మోదీ నోట.. జమిలి మాట.. సాధ్యమేనా..?

By Karthik P Nov. 27, 2020, 02:00 pm IST
మోదీ నోట.. జమిలి మాట.. సాధ్యమేనా..?

ఒకే దేశం.. ఒకే ఎన్నిక (.జమిలి ఎన్నికలు) అనే మాట మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి జమిలి ఎన్నికలు అనే మాట రావడంతో ఈ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. గుజరాత్‌లో జరిగిన స్పీకర్ల సదస్సులో గురువారం మాట్లాడిన ప్రధాని మోదీ జమిలి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశానికి జమిలి ఎన్నికలు చాలా అవసరమని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలు కేవలం చర్చనీయాంశం కాదని, దేశానికి అత్యవసరమని చెప్పిన ప్రధాని మోదీ సీరియస్‌ చర్చకు తెరతీశారు.

దేశంలో ప్రతి నెల ఏదో ఒక చోట పెద్ద ఎన్నికలు జరుగుతున్నాయన్న ప్రధాని.. అవి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే లోక్‌సభ, శాసనసభ, పంచాయతీ ఎన్నికలను ఒకే సారి నిర్వహించేలా కార్యాచరణ రూపాందించాల్సిన అవసరం ఉందని రాజకీయ వేడిన రగిలించారు. స్పీకర్లు ఈ అంశంపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభ, శాసనసభ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఒకే ఓటర్‌ జాబితా రూపాందించాలని సూచించిన ప్రధాని మోదీ దేశం మొత్తం తనవైపు చూసేలా వ్యవహరించారు.

2014లో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ తర్వాత రెండేళ్లకే జమిలి ఎన్నికలు అనే విషయాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో కూడా తీవ్ర చర్చ సాగింది. 2019 జనరల్‌ ఎన్నికల గడువు సమీపించే కొద్దీ ఈ చర్చ కూడా నిలిచిపోయింది. గడచిన ఎన్నికల్లోనూ 2014 కన్నా ఎక్కువ సీట్లతో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టింది. ఈ సారి అధికారం చేపట్టిన నాటి నుంచే జమిలి ఎన్నికలపై బీజేపీ కింది స్థాయి నేతలు అక్కడక్కడా మాట్లాడుతూ చర్చకు లేవనెత్తుతున్నారు.

అధికారంలోకి రావాలని ప్రత్నిస్తున్న పార్టీలు, అధికారం కోల్పోయిన పార్టీలు కూడా బీజేపీతో గొంతు కలుపుతున్నాయి. జమిలి ఎన్నికలకు సిద్ధమని చెబుతూ.. పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ప్రకటనలు కూడా జారీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీనే జమిలి ఎన్నికల అవసరంపై కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని కుదిరితే 2022లో జిమిలి ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది.

అయితే జమిలి ఎన్నికలు భారత్‌లో సాధ్యమా..? అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. భారత్‌ వ్యవహరిస్తున్న రాజకీయ విధానానికి జమిలి ఎన్నికలు సరికావని రాజకీయ పండితులు చెబుతున్నారు. బహు పార్టీ విధానం అమలులో ఉన్న భారత్‌లో.. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఏ ఒక్క పార్టీకి రాకపోతే సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెబుతున్నారు. కేంద్రంలోనూ, రెండు కన్నా ఎక్కువ పార్టీల ప్రాభల్యం ఉన్న రాష్ట్రాలలోనూ నిత్యకృత్యంగా సాగుతున్నదే. ఈ కారణంతో దేశంలో సంకీర్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నటికీ తప్పవని స్పష్టం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత కేంద్రంలో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. 2024లో మళ్లీ బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఎవరూ చెప్పలేరు. ఆ పార్టీయే కాదు ఏ ఒక్క పార్టీకి అధికారాన్ని ఏర్పాటు చేసే సీట్లు ప్రజలు ఇస్తారని చెప్పలేం. ఇక రాష్ట్రాలలోని ఇదే పరిస్థితి. అలాంటిది లోక్‌సభ, రాష్ట్ర శాసన సభ, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాలలోనూ హంగ్‌ ఏర్పడితే అప్పుడు ఏం చేయాలన్నదే ప్రధాన సమస్య. పంచాయతీలలో పాలక మండళ్లు ఏర్పాడతాయి. కానీ లోక్‌సభ, శాసన సభలలోనే అసలు చిక్కుముడులు ప్రారంభమవుతాయి. ఈ సందేహాలు, సమస్యలు, చిక్కుముళ్లు ఎలా పరిష్కరిస్తారనే దానిపై జమిలి ఎన్నికలు భవిష్యత్‌ ఆధారపడి ఉందని అంగీకరించాల్సిన వాస్తవం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp