ఎస్ ఈ సీ తో భేటీకి హాజరుకాని పంచాయితీరాజ్ అధికారులు

By Raju VS Jan. 22, 2021, 04:49 pm IST
ఎస్ ఈ సీ తో భేటీకి హాజరుకాని పంచాయితీరాజ్ అధికారులు

ఏపీలో పంచాయితీ ఎన్నికల విషయంపై సందిగ్దం కొనసాగుతోంది. ఎస్ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగాల్సి ఉండగా దానికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాలి. అయితే దానికి అనుగుణంగా ఏర్పాట్ల కోసం ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది.

అందుకు అనుగుణంగా పంచాయితీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వివిధ కారణాలతో పంచాయితీ రాజ్ అధికారులు సమావేశానికి హాజరుకాలేకపోవడం విశేషంగా మారింది. తొలుత ఉదయం 10గం.లకు సమావేశం కావాల్సి ఉండగా అదే సమయంలో ముఖ్యమంత్రి సమావేశం ఉండడంతో పంచాయితీ రాజ్ అధికారులు సీఎంవోకి వెళ్లారు.

అనంతరం మూడు గంటల సమయంలో సమావేశానికి కూడా పంచాయితీ రాజ్ ఉన్నతాధికారులు హాజరుకాలేదు. దాంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ అవుతున్నారు. దానికి అనుగుణంగా పంచాయితీరాజ్ ఉన్నతాధికారికి మోమో కూడా జారీ చేసినట్టు సమాచారం. అంతేగాకుండా సాయంత్రం 5గం.లకు మరో సారి సమావేశం ఏర్పాటు చేసి, దానికి రావాల్సిందేనని ఆయన ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఈ భేటీ కూడా జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడుతోంది.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ ఎన్నికల నిర్వహణను ప్రస్తుత పరిస్థితుల్లో వ్యతిరేకిస్తోంది. ఎన్నికలను, కరోనా వ్యాక్సిన్ ని ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించాలని హైకోర్ట్ ద్విసభ్య బెంచ్ తీర్పునిచ్చింది. దానిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలో పంచాయితీ ఎన్నికల పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఉన్నతాధికారులు కూడా సమావేశాలకు హాజరుకాకపోవడంతో ఎస్ఈసీ లో సందిగ్ధత ఏర్పడుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp