చంద్రబాబు అస్త్రంగానే మిగిలిపోతాడా? లక్ష్యం ఉన్న నాయకుడిగా ఎదగలేడా?

By Ravoori.H 13-11-2019 04:53 PM
చంద్రబాబు అస్త్రంగానే మిగిలిపోతాడా? లక్ష్యం ఉన్న నాయకుడిగా ఎదగలేడా?

రాజకీయరంగ ప్రవేశం చేసి పది సంవత్సరాలు గడిచిన  తర్వాత కూడా పవన్ కళ్యాణ్‌లో నిలకడలేనితనం కనిపిస్తూనే ఉంది. రెగ్యులర్ పొలిటీషియన్‌లా కాదు.......నన్ను రాజకీయ వేత్తలా, లీడర్‌లా చూడండి అని పవన్ చాలా గొప్పగా మాటల్లో చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు అంత గొప్పగానూ మాట్లాడతారు కూడా. కానీ ఆ మరుక్షణమే తాటతీస్తా, విజయవాడ నడిబొడ్డులో చూసుకుందామా అంటూ మరీ జేసీ ప్రభాకరరెడ్డి లాంటి నాయకుల్లా సిగ్రేడ్ పాలిటిక్స్ చేస్తాడు. అసలు ఈ తొడగొట్టుడు రాజకీయాలు ఎప్పటివి? ఈ జనరేషన్ జనాలు ఇలాంటి మాటలను సహిస్తారా? రాయలసీమ రౌడీయిజం, పులివెందుల ఫ్యాక్షనిజం అంటూ చంద్రబాబు మాటలనే పలుకుతూ తన స్థాయిని  తానే తగ్గించుకుంటున్నాడు.చంద్రబాబు పులివెందుల గూండాలు ,కడప రౌడీలు,రాయలసీమ సంస్కృతి ,ఫ్యాక్షన్  అన్నందుకే మొన్నటి  ఎన్నికల్లో టీడీపీని కేవలం మూడు స్థానాలకు పరిమితం చేశారు. పరిటాల,జేసీ ,కోట్ల,కేఈ ,భూమా,బొజ్జల... ఇలా పార్టీని మించి సొంత బలం ఉన్న నాయకులు కూడా ఓడిపోయారు,దీన్ని కేవలం రాజకీయ తీర్పుగా కాకుండా ఆ ప్రాంత ఆత్మగౌరవ స్పందనగా  చూసి రాయలసీమ,గూండాలు,ఫ్యాక్షన్ అనటం మానుకోండి.

చంద్రబాబు కోసం ,చంద్రబాబు తరహాలో రాజకీయమా?

2014 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించడంలో పవన్ కళ్యాణ్‌ది ప్రధాన పాత్ర అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. చంద్రబాబు హామీలను జనాలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఆ హామీలకు నేను పూచీ అని చెప్పుకున్నాడు పవన్. కానీ బాబు గెలిచిన తర్వాత మాత్రం ప్రజల తరపున పోరాడడం మానేసి ఆయన తరపున వకాల్తా పుచ్చుకుని ప్రజల సమస్యలన్నింటికీ ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్ కారణం అని చెప్తూ చరిత్రలో ఏ నాయకుడూ చేయని వింత రాజకీయం చేశాడు. అందుకే నాయకుడిగా కనీసం తను కూడా గెలవలేకపోయాడు. చంద్రబాబుతో రాసుకుపూసుకు తిరగడమే ఓటమికి ప్రధాన కారణం అని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎన్నికలయ్యాక తేల్చి చెప్పాడు. అదే మాట పవన్ కళ్యాణ్‌కి చెప్పాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సంతోషం కోసం, పచ్చ మీడియా జనాల ఆనందం కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోందని స్వయంగా పవన్ అభిమానులే చెప్పుకునే పరిస్థితి పవన్ కొనితెచ్చుకుంటున్నారు. 

చంద్రబాబు సృష్టించిన సమస్యల పరిష్కారం ఎలా?

ఇసుక సమస్యకు జగనే కారణం అని చంద్రబాబు ఎన్నైనా మాట్లాడొచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు 18 నెలల ముందు నుంచే ప్రజా సమస్యలు, పాలన అన్నీ గాలికొదిలేసి కేవలం ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా రేయింబవళ్ళూ వర్క్ చేసిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కుంటున్న చాలా సమస్యలకు కారణం అని పవన్‌కి తెలియదా? జగన్ కొత్త ప్రభుత్వం సమస్యల పరిషారంలో ఇబ్బందులు ఎదుర్కొన్నది,కొన్ని విషయాలలో అనుకున్న స్థాయిలోపరిష్కారం చేయలేకపోయింది. అలాగే జీతాల చెల్లింపులు, విత్తన పంపిణీ, ఇసుక సమస్యతో సహా అన్ని విషయాల్లోనూ చంద్రబాబు పాపం ఎంతో ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు విస్పష్టంగా చెప్పి ఉన్నారు. బాబు మిగిల్చిన కొన్ని వేల కోట్ల పెండింగ్ బిల్లులు, రుణాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం అష్టకష్టాలూ పడి తీరుస్తున్నపరిస్థితిని ఆర్థిక విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబులాగే, పచ్చ మీడియా వాయిస్‌లానే అన్నింటికీ జగనే కారణం అని పచ్చ పాట పాడుతున్నాడు. 

పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా ఎందుకు చూడలేదు?

2019ఎన్నికల ముందు వరకూ కూడా బాబు భజన చేసిన పవన్ ఎన్నికల ముందు మాత్రం సడన్‌గా చంద్రబాబు, లోకేష్‌లపై ఒక స్థాయిలో రెచ్చిపోయాడు. టిడిపి అవినీతి, అసమర్థత, అక్రమాలపై నాలుగేళ్ళుగా జగన్ చెప్తున్న మాటలను పవన్ ఇంకా బలంగా చెప్పాడు. అది ఒకరకంగా జగన్‌కి కూడా కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణే ఐదేళ్ళు తిరిగేసరికి అదే చంద్రబాబుపై ఓ స్థాయిలో విమర్శల వర్షం కురిపించడంతో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు చంద్రబాబు ఏ స్థాయిలో నష్టం చేశాడో, బాబు అవినీతి, అక్రమాలు ఏంటో ప్రజలకు క్లియర్‌గా అర్థమైంది. కానీ మళ్ళీ ఏ క్షణమైనా బాబుతో కలిసే అవకాశం ఉంది, ఇప్పుడు బాబును విమర్శించడం కూడా డ్రామానేమో అని ఎక్కువ మంది ప్రజలు నమ్మడంతో పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా ఎవ్వరూ చూడలేదు. అందుకే ఘోరంగా ఓడించారు. రుణమాఫీలాంటి హామీలు బూటకం అని 2014ఎన్నికలకు ముందు నుంచీ బాబుకు వ్యతిరేకంగా నిజాలు చెప్తూ, అలాగే బాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కుని చంద్రబాబుతో పాటు పచ్చ మీడియాను కూడా ఎదుర్కుని నిలబడిన జగన్‌కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

ఇప్పుడు మీడియా ఎందుకు పవన్ కళ్యాణ్‌కు కవరేజ్ ఇస్తుంది ?

ఇవన్నీ కూడా కంటిముందు కనిపిస్తున్న నిజాలు. ప్రజలందరికీ తెలిసిన విషయాలు. కానీ పవన్‌కి మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ట్రాప్‌లోనే, పచ్చ మీడియా హైలైట్స్ కోసమే రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. జగన్‌రెడ్డి.......రెడ్డి అని ఒత్తి పలకుతూ ఎటకారం చేసిన పవన్ ఇప్పుడు వైసిపి నాయకులచేత పవన్ నాయుడు అని అనిపించేవరకూ తెచ్చుకున్నాడు. మంత్రులు కూడా కౌంటర్ గా అయినా కొత్తగా పవన్ "నాయుడు" అనటం అనవసరం.ఇప్పుడు కొత్తగా ఎవరి కులాన్ని ప్రజలకు గుర్తుచెయ్యవలసిన అవసరం లేదు. ఈ ఐదేళ్ళపాటు బాబు పలుకులు పలుకుతూ పవన్ కళ్యాణ్ రాజకీయం చేసినా ఎన్నికల సమయానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం చంద్రబాబుకు పడేలా పచ్చ మీడియా చేస్తుందనడంలో సందేహం లేదు.ఎన్నికలనాటికి బాబే దిక్కు.......పవన్ కళ్యాణ్ తుక్కు అని ఇదే పచ్చ మీడియా ఓ రేంజ్‌లో రాతలు రాస్తుందని పవన్ అభిమానులు కూడా చెప్తున్నారు. ప్రజారాజ్యం విషయంలో "ముందు లేపి తరువాత తొక్కేశార"న్న చిరంజీవి మాటలు పవన్ గుర్తుంచుకోవాలి.

ఈ రాజకీయంతో పవన్ సాధించేది ఏంటి?

చంద్రబాబు పెద్దకొడుకు, ప్యాకేజ్‌కి అమ్ముడుపోయాడు లాంటి విమర్శలను ఇప్పటికే చాలామంది నమ్ముతున్నారు, పవన్ ఇదే తరహా  రాజకీయాన్ని కొనసాగిస్తే ప్రజలందరు కూడా ఈ మాటలను నమ్ముతారు,ఆ పరిస్థితి రాకముందే గాలివాటం అడుగుల రాజకీయం కాకుండా...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో తానే ఒక ప్రత్యామ్నాయంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పవన్ కళ్యాణ్ రాజకీయం ఉంటే తప్ప జనసేన పరిస్థితి మెరుగుపడదు లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా ఉంటుందనడంలో సందేహం లేదు. ఒక్కోసారి పవనే చెప్తున్నట్టుగా పాతికేళ్ళ రాజకీయ ప్రయాణం అనుకున్నా కూడా పాతికేళ్ళ తర్వాత సడన్‌గా ఫలితం వచ్చెయ్యొదు కదా. ఐదేళ్ళ పయనం తర్వాత తప్పులు, తప్పటడుగులు పక్కనపెడితే ఎన్ని ముందడుగులు పడ్డాయో పవన్ విశ్లేషించుకోవాలి కదా. వచ్చే ఐదేళ్ళ వరకూ కూడా లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఎలాంటి వ్యూహాలు, సిద్ధాంతాలు ఉండాలో ప్రణాళిక ఉండాలి కదా. అలాంటివేమీ లేకుండా పచ్చ మీడియాలో హెడ్‌లైన్స్ వార్తల కోసం గాలివాటు రాజకీయాలు చేస్తూ ఉంటే పవన్ అనుకున్న గమ్యం చేరుకునేది ఎప్పటికి? ఎలా? అని విశ్లేషకులు విశ్లేసిస్తున్నారు. వినే నాయకులు ఉండాలే కానీ కాస్త ఆలోచనాపరులయిన పవన్ అభిమానుల నుంచి కూడా ఇలాంటి సందేహాలే వినిపిస్తున్నాయి. వింటారా? సరైన అడుగులు వేస్తారా? చూడాలి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News