పవన్ కళ్యాణ్ పయనం ఎటువైపు?

By Suresh 19-11-2019 07:51 AM
పవన్ కళ్యాణ్ పయనం ఎటువైపు?

అన్న చిరంజీవి అండదండలతో ,ఆశీస్సులతో సులభంగా సినీరంగ ప్రవేశం చేసిన "పవన్ కళ్యాణ్" తొలుత తడబడ్డా తనదైన నటనా శైలితో ,ప్రత్యేకమైన మానరిజంతో తనకంటూ వేలాదిమంది అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. వైవాహిక జీవితంలోని ఒడిదుడుకులను అధిగమించి సహ నటి,స్నేహితురాలు అయిన రేణూదేశాయ్ తో తన స్వీయ దర్శకత్వంలో జానీ సినిమా చేశాడు. అది పెద్దగా జనాదరణకు నోచుకోలేదు.అడపా దడపా సినిమాలు చేసుకుంటున్న సమయంలో అన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్న ఘటనలో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయమున్నదని, ఆవేశంతో తన దగ్గరున్న లైసెన్స్ రివాల్వర్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ దానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. తర్వాత ఆ సంస్థ ఏమైందో ఎవరికీ తెలియదు.2008 వ సంవత్సరంలో తన సోదరుడు చిరంజీవి సామాజిక న్యాయమే లక్ష్యంగా స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రమంతా ప్రచారం చేశాడు. ప్రచార సమయంలో కాంగ్రెస్ నాయకుల పంచలూడగొట్టి తరమండి అని సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ ఆ ఎన్నికల అనంతరం తెరమరుగయ్యాడు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు,గణనీయమైన ఓటు శాతం సంపాదించినా చిరంజీవి ఎక్కువ కాలం పార్టీ నడపలేక కాంగ్రెస్ లో కలిపేశాడు.

తెలంగాణ ఏర్పాటు తథ్యమైన నేపథ్యంలో పార్లమెంట్ లో రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర పడిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. రాష్ట్రంలో తీవ్రమైన భావోద్వేగాలు నెలకొన్న సమయంలోనే 2014 లో ప్రజల కోసం ప్రశ్నించే ఆశయంతో జనసేన పార్టీ ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికలలో తాను కానీ,తన పార్టీని కానీ ఎన్నికల బరిలో నిలపకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపాడు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. చంద్రబాబు పరిపాలనా దక్షతపై ఎనలేని విశ్వాసాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తదనంతర కాలంలో ఆ పార్టీ వైఫల్యాలపై ప్రశ్నించకపోగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పనికి వచ్చాడు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం గళమెత్తినపుడల్లా ఆధికారపక్షాన్ని ఇరుకున పెట్టకుండా ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయాడు.

రాజధాని భూముల విషయంలో, అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో ,ఉద్ధానం బాధితుల విషయంలో బాబుపై నాకు నమ్మకముందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసి అధికార పక్షానికి అండగా నిలబడటానికి ప్రయత్నం చేశాడు. కాపు రిజర్వేషన్ల అంశంలో సకాలంలో సరియైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యాడు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడినపుడల్లా వాటిని‌ నిర్వీర్యం చేయడానికి తెదేపా చేతిలో పవన్ పావుగా వాడబడ్డాడనే అభిప్రాయం ప్రజలలో బలంగా నాటుకొని పోయింది. పవన్ ఎక్కడ సభ నిర్వహించినా ఆ సభకు జన సమీకరణ, పవన్ విమాన ఛార్జీలు కూడా తెదేపా స్పాన్సర్ చేసేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. గత తెదేపా హయాంలోని ఆఖరు రోజులలో కొన్ని సభలలో తెదేపాను, లోకేశ్ ను విమర్శించే సరికి అంతవరకూ పొగిడిన నేతలే తెగడుతూ పాతాళంలోకి నెట్టేసినంత పని చేశారు.

రాజకీయ పార్టీలకు కార్యకర్తలే బలం. గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణమే ఆయువుపట్టు. పార్టీ ప్రారంభించి ఏళ్ళు గడుస్తున్నా ఏ రోజు పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి పెట్టలేదు. 2019 ఎన్నికలలో చివరి వరకు తెలుగుదేశంతో పొత్తుకు ప్రయత్నించిన పవన్ ఆ ప్రయత్నం విఫలం కావడంతో బీఎస్పీ, కమ్యూనిస్టు లతో ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికలలో తాను పోటీ చేసిన రెండు స్థానాలు ఓడిపోయినా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవడంతో అసెంబ్లీలో ఖాతా తెరిచినట్లయింది. ఇలాంటి తరుణంలో పార్టీకి అభిమానులే కాకుండా గ్రామస్థాయి కార్యకర్తలతో పాటు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయవలసిన అవసరం ఉన్నది.‌ పార్టీ కార్యక్రమాలను సభలను కేవలం‌ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ లలాగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి నిదర్శనం జనసేన పార్టీ.

ఈ ఫలితాల అనంతరం నిజాయితీగా సమీక్ష చేసుకుని ఆత్మవంచన లేకుండా వైఫల్యాలను సరిచేసుకుని ముందుకు సాగితే పార్టీ పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఎవరు ఔనన్నా కాదన్నా జనసేన పార్టీకి ప్రతి‌ నియోజకవర్గంలో ఐదు శాతం ఓటుబ్యాంకు ఉన్నది. ఈ ఓటుబ్యాంకుకు అదనంగా మరింత‌మంది ప్రజల‌ మద్దతు ఎలా కూడగట్టాలన్నదే జనసేన ముందున్న తక్షణ కర్తవ్యం. అరువు తెచ్చుకున్న గొంతులు కాకుండా సొంత గొంతు వినిపిస్తూ తెదేపా బీ టీమ్ అనే విమర్శను తుడిచేసుకుని, గ్రామ కమిటీలు,మండల కమిటీలు,జిల్లా కమిటీల లాంటి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటే తప్ప జనసైనికుల ఆశలు భవిష్యత్తులో ఎప్పుడైనా నెరవేరే అవకాశముంది.

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ కమ్మలందరూ తెలుగుదేశానికి, రెడ్డి కులస్థులందరూ వైసీపీకి పోలరైజ్ అవుతున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గం తమని నడిపించే బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నది. ఆ స్థానాన్ని పవన్ అందిపుచ్చుకోవడానికి అడుగులు వేయడం లేదు.పవన్ కళ్యాణ్ పర్యటనల సమయంలోనూ,పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలలోనూ చేతి చమురు వదిలించుకుంటున్న ద్వితీయ శ్రేణి నాయకులు పవన్ కళ్యాణ్ తన పంథాను మార్చుకుని, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధిగా పోరాటం చేసి,ఇతర పార్టీల ముద్రలు లేకుండా ప్రజామోదం పొందితే తప్ప రాజకీయ క్షేత్రం లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేడు.ఇటీవలి కాలంలో పవన్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయనే గుసగుసల నేపథ్యంలో రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోతాడేమో నని పవన్ అభిమానులు విశ్వసిస్తున్నారు.

idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News