ఎటూ తేల్చుకోలేక పోతున్న మోదీ

By Kalyan.S May. 07, 2021, 09:45 am IST
ఎటూ తేల్చుకోలేక పోతున్న మోదీ

ఓ వైపు ప్ర‌జ‌ల ఆరోగ్యానికి సంబంధించిన విష‌యం.. మ‌రోవైపు దేశ ఆర్థిక ప్ర‌గ‌తి అంశం.. రెండింట్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, స‌మంగా ఎలా ముందుకెళ్లాలి, లాక్ డౌన్ పెట్టాలా, వ‌ద్దా.. ఇదీ ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌లు. ఉన్న‌త న్యాయ స్థానం నుంచి కొంద‌రు మేధావులు, ఆరోగ్య రంగ నిపుణులు సైతం లాక్ డౌన్ పై ఆలోచించాల‌ని సూచిస్తున్నారు. ప‌లువురు ప్ర‌ధానిపై ఒత్తిడి తెస్తున్నారు. మ‌రి కొంద‌రు లాక్ డౌన్ పెడితే ఆరోగ్య మ‌ర‌ణాల క‌న్నా, ఆక‌లి మ‌ర‌ణాలు పెరుగుతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఎవ‌రి సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకెళ్లాలో తెలియ‌క ప్ర‌ధాని మోదీ ఎటూ తేల్చుకోలేక‌పోతున్నార‌ట‌. లాక్ డౌన్ పై మే 2 త‌ర్వాత కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని వార్త‌లు వెల్లువెత్తాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కూ మోదీ దీనిపై ఎటువంటి నిర్ణ‌య‌మూ ప్ర‌క‌టించ‌లేదు.

కేంద్రం నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో

క‌రోనా రెండో ద‌శ విజృంభ‌ణ‌తో ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. మ‌రి కొన్ని రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ప్ర‌ధాని నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని ఎదురుచూశాయి. అటువంటి ప్ర‌క‌ట‌న ఏదీ రాక‌పోవ‌డంతో స్వీయ నిర్ణ‌యాలు ప్రారంభించాయి. కరోనా కట్టడికి తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నా అదుపులోకి రాకపోవడంతో కేరళ గురువారం ఉదయం లాక్‌డౌన్‌ ప్రకటించింది. అదే రోజు మధ్యప్రదేశ్‌ కూడా సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ తప్పక విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా కట్టడి చర్యలు ప్రకటిస్తుందేమోనని ఎదురుచూసి చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్రాలు స్వీయ నిర్ణయాలు తీసుకున్నామ‌ని ప్ర‌క‌టించాయి.

ఇప్ప‌టికే చాలా రాష్ట్రాలు

‘కరోనా చెయిన్‌ తెంపేందుకు మే 15వ తేదీ వరకు కఠినంగా జనతా కర్ఫ్యూ రాష్ట్రంలో విధిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. చాలా రోజులు లాక్‌డౌన్‌ ఉండదని పాజిటివిటీ రేటు తగ్గేంతవరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు 18 శాతం ఉండేలా చూస్తామన్నారు. కేరళలో ఏప్రిల్‌ 8 నుంచి 16వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలు కానున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డికి లాక్ డౌన్ మిన‌హా మ‌రో ఆప్ష‌న్ లేద‌ని రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాత్ కూడా పేర్కొన్నారు. దాదాపు ఏడెనిమిది రాష్ట్రాలు ఇప్ప‌టికే లాక్ డౌన్ లో ఉన్నాయి. ఏపీలో 18 గంట‌ల పాటు క‌ఠిన క‌ర్య్ఫూ అమ‌ల్లో ఉంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండ‌ద‌ని తేల్చేశారు. దాని వ‌ల్ల ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని అన్నారు. లాక్ డౌన్ ప్ర‌క‌టించినా ఆయా రాష్ట్రాల్లో కేసులు అదుపులోకి రాలేద‌న్నారు.

అదే నిజ‌మైతే...

లాక్ డౌన్ పై భిన్న వాద‌న‌ల మ‌ధ్య ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌ల‌నేది మోదీ తేల్చుకోలేక పోతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులుమరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో రోజుకి 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం నాలుగు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అనుకూలంగా లేదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది మాదిరిగా జాతీయస్థాయి లాక్ డౌన్ విధించడం కారణంగా పేదలకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. కానీ, విప‌త్తు ఉధృత‌మై అనుకోని ప‌రిణామాలు చోటుచేసుకుంటే లాక్ డౌన్ పై కేంద్రం నిర్ల‌క్ష్య వైఖ‌రే కార‌ణ‌మ‌న్న అప‌వాదు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంద‌న్న అనుమానం కూడా వెంటాడుతోంది.

తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు ఫోన్

మొత్తంగా దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేయకపోయినప్పటికీ కూడా దేశంలో చాలా రాష్ట్రాలు సొంతంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో లాక్ డౌన్ పెట్ట‌ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన మోదీ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఆయా రాష్ట్రాల ప‌రిస్థితులు, లాక్ డౌన్ పెడితే త‌లెత్తే ప‌రిణామాల‌ను అడిగి తెలుసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కె.చంద్ర‌శేఖ‌ర్ రావులకు మోదీ ఫోన్ చేశారు. కరోనా వ్యాప్తి ఎలా ఉంది? కట్టడికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? వ్యాక్సిన్‌ పంపిణీ, ఆక్సిజన్‌ కొరత వంటి తదితర విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇలా అంద‌రితో మాట్లాడిన త‌ర్వాత ప్ర‌ధాని లైవ్ లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp