పరకాల ప్రభాకర్ కి మళ్లీ స్థానభ్రంశం, మహా టీవీ నుంచి ఔట్

By Raju VS Aug. 14, 2020, 08:00 pm IST
పరకాల ప్రభాకర్ కి మళ్లీ స్థానభ్రంశం, మహా టీవీ నుంచి ఔట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఏపీ రాజకీయాల్లో అందరికీ చిరపరిచతుడైన పరకాల ప్రభాకర్ కి మరోసారి స్థానభ్రంశం జరిగింది. ఇప్పటికే అనేక పోస్టులు మారిన ఈసారి మహాటీవీ నుంచి నిష్క్రమించారు. 9 నెలల ప్రస్థానంలో ఆయన మహాటీవీ ని ఉద్దరిస్తామని చెప్పిన మాటలు ఆచరణ రూపం దాల్చకపోవడంతో ఆయన తీరుతో యాజమాన్యం నిరాశకు గురయ్యిందని చెబుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన్ని తొలగించేందుకు అనుగుణంగా ఏకంగా చానెల్ యాజమాన్యం కూడా మార్చేసినట్టు కనిపిస్తోంది.

వాస్తవానికి బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేత సుజనా చౌదరి సారధ్యంలో ఈ చానెల్ ను పరకాలకి అప్పగించారు. ఎన్నికలకు ముందు టీడీపీ వాదన వినిపించేందుకు వంశీ నేతృత్వంలో ఈ చానెల్ నడిపారు. తొలుత ఐ వెంకట్రావు ప్రారంభించిన ఈ చానెల్ పెద్దగా ప్రజాదరణ సంపాదించలేకపోయింది. నామమాత్రపు ఇమేజ్ తో నెట్టుకొచ్చారు. చివరకు ఆయన తప్పుకుని టీడీపీ అధిష్టానం వెనుక ఉండి నడిపించిన వ్యక్తులకు అప్పగించారు. ఆ సమయంలో ప్రస్తుతం టీవీ5లో ఉన్న మూర్తి వంటి వారు కొంత హడావిడి చేశారు. శ్రీ రెడ్డి వంటి వారి ఎపిసోడ్ ని కూడా ఈ చానెల్ నడిపించిందనే అభిప్రాయం ఉంది.

ఇలాంటి నేపథ్యంలో చివరకు గత ఏడాది డిసెంబర్ పరకాల ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఈటీవీలో ప్రతిధ్వని వంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉండడం, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం లో సలహాదారుడిగా మీడియా వ్యవహారాలను చూసిన నేపథ్యంలో పరకాల ఆధ్వర్యంలో మహా టీవీ పుంజుకుంటుందని కొందరు భావించారు. పాత మొఖాలను తొలగించి, పరకాల టీమ్ నుంచి కొందరిని నియమించినా పెద్దగా ఫలితం రాలేదు. పైగా కరోనా సమయంలో జీతాలు కూడా కోత కోసి చాలామందిని ఇరకాటంలో నెట్టారు. అదే సమయంలో బీజేపీలో మారిన రాజకీయాలు కూడా సుజనా చౌదరి ని నిరాశపరిచాయి. ముఖ్యంగా ఇటీవల సోము వీర్రాజుని ఏపీ సారధ్య బాధ్యతలు అప్పగించడంతో సుజనా వంటి వాళ్లకు గొంతులో వెలక్కాయపడినట్టయ్యింది. ఈ పరిస్థితుల్లో తన ఆధ్వర్యంలో చానెల్ నడిపితే సోము వీర్రాజుకి ప్రచారం కల్పించాల్సి ఉంటుందని, లేదంటే మళ్లీ పార్టీ వాయిస్ వెళ్లడం లేదనే ఒత్తిళ్లు వస్తాయని ఊహించినట్టు భావిస్తున్నారు.

ఇటు రాజకీయ ఇటు మీడియా లో వచ్చిన మార్పుల కారణంగా తాజాగా అశోక్ శ్రీవాత్సవ్, మోహిత్ సింఘాల్ అనే ఇద్దరు ముంబైకి చెందిన వారి పేరుతో చానెల్ నడిపేందుకు సన్నద్ధమయ్యారు. వారిద్దరి నేతృత్వంలో చానెల్ ఉంటుందని కొత్త సీఈవోగా సీన్ లోకి వచ్చిన కందుల రమేష్ చెప్పినట్టు సమాచారం. కందుల రమేష్ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పత్రికకి ఎడిటర్ గా పనిచేశారు. అంతేగాకుండా చంద్రబాబుకి అనుకూలంగగా వ్యవహరించే జర్నలిస్ట్ గా పేరుంది. ఈ తరుణంలో పాత ఎండీ వంశీని కొనసాగిస్తూ సీఈవో కందుల రమేష్ రావడం వెనుక టీడీపీ నేతల వ్యూహం ఉందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమయినా ప్రస్తుతం మహా టీవీ పరకాల శకం స్వల్పకాలంలోనే ముగిసింది. ప్రస్తుతం కందుల రమేష్ ఆధ్వర్యంలో ఆచానెల్ ఎలా సాగుతుందన్నది చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp