మళ్లీ బీజేపీ భుజాలపైకి చంద్రబాబు..?

By Ramana.Damara Singh Apr. 06, 2021, 10:00 pm IST
మళ్లీ బీజేపీ భుజాలపైకి చంద్రబాబు..?

గ్రామస్థాయిలో పటిష్టమైన నెట్వర్క్ ఉంది.. 30 శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉంది.. అయినా కుంటిసాకులతో చంద్రబాబు ఎందుకు పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారో అర్థంకాక పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. 'మీరు ఉన్నత పదవులు చేపట్టడానికి ఎమ్మెల్యే ఎన్నికలు అవసరం గానీ.. మేం స్థానిక పదవులు చేపట్టడానికి ఉపకరించే పరిషత్ ఎన్నికలు అవసరం లేదా?..అంటూ పార్టీ కార్యకర్తలు బాబు నిర్ణయంపై మండిపడ్డారు. తాజా పరిణామాలు చూస్తుంటే వారి ఆరోపణల్లో, ఆవేదనలో వాస్తవం ఉందనిపిస్తోంది. చంద్రబాబు పక్కా వ్యూహంతోనే ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది.


స్వీయ ప్రయోజనాల కోసం కిందిస్థాయి నేతలు బలి..

40 ఇయర్స్ ఇండస్ట్రీగా తనను తాను చెప్పుకొనే చంద్రబాబు ఏపని చేసినా దాని వెనుక ఏదో పరమార్ధం ఉంటుందని, తనకు ప్రయోజనం ఉంటుందని నమ్మితే తప్ప ఏ నిర్ణయం తీసుకోరన్నది ఆయన్ను దగ్గరగా గమనించినవారు చెప్పే మాట. పరిషత్ ఎన్నికల బహిష్కరణ వెనుకా దీర్ఘకాల వ్యూహం ఉందని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయ పరంపర పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగడం, పార్టీ క్యాడర్ చేజారిపోతుండటం తదితర పరిణామాలతో చంద్రబాబుకు భవిష్యత్తు పై బెంగ పట్టుకుంది. ఒంటరిగా పోటీ చేస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టి మునగడం ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన ఆయన బీజేపీని మచ్చిక చేసుకునేందుకు బహిష్కరణ రాగం అందుకున్నారు.

అధికారం దూరమైనప్పటి నుంచే బీజేపీపై ప్రేమ

వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయి.. అధికారానికి దూరమైనప్పటి నుంచే చంద్రబాబు వైఖరి మారిపోయింది. ఎన్నికల వరకు బీజేపీని, మోదీని తిట్టిపోసిన చంద్రబాబు.. మాజీ అయిన తర్వాత పలు సందర్భాల్లో ప్రేమ కురిపిస్తూ దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నా పల్లెత్తు మాట అనడానికి కూడా ప్రయత్నించకపోగా.. కోవిడ్ సంక్షోభంలో మీ నిర్ణయాలు భేష్ అంటూ ప్రేమలేఖలు కూడా రాశారు.

Also Read : ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడమే టీడీపీ లక్ష్యమా..?

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే జగన్ను తట్టుకొని నిలబడలేమని భావిస్తున్న చంద్రబాబు.. బీజేపీ-జనసేన కూటమితో జతకట్టాలని ఇప్పటి నుంచే జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. అందుకోసమే ఆ కూటమికి పరిషత్ ఎన్నికల్లో లైన్ క్లియర్ చేసి ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే పార్టీ, క్యాడర్ అవకాశాలను ఫణంగా పెట్టి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం ప్రకటించేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఎలాగూ లేవు. అటువంటప్పుడు పోటీ చేసేకంటే.. తమ పార్టీ తర్వాత స్థానంలో ఉన్న బీజేపీ-జనసేన కూటమికి అవకాశం ఇస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారిని వాడేసుకోవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లోనూ సరిగ్గా ఇదే అభిప్రాయం, అనుమానం వ్యక్తం కావడం విశేషం. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రజాక్షేత్రంలో జగన్ను ఎదుర్కోలేక చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటూనే.. మరోవైపు కోర్టులో కేసులు వేసి ఎన్నికలను అడ్డుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారని.. మళ్లీ కేంద్రంలో ఉన్నవారి భుజాలు ఎక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబు నిర్ణయాలు ఆ అనుమానాలనే బలపరుస్తున్నాయి.

అవకాశవాదం బాబు జన్మహక్కు

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబుకు కొత్తకాదు. ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న ఆయన ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేయలేదు. అలాగని ఏ ఒక్క పార్టీతోనూ స్థిరంగా మైత్రి కొనసాగించలేదు. ఎప్పుడు ఎవరితో కలిసొస్తుందనుకుంటే.. అప్పుడు వారితో కలిసిపోవడం..తర్వాత వదిలేయడం అలవాటు. 1996లో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి అంటూ యునైటెడ్ ఫ్రంట్ తో జట్టు కట్టారు. ఆ ప్రయోగం విఫలం కావడంతో 1998లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గూటికి చేరారు.

2004లోనూ బీజేపీతోనే ఉన్నారు. ఓటమి తర్వాత బీజేపీని వదిలేశారు. 2009లో కొత్త మిత్రులతో చేతులు కలిపారు. టీఆర్‌ఎస్, కమ్యునిస్టులతో జతకట్టారు. ఓటమిపాలయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత బీజేపీతో దోస్తికి ఆసక్తి చూపారు. 2014లో మోడీ హవాలో గట్టెక్కారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీ హ్యాండ్‌ ఇచ్చారు. ఎన్నికల్లో ఆ పార్టీపై, ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోదీకి భార్య, కుటుంబం లేదన్నారు. బాబు అంచనాలు తప్పాయి. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్నారు. కట్‌ చేస్తే.. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే మళ్లీ బీజేపీతో దోస్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

2024 ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అవసరం తప్పదేమోనని చంద్రబాబుకు అనిపిస్తున్నట్లుంది. అందుకే పార్టీ అవకాశాలను బలిచేసైనా కమలదళాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే పాట్లు పడుతున్నారు.

Also Read : పరిషత్‌ ఎన్నికలకు హైకోర్టులో బ్రేక్‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp