పల్నాడు టీడీపీ నేత హత్య.. లోకేష్‌ ఆరోపణలు అబద్ధమని తేల్చిన దర్యాప్తు...

By Karthik P Jan. 21, 2021, 06:53 am IST
పల్నాడు టీడీపీ నేత హత్య.. లోకేష్‌ ఆరోపణలు అబద్ధమని తేల్చిన దర్యాప్తు...

ఘటన ఏదైనా సరే దానికి అధికార పార్టీ వైసీపీయే కారణం, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డే బాధ్యత వహించాలి.. ఇలా సాగుతోంది ఏపీలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం రాజకీయం. పూర్వాపరాలు తెలుసుకోకుండానే.. సదరు ఘటనకు కారణం అధికార పార్టీనే అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొదలుకుని ఆ పార్టీ నేతలు ఒకే పల్లవి ఎత్తుకుంటున్నారు. తండ్రి బాటలోనే తనయుడు నారా లోకేష్‌ కూడా నడుస్తున్నారు. అధికార పార్టీపై ఆరోపణలు చేసిన ప్రతిసారి బొక్క బోర్లా పడుతున్నా టీడీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు.

తాజాగా టీడీపీ నేత పూరంశెట్టి అంకులయ్య హత్య కేసును గుంటూరు జిల్లా పోలీసులు చేధించారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడు పంచాయతీ మాజీ ప్రెసిడెంట్‌ అయిన అంకులయ్య ఇటీవల హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించక ముందే టీడీపీ రాజకీయం మొదలు పెట్టింది. వైసీపీ హత్యా రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు, లోకేష్‌లు ఆరోపించగా.. ఆ పార్టీ నేతలు అదే దారిలో నడిచారు. నారా లోకేష్‌ ఒక అడుగు ముందుకేసి అంకులు హత్యకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యత వహించాలని కూడా డిమాండ్‌ చేశారు. అంకులు అతిమసంస్కారాల్లో పాల్గొని, వైసీపీ నేతల నుంచి రక్షణ కల్పిస్తామని ఆయన కుటుంబ సభ్యులకు లోకేష్‌ భరోసా ఇచ్చారు.

హత్యకు గల కారణాలను తెలుసుకోకుండానే.. బట్టకాల్సి మొహం మీద వేసినట్లుగా వైసీపీ, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేసిన నారా లోకేష్‌ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు. అంకులు హత్యలో ప్రధాన సూత్రదారి ఆయన ముఖ్య అనుచరుడు కోటేశ్వరరావేనని పోలీసులు వెల్లడించారు. హత్యకు భూ వివాదాలే కారణమని తేల్చారు. అంకులు గతంలో జనశక్తి దళంలో పని చేశారు. ఆ సమయంలో ఆయనకు కోటేశ్వరరావు ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. దళం నుంచి బయటకు వచ్చిన తర్వాత 1995 నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. తన భూమిని తక్కువ ధరకే అంకులయ్య అమ్మేశాడని కోటేశ్వరరావు పగ పెంచుకున్నాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కోటేశ్వరరావు జనశక్తి నేత శంకరయ్య సహా మరో నలుగురుతో కలసి అంకులు హత్యకు ప్లాన్‌ చేశారు. ఈ నెల 3వ తేదీన అంకులయ్యను దాచేపల్లి రప్పించి, ఆహారంలో మత్తు మందు కలిపారు. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారని గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని వివరించారు. ఈ కేసును పక్షం రోజుల్లోనే పోలీసులు తేల్చారు. నాడు వైసీపీపై, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు చేసిన నారా లోకేష్‌ స్పందన ఇప్పుడు ఎలా ఉంటుందో..? చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp