మాజీ ఎమ్మెల్యే శ్రీమతికి సిక్కోలు జెడ్పీ పీఠం

By Ramana.Damara Singh Sep. 25, 2021, 12:00 pm IST
మాజీ ఎమ్మెల్యే శ్రీమతికి సిక్కోలు జెడ్పీ పీఠం

అంకిత భావంతో పనిచేసేవారని గుర్తించి ప్రోత్సహించడంలో ముందున్న వైఎస్సార్సీపీ పరిషత్ ఎన్నికల్లో మరోమారు ఆ విషయాన్ని రుజువు చేసుకుంది. పార్టీనే నమ్ముకొని ప్రజలతో మమేకమయ్యేవారిని కీలక పదవులకు ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. రాజకీయాల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రంలో సగానికి పైగా సీట్లలో వారికే అవకాశం కల్పించారు. తాజాగా జరిగిన ఎంపీపీ, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లోనూ అదే విధానం అవలంభించారు. బీసీ మహిళకు రిజర్వ్ చేసిన శ్రీకాకుళం జెడ్పీ అధ్యక్ష పదవికి ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకురాలు, సంఘ సేవకురాలు పిరియా విజయను ఎంపిక చేశారు. జిల్లాలో 38 జెడ్పీటీసీ పదవులు ఉండగా ఎన్నికలు జరిగిన 37 స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా.. పిరియా విజయ కవిటి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు.

Also Read : తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం

పార్టీకి వెన్నుదన్నుగా

ఇచ్ఛాపురం నియోజకవర్గ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ సతీమణి అయిన విజయ పార్టీలో చేరినప్పటి నుంచి భర్తతోపాటు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆమె సాయిరాజ్ తో వివాహం అనంతరం మెట్టినింటికి వచ్చి కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామంలో నివాసం ఉంటున్నారు. భర్తకు చేదోడు వాదోడుగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. గతంలో సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ మహిళా విభాగం ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తున్నారు. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పార్టీ విజయానికి విశేష కృషి చేశారు. ఆమె సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం జెడ్పీ ఛైర్పెర్సన్ పదవికి మొదటి నుంచీ ఆమె వైపే మొగ్గు చూపింది. తర్వాత పలు పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. అధిష్టానం చివరికి విజయకే అవకాశం ఇచ్చింది.

Also Read : నాడు ఎమ్మెల్యే పదవి మిస్ ,నేడు జడ్పీ చైర్మన్

కిడ్నీ బాధితులకు విశేష సేవలు

ఉద్దానం ఫౌండషన్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న పిరియా విజయ.. దాని ద్వారా 2012 నుంచి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు సేవలు అందిస్తున్నారు. కిడ్నీ బాధిత పేద కుటుంబాలను దత్తత తీసుకొని విద్య, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. తన భర్త సాయిరాజ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చే జీతంతో 50 మంది కిడ్నీ డయాలసిస్ రోగులకు నెలకు రూ. 2 వేలు చొప్పున ఇచ్చేవారు. సోంపేట ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయించారు. అలాగే ఫ్లోరైడ్ సమస్య ఉన్న పలు గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించారు. చనిపోయిన కిడ్నీ బాధితుల కుటుంబాల్లోని పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తున్నారు. ఉద్దానం గ్రామాల నుంచి డయాలసిస్ చేయించుకునేందుకు తరచూ విశాఖ, శ్రీకాకుళం నగరాలకు వెళ్లే రోగుల రవాణా కోసం రెండు అంబులెన్సులు ఏర్పాటు చేశారు. సుమారు 200 గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఇన్ని రకాలుగా ఉద్దానం ప్రాంతానికి సేవ చేస్తున్న విజయకు ఇకనుంచి జిల్లా ప్రజలందరికీ సేవ చేసే అవకాశాన్ని వైఎస్సార్సీపీ కల్పించింది.

Also Read : విజయనగరం జెడ్పీ పీఠం చిన్న శ్రీనుకే..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp