ప్రశాంత్​ కిశోర్​ ఎవరికి పనిచేయబోతున్నారు?

By Amar S Dec. 02, 2019, 11:36 am IST
ప్రశాంత్​ కిశోర్​ ఎవరికి పనిచేయబోతున్నారు?

గత దశాబ్దంలో "రాజకీయ వ్యూహ రచన" అనేకమందికి ఒక కెరీర్ అయ్యింది.ఎన్నికల వ్యూహ రచన వేల కోట్ల వ్యాపార స్థాయికి ఎదిగింది.ఈ రంగంలో ప్రశాంత్​ కిశోర్ ఒక సంచలనం. మోడీ నుంచి జగన్ వరకు ఎన్నికల్లో గెలవటానికి ఈయన సేవలను వాడుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలంకంగా వ్యవహరించిన ప్రశాంత్​ కిశోర్ ఇప్పుడు ఏమి చెయ్యబోతున్నారన్న చర్చ జరుగుతుంది.

ప్రశాంత్​ కిశోర్​ (పీకే) డీఎంకే చీఫ్​ ఎంకే స్టాలిన్​ రాజకీయ సలహాదారునిగా చేరబోతున్నట్టు తెలుస్తోంది.2021లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పీకే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈమేరకు డీఎంకే అధినేత స్టాలిన్, పీకేల మధ్య చర్చలు ఫైనల్​ అవుతున్నట్టు సమాచారం.

గత లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే దాదాపుగా క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసినా ఆతరువాత జరిగిన నాంగునేరి, విక్రవాండి ఉప ఎన్నికల్లో మాత్రం ఆపార్టీ విజయావకాశాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా రాష్ట్రంలో అన్నాడీఎంకే బలం కూడా పుంజుకుంటోంది. దీంతో అలర్ట్​ అయిన స్టాలిన్ ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం తనదైన వ్యూహాలతో ముందుకువెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్​ స్ట్రేటజిస్టు సహాయం తీసుకుంటున్నారు. అలాగే తమిళనటుడు, మక్కల్‌‌‌‌ నీది మయ్యం (ఎంఎన్​ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తో పీకే చేసుకున్న కాంట్రాక్ట్​ ఈఏడాది తో పూర్తవుతుండడంతో స్టాలిన్ పీకేతో సంప్రదింపులు జరిపారు. అయితే ఈ కాంట్రాక్ట్​ మళ్లీ రెన్యూవల్​ చేసుకోలేదని ఎంఎన్​ఎం వర్గాలు చెప్తున్నాయి. మరి పీకే రెన్యూవల్ చేసుకుంటారా.. స్టాలిన్ తో కలిసి పనిచేస్తారా అనేది చూడాలి.

పీకే పనిచేసింది వీరికే..

2011లో నరేంద్ర మోడీ గుజరాత్​ ముఖ్యమంత్రిగా మూడోసారి గెలవడంలో పీకే కీలకపాత్ర పోషించారు. 2014లో మోడీ, బీజేపీ ప్రచారానికి సాంకేతికతను జోడించారు. ముఖ్యంగా చాయ్​పే చర్చ,3డీ సభలు, కాంక్లేవ్​లు, సోషల్​ మీడియా ప్రోగ్రామ్ లను తయారుచేశారు.

2015 బీహార్ ఎన్నికల్లో బీజేపీ విహాయం తథ్యం అని అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినా నితీష్-లాలూ-కాంగ్రెస్ కూటమి అఖండ విజయానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహమే ప్రధాన కారణం.

2017 లో ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది - కాంగ్రెస్ కూటమి గెలుపుకు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు పని చేయలేదు కానీ అదే సమాయంలో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు కాంగ్రెసును గెలిపించాయి.

వైసీపీకి ప్రజలలో ఆదరణ ఉన్నా 2014 ఎన్నికల్లో వైసీపీ గెలవలేకపోయింది. టీడీపీ గెలుపులో ఎన్నిక వ్యూహాలది కూడా ముఖ్యపాత్ర అని గుర్తించిన జగన్ 2017లో ప్రశాంత్ కిషోర్ టీమ్ తో అవగాహనకొచ్చారు.ప్రశాంత్ కిషోర్ రాకతో జగన్ ప్రసంగాలలో,పథకాల ప్రకటనలలో స్పష్టమైన మార్పు వచ్చింది. పాదయాత్ర మొత్తం ప్రశాంత్ కిషోర్ టీమ్ మానిటర్ చేసింది.ఊహకందని స్థాయిలో వైసీపీ గెలిచింది.

ఈ నెలలో బెంగాల్​లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ లో ప్రశాంత్ కిషోర్ తృణమూల్​కు వ్యూహకర్తగా ఉన్నారు. మూడు సీట్లను మమతా గెలుచుకున్నారు.

తమిళనాడులో పీకే ఎవరికి పని చేయబోతున్నాడు?

అలాగే పీకే ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్​ పొలిటికల్​ యాక్షన్​ కమిటీ ( ఐ‌‌‌‌‌‌‌‌-పాక్​) తో తమిళనాడు సీఎం పళనిస్వామి ఈ ఏడాది జనవరిలో చర్చలు జరిపినా.. అవి విజయవంతం కాలేదు. మరోవైపు 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. తమిళ పురచ్చితలైవి జయలలిత, తమిళనాట అత్యంత సీనియర్ అయిన కరుణానిధి లేకుండా జరగబోతున్న మొదటి ఎలక్షన్లు ఇవే కావడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. రాజకీయపార్టీ పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సూపర్​స్టార్​ రజనీకాంత్​ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే కలిసి పనిచేస్తామని రజనీ​, కమల్​హాసన్​ ఇద్దరూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పీకే స్టాలిన్ వైపు వెళ్తారా?.. కమల్ తో కలిసి పని చేస్తారా?.. లేదా పళనిస్వామి వైపు ఆకర్షింపబడతాడా అనేది వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp