NRI ఆస్పత్రిలో నిధులు స్వాహా, వెలగులోకి భారీ కుంభకోణం, పలువురు అరెస్ట్

By Raju VS Jun. 24, 2021, 07:29 am IST
NRI ఆస్పత్రిలో నిధులు స్వాహా, వెలగులోకి భారీ కుంభకోణం, పలువురు అరెస్ట్

గుంటూరు జిల్లాలో ప్రముఖ ప్రైవేట్ బోధనాస్పత్రి ఎన్ ఆర్ ఐ ఆస్పత్రి చుట్టూ వివాదాలు అలముకుంటున్నాయి. చినకాకానిలో ఉన్న ఈ ఆస్పత్రిలో ఇటీవల కోవిడ్ సందర్భంగా భారీ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. వైద్యం పేరుతో పెద్ద మొత్తంలో గుంజిన వ్యవహారంలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆతర్వాత ఎన్ ఆర్ ఐ అకాడమీ పేరుతో ఉన్న వైద్యశాలలో డైరెక్టర్ల మధ్య వివాదం పోలీసు స్టేషన్ వరకూ వెళ్ళింది. అకాడమీ నిధులను కొందరు డైరెక్టర్లు స్వాహా చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చిలోనే మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. ఆ సంస్థ డైరెక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 420,206,120 బి రెడ్ విత్ 34 కింద ఈ కేసు నమోదయ్యింది.

ఎన్ ఆర్ ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సొసైటీకి చెందిన రూ 5.28 కోట్లను కొందరు పక్కదారి పట్టించి వ్యక్తిగత ఖాతాలకు తరలించారనేది ప్రధాన ఆరోపణ. అందులో వైస్ ప్రెసిడెండ్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ట్రెజరర్ అక్కినేని మణి, చీప్ కోఆర్డినేషన్ ఆఫీసర్ చికాగో శ్రీనివాస్, సీఎఫ్ఓ వల్లూరిపల్లి నళినిమోహన్ మీద కేసు ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. కీలక ఆధారాలు సేకరించారు. అంతేగాకుండా చికాగో శ్రీనివాస్, నళినీమోహన్ సహా క్యాషియర్ నాగేశ్వరరావు, అకౌంటెంట్ శ్రీనివాసరాజుని అదుపులోకి తీసుకున్నారు.

దాంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఎన్ ఆర్ ఐ ఆస్పత్రి ని బలవంతంగా అమ్మకానికి ప్రయత్నిస్తున్నారని మరో వర్గం చెబుతోంది. సొసైటీలో 30 మంది సభ్యులకు గానూ 20 మంది అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నట్టు డైరెక్టర్ డాక్టర్ బుచ్చయ్య ఆరోపించారు. అయితే గురువారం నాడు బోర్డు సమావేశం ఉండగా, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లోనే మిగిలిన వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఆస్పత్రిని రూ. 650 కోట్లకు అమ్మేశారని ప్రచారం సాగుతోందని, అందులో వాస్తవం లేదని ఆయన అన్నారు.

ఎన్ఆర్ఐ అకాడమీ వ్యవహారంలలో చాలాకాలంగా అక్రమాలు సాగుతున్నట్టు కొందరు చెబుతున్నారు. అయితే యాజమాన్య బోర్డులో కొందరి మధ్య వచ్చిన విబేధాలతో విషయం బయటకు వచ్చిందా అనే అభిప్రాయం కూడా ఉంది. కరోనా సమయంలో పెద్ద మొత్తంలో క్యాష్‌ రూపంలో చేసిన వసూళ్ల కారణంగా వివాదం తీవ్రమయినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఆస్పత్రి ని అమ్మకానికి పెడితే తప్ప ఇలాంటి దందాలకు అడ్డుకట్ట వేయలేమని ఓ వర్గం భావిస్తోంది. దానికి అనుగుణంగా చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుతం ఆస్పత్రి నిర్వహణలో కీలకంగా ఉన్న కొందరు అడ్డుతగులుతున్నట్టు చెబుతున్నారు. తమ వద్దనున్న ఆధారాలతో పోలీసులను ఆశ్రయించిన వర్గం తాజా అరెస్టుల తర్వాత ఏం చేయబోతోందన్నది మెడికల్ వర్గాలలో కూడా సామాన్యుల్లో కూడా చర్చనీయాంశం అవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp