ప్రజా గాయకుడు వంగపండు ఇకలేరు...

By Kiran.G Aug. 04, 2020, 06:46 am IST
ప్రజా గాయకుడు వంగపండు ఇకలేరు...

ప్రముఖ జానపద ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5.30 నిమిషాలకు గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మూడు దశాబ్దాల పైన జానపద పాటలు రచించి ఆడి పాడారు.

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు ప్రసాదరావు ఈరోజు ఉదయం విజయనగరం జిల్లా పార్వతీపురంలో తన స్వగృహంలో హటాత్తుగా కన్నుమూయడంతో పలువురు జానపద కళాకారులతో పాటు ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గత మూడు దశాబ్దాలుగా తనే స్వయంగా జానపదాలు రచిస్తూ ఆడి పాడారు వంగపండు.. ఏం పిల్లడో ఎళ్దాం వస్తవ.. కాలేజి కుర్రాడా కులసాగా ఉన్నోడా.. వంటి ప్రజాదరణ పొందిన తన జానపద గేయాలతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు వంగపండు ప్రసాదరావు.

జజ్జనకరి కరోనా.. చూడర దాని ఘరానా..
జజ్జనకరి కరోనా.. చూడర దాని ఘరానా..
భయపడితే కరోనా.. బంకలాగ పడతాది..
ఒరే ఇంటినుంటే కరోరా.. వీధిలుంటది కరోనా..
వీధిలుంటే కరోనా.. ఇంటికొత్తది కరోనా..
దూరం దూరం మెలగడమే.. దీన్ని చంపే ఆయుధం..
జజ్జనకరి కరోనా.. చూడర దాని ఘరానా..  

నాలుగు రోజుల క్రితం వంగపండు కరోనాపై రాసి ఆడి పాడిన గేయం ఇది. ఈ పాట పాడుతున్నప్పుడు కూడా ఎంతో హుషారుగా కనిపించిన ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆయన మృతి గురించి తెలిసిన పలువురు జానపద కళాకారులు వంగపండు స్వగృహానికి తరలి వెళ్తున్నారు. కరోనా నేపథ్యంలో కొందరు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర జానపదాలను ఎలుగెత్తి వినిపించిన గొంతు మూగబోయింది. పల్లెకారులతో పాటు గిరిజనులను తన గేయాలతో చైతన్య పరచిన వంగపండు మృతి జానపదాలతో పాటు తెలుగు ప్రజలకు కూడా తీరని లోటు అనడంలో ఎలాంటి సందేహం లేదు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp