ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడమే టీడీపీ లక్ష్యమా..?

By Karthik P Apr. 06, 2021, 09:00 pm IST
ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడమే టీడీపీ లక్ష్యమా..?

పరిషత్‌ ఎన్నికల ప్రచారం ముగిసి, మరో 36 గంటల తర్వాత పోలింగ్‌ జరుగుతుందనగా టీడీపీ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎన్నికలు ఆగిపోయాయి. ఎన్నికలకు 4 వారాల సమయం ఉండాలన్న సుప్రిం తీర్పును ఎన్నికల సంఘం పాటించలేదన్న టీడీపీ వాదనతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. ఇది కొత్త నోటిఫికేషన్‌ కాదని, వాయిదా పడిన ప్రక్రియను తిరిగి ప్రారంభించామని, సుప్రిం తీర్పు వర్తించదన్న తమ వాదనను పరిగణలోకి తీసుకోని సింగిల్‌ జడ్జి తీర్పును.. ఎస్‌ఈసీ డివిజనల్‌ బెంచ్‌లో సవాల్‌ చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. అక్కడ తీర్పు ఏమి వస్తుందో.. దాదాపు అదే ఫైనల్‌.

కోర్టు వ్యవహారాలను కాసేపు పక్కనపెడితే.. అసలు టీడీపీ లక్ష్యం ఏమిటి..? అనే అంశంపై చర్చించుకోవాల్సిన సమయం ఇది. నామినేషన్లు వేసి, ఎస్‌ఈసీ తుది జాబితా ప్రకటించిన తర్వాత గత ఏడాది మార్చిలో పరిషత్‌ ఎన్నికలు కరోనా వల్ల వాయిదా పడ్డాయి. ఎక్కడ ఆగాయో తిరిగి అక్కడ నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు నూతన ఎస్‌ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్‌ జారీ చేయగానే.. రకరకాల కారణాలు చెబుతూ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆయన చెప్పిన కారణాలలో ప్రధానమైనది.. నీలం సాహ్ని ఆధ్వర్యంలో తమకు న్యాయం జరగదని.

ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ చెప్పినా.. బ్యాలెట్‌లో ఆ పార్టీ అభ్యర్థులు, గుర్తు తప్పక ఉంటుంది. కాకపోతే ప్రచారం నిర్వహించరు. ఎన్నికల ప్రారంభంలో తీసుకోవాల్సిన బహిష్కరణ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రక్రియ మధ్యలో ఉండగా తీసుకోవడం పలాయనవాదమే అవుతుందని చంద్రబాబు మద్ధతుదారులైనా సీపీఐ నారాయణ వంటి నేతలు బహిరంగంగా ప్రకటించారు. బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కొంత మంది టీడీపీ నేతలు బరిలో నిలుచున్నారు. ఎవరు ఏమనుకున్నా.. ఎన్నికలను బహిష్కరిస్తున్నామనే ప్రకటనకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారు.

Also Read : పరిషత్‌ ఎన్నికలకు హైకోర్టులో బ్రేక్‌

మరి ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పిన టీడీపీ.. ఎన్నికల కోడ్‌ను నాలుగు వారాల పాటు పాటించడం లేదని కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి..? ఎన్నికలను బహిష్కరిస్తున్న వారికి కోడ్‌తో ఇక పనేముంటుంది..? అనే ప్రశ్నలు సాధారణంగానే మెదులుతాయి. ప్రజా స్వామ్యాన్ని రక్షించేందుకే టీడీపీ కోర్టులకు వెళ్లిందనుకున్నా.. కోర్టులకు వెళ్లడం కన్నా.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రధానమైనది ఎన్నికల్లో పోటీ చేయడం.. మరి ఆ పని టీడీపీ చేయడం లేదు కదా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

టీడీపీ వ్యవహారం గమనిస్తే.. ఆ పార్టీ లక్ష్యం ఏమిటో అవగతమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుకున్నది జరగకూడదు. అదే కాదు ఆ ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు కూడా అమలు జరగకూడదనేదే టీడీపీ లక్ష్యమని ఇంగ్లీష్‌ మీడియం సహా పలు అంశాలపై కోర్టులకు వెళ్లడంతో ఇట్టే తెలిసిపోతుంది.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఏర్పాట్లు చేస్తోన్న క్రమంలో.. రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ టీడీపీ కర్నూలు నేత కోర్టులకు వెళ్లారు. హైకోర్టు ఎన్నికలు జరగాలని ఆదేశించినా.. ఆ తీర్పుపై మళ్లీ సుప్రింకు వెళ్లారు. రిజర్వేషన్ల వివాదం తేలాక.. నోటిఫికేషన్‌ వచ్చింది. మార్చి 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించి.. బడ్జెట్‌కు ఇబ్బందిలేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే.. కరోనాను సాకుగా చూపి మార్చి 15వ తేదీన అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలను 45 రోజుల పాటు వాయిదా వేశారు. ప్రభుత్వం లక్ష్యం దెబ్బతిన్నది.

కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న గత ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. నిమ్మగడ్డను టీడీపీ నేతలు కూడా వెనకేసుకొచ్చారు. ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం పారిపోతోందని అవహేళనలు చేశారు. సవాళ్లు విసిరారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెప్పినా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగాలని కోరుకున్నా.. అవి పట్టించుకోని నిమ్మగడ్డ కోర్టులో కేసులు ఉన్నా.. ఏక పక్షంగా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Also Read : తదుపరి సీజేఐ నియామకంపై రాష్ట్రపతి ఉత్తర్వులు

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ముగిసాయి. ఆరు రోజుల్లో ముగిసే పరిషత్‌ ఎన్నికలు కూడా పూర్తయితే కరోనా వ్యాక్సినేషన్‌పై పూర్తిగా దృష్టి పెట్టవచ్చని ప్రభుత్వం భావించింది. ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డను కోరింది. అయితే అందుకు భిన్నంగా రెండు వారాలపాటు మౌనంగా ఉన్నా నిమ్మగడ్డ.. పదవీ విరమణకు ఆరు రోజులు ఉందనగా.. నాకు సమయం లేదంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆశించినట్లుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఆటంకాలు తొలగలేదు. ఫలితంగా కేవలం వార్డు సచివాలయాల్లోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 1వ తేదీన ప్రారంభమైంది.

గ్రామాల్లోనూ 45 ఏళ్లుపైబడిన వారికి వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ ప్రారంభించే లక్ష్యంతో ఎన్నికలు నిర్వహించాలని సీఎస్‌ ఆధిత్యానాథ్‌ దాస్‌ ఎస్‌ఈసీ నీలం సాహ్నికి విన్నవించారు. పరిషత్‌ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన ఎస్‌ఈసీ.. ఎలాంటి ఆటంకాలు లేవని నిర్థారించుకున్న తర్వాత నోటిఫికేషన్‌జారీ చేస్తే.. నాలుగు వారాల కోడ్‌ అమలు చేయలేదంటూ టీడీపీ కోర్టుకు వెళ్లింది. డివిజనల్‌ బెంచ్‌లో ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు వసే.. ప్రభుత్వం ఆశించినట్లు గ్రామాల్లో ఈ నెల 10వ తేదీ తర్వాత వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుంది. లేదంటే.. మరికొన్ని రోజులు ఆలస్యం కాకతప్పదు.

మొత్తం మీద టీడీపీ చేస్తున్న కోర్టుల రాజకీయం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు గండికొడుతున్నా.. అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. ఈ విషయం ప్రజలు గమనిస్తే.. టీడీపీకి ఆపార నష్టం జరగకమానదు.

Also Read : చంద్రబాబును బహిష్కరిస్తున్నారు.. !

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp