చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనట..!

By Voleti Divakar Jul. 09, 2020, 10:37 pm IST
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనట..!

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే నని, తన స్వార్థ రాజకీయాల కోసం ఆయన అబద్దాల్లో ఆరితేరిపోయారని టిడిపికి ఒకప్పటి మిత్రపక్షమైన బిజెపి నాయకులు కితాబులిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయిన ఆయన కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదంటూ దుష్ప్రచారం సాగించారని వారు చెబుతున్నారు. తాజాగా కేంద్ర సబ్సిడీ నిధులతో నిర్మించిన గృహాల పై కూడా ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తుతున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. లక్షన్నర కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో 7 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. 2017లో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన టిడిపి ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి కనీసం 2 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. అప్పటికే కేంద్రం పూర్తిస్థాయిలో సబ్సిడీ నిధులు 4500 కోట్లను విడుదల చేసిందని సోము తెలిపారు. అయినా ఇళ్ల నిర్మాణం అరకొరగానే సాగిందన్నారు. ఇంకా ఆ ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉందని, అలాగే కాంట్రాక్టర్లకు రూ. 3వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయన వెల్లడించారు.

ఈ ఇళ్ల నిర్మాణంలో కూడా భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి రూ. 2200 చెల్లించే విధంగా కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ సొమ్ముతో అన్ని సౌకర్యాలతో కూడిన మంచి అపార్ట్ మెంట్ ను నిర్మించి ఇవ్వవచ్చని చెబుతున్నారు. పోలవరం, పట్టి సీమతో పాటు, ఇళ్ల నిర్మాణంపై కూడా విచారణ జరిపిస్తే టిడిపి ప్రభుత్వ అవినీతి బండారం బయటపడుతుందని వైసిపి, బిజెపి నాయకులు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లలోనే చంద్రబాబునాయుడు పాలు పొంగించారని సోము వీర్రాజు గుర్తు చేస్తున్నారు.

తాజాగా జగన్ ప్రభుత్వం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను కోవిడ్ కేంద్రాలకు కేటాయించారంటూ అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈవిషయమై ఆందోళన చేయాలని కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూర్తి కాని ఇళ్లల్లోకి ప్రజలను పంపి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పక్కదారి పట్టించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ప్రజలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వైసిపి నాయకులు దుయ్యబడుతున్నారు. ఎవరు ఏమి చేస్తున్నారో ప్రజలు నిత్యం గమనిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp