భార‌త్ స‌త్తా ప్ర‌పంచానికి తెలిసింది : ప్రధాని మోడీ

By Kalyan.S Jul. 09, 2020, 10:27 pm IST
భార‌త్ స‌త్తా ప్ర‌పంచానికి తెలిసింది : ప్రధాని మోడీ

ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాటంలో భార‌త్ ఫార్మా రంగం సాధించిన ప్ర‌గ‌తితో మ‌న స‌త్తా ప్ర‌పంచం మొత్తానికి తెలిసింద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. వైర‌స్ తో పోరాడుతూనే.. మ‌రోవైపు ఆరోగ్యం, ఆర్థిక ప్ర‌గ‌తిపై దృష్టి సారించి ప్ర‌తికూల‌త‌ల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ్డామ‌ని, ఆర్థిక వ్యవస్థ గ‌ణ‌నీయంగా మ‌ళ్లీ పుంజుకుంటోందని వెల్ల‌డించారు. భారత‌దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ‘‘ఇండియా గ్లోబల్ వీక్-2020’’ ని పురస్కరించుకొని ప్ర‌ధాని ప్రసంగించారు.

ఇప్పుడు అంద‌రూ ఆర్థిక పున‌రుద్ధ‌ర‌ణ గురించే మాట్లాడుతున్నార‌ని, ఆ విష‌యంలో భార‌త్ ప్ర‌ధాన భూమిక పోషించ‌బోతోంద‌ని వివ‌రించారు. భారత్ విజ్ఞానానికి అధికార కేంద్రమని, తమ విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచేందుకు సదా సిద్ధంగానే ఉందని ఆయన ప్రకటించారు. సాంఘిక‌, ఆర్థిక‌, ఆరోగ్య స‌వాళ్ల‌ను ఎదిరించిన చ‌రిత్ర భారతీయలకు ఉంద‌ని అన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతూనే... మరోపక్క ప్రజల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడుతున్నామ‌ని, ఆరోగ్యం, ఆర్థికం రెండింటీపై ఫోకస్ పెట్టామని వివ‌రించారు. ఈ కాలంలో పునరుజ్జీవనం గురించి మాట్లాడటం అత్యంత సహజమని, ప్రపంచ పునరుజ్జీవంతో పాటు భారత దేశ పునరుజ్జీవాన్ని అనుసంధానించడం కూడా సహజ ధోరణే అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంలో భారత పాత్రం చాలా ప్రముఖమైందని ఆయన స్పష్టం చేశారు.

మీకిదే.. మా ఆహ్వానం

భారత దేశం అన్ని విధాలుగానూ పెట్టుబ‌డులు పెట్టేందుకు అనుకూలంగా ఉంద‌ని, దిగ్గ‌జ కంపెనీలన్నీ ఇక్క‌డ అడుగుపెట్టాల‌ని ఆహ్వానించారు. రెడ్ కార్పెట్‌ పరుస్తూ స్వాగతం పలుకుతున్నామ‌న్నారు. రక్షణ రంగంలో సైతం పెట్టుబడులు పెట్టేందుకు అపార అవ‌కాశాలున్నాయ‌న్నారు. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులకు చాన్స్ ఉంద‌న్నారు. భార‌త్ ఫార్మా రంగం సాధించిన ఘ‌న‌త‌, ఆర్థిక రంగంలో పెరుగుతున్న‌పురోగ‌తి దిగ్గ‌జ కంపెనీల‌న్నీ గ‌మ‌నించి ఇక్క‌డ పెట్టుబడులు పెట్టేందుకు త‌ర‌లి రావాల‌ని ప్ర‌ధాని కోరారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp