కరోనా వెంటాడుతున్నా.. వెనుకంజ వేయడం లేదు..

By Voleti Divakar May. 22, 2020, 05:32 pm IST
కరోనా వెంటాడుతున్నా.. వెనుకంజ వేయడం లేదు..

సుమారు రెండు నెలల లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా కట్టడి నుంచి క్రమంగా ప్రజలు బయటపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు సడలించింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. రోడ్డు రవాణా వ్యవస్థకు గతంలోనే అనుమతులు ఇచ్చారు. మే 17వ తే దీ నుంచి ఆర్టీసీ బస్సులను కూడా తిప్పుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి దేశీయ విమానాలకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రజలను గమ్యస్థానాలకు చేర్చేందుకు జూన్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో రోజూవారీ తిరిగే ప్రధాన రైళ్లతో పాటు, దురంతో, జనశతాబ్ది వంటి రైళ్లు కూడా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రాష్ట్రాల మీదుగా 100 రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. గోదావరి, కోణార్క్, గోల్కొండ, ఫలక్ నుమా, సంఘమిత్ర, ఎపి, హౌరా-యశ్వంత్ పూర్ దురంతో రైళ్లు నడుస్తాయి. గతంలో ఉన్న కాలమానం ప్రకారమే ఈరైళ్లు నడుస్తాయని తెలిపారు. అలాగే గతంలో ఆగే స్టేషన్లలోనే ఈరైళ్లకు స్టాపులు ఇచ్చారు. గురువారం నుంచి 30రోజుల ముందుగా రిజర్వేషన్లకు అవకాశం కల్పించగా, ఇప్పటికే రిజర్వేషన్లు దాదాపు పూర్తిగా నిండుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడు చేసుకుని, ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకున్న వారినే స్టేషన్ లోకి అనుమతించి, రైళ్లు ఎక్కేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రయాణీకులు తప్పని సరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. స్టేషన్లో రైళ్లు ఎక్కేవారందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే రైల్లోకి అనుమతిస్తారు. ఆయా రైళ్లలో సీటింగ్ ల మధ్య భౌతిక దూరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ కోచ్ లో కూడా భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే సాధారణ కోచ్ లో ప్రయాణించే వారు స్లీపర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రయాణీకుల సౌకర్యార్థం రిజర్వేషన్ కౌంటర్లను కూడా శుక్రవారం నుంచి తెరిచారు. ఎపిలోని విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో మొత్తం 44 రైల్వే స్టేషన్లో, తెలంగాణాలోని సికింద్రాబాద్, హైదరాబాద్ లో పాటు 18 రైల్వేస్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు తెరిచారు. మహారాష్ట్రలో 6, కర్నాటకలోని 5 స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు తెరిచారు. గతంలో మాదిరిగా ఇవి పని చేస్తాయని అధికారులు ప్రకటించారు. ఐతే పూర్తి స్థాయిలో రైళ్లు నడిస్తే గాని రద్దీ తగ్గే అవకాశం లేదు. కరోనా భయాలు వెంటాడుతున్నా ప్రయాణాలపై ప్రజలు వెనుకంజ వేయడంలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp