంది. వైసీపీ. టీడీపీతోపాటు జనసేన అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలకు గాను టీడీపీ రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. వైఎస్‌జగన్‌ హవాలోనూ ఈ నాలుగు నియోజకవర్గాలను టీడీపీ నిలబెట్టుకుంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగడం లేదు. కాకినాడ నగరపాలక సంస్థ పాలక మండలి గడువు ఇంకా ఉంది. 8 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలలో అందరి దృష్టి మండపేట, పెద్దాపురం మున్సిపాలిటీలతో పాటు పెద్దాపురం నియోజకవర్గంలో భాగంగా ఉన్న సామర్లకోట మున్సిపాలిటీపై కేద్రీకృతమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మండపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాల్లోని మూడు మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంటుందా..? లేక టీడీపీ పట్టు నిలబెట్టుకుంటుందా..? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp