కొండపై సిద్ధుడు, ఆకాశంలో శవయాత్ర

ప్రతి మనిషికీ కొన్ని వందల, వేల కథలుంటాయి. తానే ఒక కథ అనే విషయం చాలా మందికి తెలియదు. అదే ఒక ఊరైతే ఎన్ని కథలో! రాయదుర్గం లాంటి చిన్న వూళ్లో ప్రతిదీ కథే. రేడియో వార్తలు, మధ్యాహ్నం 2 గంటలకి వచ్చే న్యూస్ పేపర్ మాత్రమే బయటి వార్తలు చెప్పేవి. మిగతా అంతా మనుషుల మధ్య మాట్లాడుకునేవే. ఆ రోజుల్లో ఫోన్లలో కాకుండా నేరుగా మాట్లాడుకునేవాళ్లు. ఒక చిన్న విషయం గాలి నింపుకుని బెలూన్‌గా మారి , దాన్ని ఊదిన వాన్నే తికమక పెట్టేది. అందరూ మాట్లాడే సబ్జెక్ట్ అరుదుగా దొరికేది. ముగ్గురు కలిస్తే అక్కడ లేని నాలుగో వాన్ని గురించి మాట్లాడుకుంటారు. అది కామన్. ఒక్కోసారి వీటన్నిటికి మించి కావాలి.
రాయదుర్గం పట్టణంలో ఎక్కడ్నుంచి చూసినా పెద్ద కొండ కనిపిస్తుంది. అది సిద్ధుల కొండ. ఏడాదికోసారి పరుష (జాతర) జరిగేది. అప్పట్లో సిడిమాను తిప్పేవాళ్లు. ఒకప్పుడు కొండ కిందే వూరు. దాన్ని కోట అంటారు. ఆ కొండ పెద్ద డైనోసార్లా , నిలబడి ఉన్న ఏనుగులా అనిపిస్తుంది.
ఒకరోజు ఆ కొండపైన ఎత్తయిన గుండు మీద ఒకాయన కమండలం పట్టుకుని తపస్సు చేస్తూ కనిపించాడు. తెల్లారి వూరంతా షాక్. రాయదుర్గంలో వానలు రావాలని ఎవరో సిద్ధుడు తపస్సుకి కూచున్నాడట. నెలరోజులు అన్నం నీళ్లు లేకుండా వుంటాడట. లక్ష్మీబజార్లో గుంపులు గుంపులు జనం. కొంత మంది డబ్బులున్న వాళ్లు బైనాకులర్స్‌తో చూసి సిద్ధుడి గడ్డం మీసాలని కూడా వర్ణించారు. నా దగ్గర కూడా మద్దానసామి పరుషలో కొన్న బైనాకులర్ ఉండేది. 75 పైసలు పెట్టి కొన్నది. చాలా Costly. అయినా కూడా అన్ని వస్తువుల్ని బూజుబూజుగా చూపించేది. కొన్న వస్తువుని వృథా చేయకూడదని Wild life photographer లా, లేదంటే ఒక గుర్రపు పందెగాడిలా (రేస్ కోర్టులో అందరూ బైనాకులర్స్‌తో చూసి అరుస్తూ వుండడం సినిమాల్లో చూశాను) పరిశీలించి సిద్ధుడికి నెత్తిన కొప్పు వుందని, మీసాలు, గడ్డాలు వున్నాయని తీర్మానించాను. నా బైనాకులర్స్‌తో చూసిన మిగతా మిత్రులు కూడా సిద్ధున్ని వర్ణించి చెప్పారు. దేవతా వస్త్రాల కథనే అందరూ చెప్పారు.
సాయంత్రానికి కొందరు సిద్ధున్ని చూడనే చూశారు. కోటలో వున్న కొందరు ఆడవాళ్లు కొండ ఎక్కి ఆయనకి పూజ చేసి టెంకాయ కొట్టారట! కళ్లు తెరిచి రాయదుర్గానికి చెడ్డ కాలం వచ్చిందన్నాడట (1971లో దేశమే కష్టాల్లో ఉంది. రేషన్ షాపుల దగ్గర జనం కొట్టుకు చచ్చే కాలం. పిడికెడు అన్నం కోసం బిచ్చగాళ్లు ఇల్లిల్లూ తిరిగే కాలం). దీనికి నివారణగా ఆడోళ్లంతా ఎర్ర గాజులు వేసుకోవాలట.
ఇంకేం ఉంది దుకాణాల్లో ఎర్రగాజులు ఖాళీ. ఎర్రగాజులు లేకపోయినా ఫర్వాలేదు, కొత్తగాజులు వేసుకుంటే చాలని ఎవరో సవరణ చేశారు. గాజులోళ్లు ఖుషీ. ఇంతకీ ఆ సిద్ధున్ని చూసిన ఆడవాళ్లు ఎవరో ఎవరూ చూడలేదు.
బీడీల నీలకంఠప్ప అని ఒకాయన వుండేవాడు. ఆ వూళ్లో కాళహస్తి బీడీలు , టేబుల్ మార్క్ బీడీలు సేల్స్ ఎక్కువ. ఎంత ఎక్కువ బీడీలు తాగితే అంత లాభం ఆయనకి. ఇది కాకుండా ఆయనకి నిధి నిక్షేపాల మీద ఆసక్తి ఎక్కువ. ఆయనే అర్ధరాత్రి వెళ్లి సిద్ధుడితో మాట్లాడి రావడం కొందరు చూశారట. నాకేం సంబంధం లేదు, నేను అసలు ఇల్లు దాటి పోలేదని చెప్పినా ఎవరూ వినలేదు. నిధి రహస్యానికి సంబంధించిన మ్యాప్ ఏదో ఉండే ఉంటుందని దాన్ని కొట్టేసి ట్రెజర్ హంట్‌కి వెళ్లాలని నేను ఒక స్కెచ్ కూడా వేశాను.
రెండు రోజుల తర్వాత సబ్జెక్ట్ పాతబడి పోయింది. కథకి మెరుగులు దిద్దేవాళ్లు తగ్గిపోయారు. సిద్ధుడు హఠాత్తుగా మాయమ య్యాడు. అది గొర్రెల కాపరులు పెట్టిన గడ్డిబొమ్మని అందరూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
జీవితం స్లోగా నడుస్తూ ఉంటే సీన్లోకి నరసింహ వచ్చాడు. మా ఫ్రెండ్ చెన్నవీర ఇంట్లో వీడు వంటవాడు. వాళ్ల ఇంట్లో దాదాపు 20 మంది జనం. అందరికీ ఒంటి చేత్తో వడ్డించేవాడు. కాకపోతే మగాళ్లని చూసి సిగ్గుపడేవాడు, ఆడాళ్లతో కలిసిపోయేవాడు. వాడికి ఒక అర్ధరాత్రి ఆకాశంలో నలుగురు మనుషులు శవాన్ని ఎత్తుకెళుతున్న దృశ్యం కనిపించింది. లంచ్ బ్రేక్‌లో కనపడిన వాళ్లందరికీ చెప్పాడు.
అందరూ రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూశారు. నరసింహకే కాదు చాలా మందికి శవయాత్ర కనిపించింది. కనపడని వాళ్లు చాలా బాధపడ్డారు. తలని నిగిడించి చూసి చాలా మందికి మెడనొప్పి వచ్చింది. ఆముదం పెట్టి తోముకున్నారు. ఈ గ్యాప్‌లో నరసింహ సెలబ్రిటీ అయిపోయాడు. ఈ సారి కొంచెం వెర్షన్ మార్చాడు. పాడె మీద శవం లేచి నిలబడింది.
వాళ్లకీ వీళ్లకీ కాదు ఈ సారి ఏకంగా వెంకటేశ్వరస్వామి గుడి పూజారికే ఇది కనిపించిందని పుకారు వచ్చింది. అసలే ఆ పూజారి రెండో పెళ్లి చేసుకుని కష్టాల్లో ఉంటే ఇదో గోల. ఇదంతా అరిష్టం. పుట్టలో పాలు పోయడమే దీనికి విరుగుడని ఎవరో వేదాంతి సెలవిస్తే పాములన్నీ పారిపోయేన్ని పాలు పోశారు. (వినాయకుడు పాలు తాగుతాడంటే అర్ధరాత్రి నిద్రలేచి పరిగెత్తిన దేశం మనది) ఇన్ని కథలున్న ఊళ్లో పెరిగాను కాబట్టే ఒకటో రెండో కథలు రాయగలిగాను. అంతా అదృష్టం.


Click Here and join us to get our latest updates through WhatsApp