మోదీకి వ్య‌తిరేకంగా జేఏసీ.. నాయ‌క‌త్వం ఎవ‌రు?

By Kalyan.S Sep. 02, 2021, 08:50 am IST
మోదీకి వ్య‌తిరేకంగా జేఏసీ.. నాయ‌క‌త్వం ఎవ‌రు?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోదీని, బీజేపీని ఎదుర్కోవాల‌ని ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ప‌న్నుతున్నాయి. గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కూడా ప‌లు అంశాల‌పై క‌లిసి పోరాడాయి. ప్ర‌తిప‌క్షాల ఆశ‌లు చిగురించేలా ప్రధాని మోడీ గ్రాఫ్ తగ్గిపోతుందని.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఇటీవల ఇండియా టుడే చేసిన సర్వేలో బయటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఒక్కతాటిపైకి దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ వస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా ఉన్నవారు అధికారంలోకి వచ్చేందుకు ఒక్కటవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అలాంటి పార్టీలందరినీ ఏకం చేసి వారికి విందును కూడా ఇచ్చింది. ఇలా ప్రతిపక్షాలన్నీ కలిసి జాయింట్ కో ఆర్డినేషన్ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరుండాలన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

జేఏసీ అయితే ఏర్పాటు చేశారు కానీ.. నాయ‌క‌త్వం ఎవ‌రు వ‌హించాల‌నే దానిపై పార్టీల‌న్నీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు తెలిసింది. సీపీఎం నాయకుడు ఏచూరి సీతారాం జేఏసీకి సోనియాగాంధీనే బాధ్యత వహించాల్సిందిగా కోరాడు. అయితే మరో ఇద్దరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగుతున్నారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా మిగతా ప్రతిపక్ష పార్టీల కంటే కాంగ్రెస్ మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ముందు నడుస్తూ ప్రతిపక్షాలన్నీంటిని ఏకం చేస్తోంది.

అయితే బీజేపీ ప్రభుత్వంపై విజయం సాధించేందుకు ఈ కమిటీకి సరైన నాయకుడు కావాలి. దేశ పరిస్థితులను అర్థం చేసుకొని వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సోనియా గాంధీ వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. అయితే సోనియా మునుపటిలా ఫిజికల్ గా యాక్టివ్ లేరు. ఆమెకు తరచూ అనారోగ్యం పాలవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ బరువు మోస్తున్న సోనియాకు కొత్తగా జేఏసీ బాధ్యతలు అప్పగిస్తే ఒత్తిడికి గురవుతారు.పోనీ రాహుల్ గాంధీని నియమిస్తారా..? అంటే అందుకూ సీనియర్లు ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్ లోని సీనియర్ల నుంచి వస్తున్న విమర్శలు తట్టుకోలేకే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని విడిచిపెట్టారు. దీంతో మరో ఇద్దరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

వారిలో ఒకరు మమతా బెనర్జీ. బెంగాల్ దీదీ అయిన మమతా తన ప్రతాపం ఏంటో అందరికీ తెలుసు. టీఎంసీని ఓడించేందుకే కమలనాథులు కూడగట్టుకొని బెంగాల్లో ప్రచారం చేసినా దీదీని ఓడించలేకపోయారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆమె సీటే కోల్పోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కీలకంగా మారుతామని మమత ఎప్పట నుంచో అంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు జేఏసీని మమత ముందుండి నడిపిస్తారని అంటున్నారు. అయితే మమతకు బెంగాలీ తప్ప ఇతర భాష తెలియదు. దీంతో నేషనల్ లెవల్లో.. అదీ కాషాయం జెండాకు వ్యతిరేకంగా మమత నిలబడనున్నారా..? అనే సందేహం అయితే లేకపోలేదు.

మరో నేత ఎన్సీపీ అధినేత శరత్ పవార్ పేరు కూడా జేఏసీ కోసం వినబడుతోంది. మహారాష్ట్రలో కీలకంగా మారి శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైన శరద్ పవార్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తారా..? అనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడున్న సీనియర్లలో శరద్ పవార్ మాత్రమే కనిపిస్తున్నారు. మరోవైపు ఆయన ఎప్పటి నుంచే కాంగ్రెస్ కు అండగా ఉంటున్నారు. అయితే శరద్ పవార్ కు కూడా ఇతర లాంగ్వేజేష్ తెలియదు. మరాఠీ తప్ప ఆయన జాతీయ లెవల్లో రాజకీయాలను హ్యాండిల్ చేయగలడా..? అన్న ప్రశ్న ఎదురవుతుంది. మిగిలిన పార్టీల్లోని సీపీఎం ఒకే ఒక్క కేరళలో ప్రభావం ఉంది. సీపీఐకి దేశంలో ఎక్కడా సరైన పట్టు లేదు. అందుకే ఆ పార్టీల్లోని నాయకులు ముందుకు రావడం లేదు. ఇక జేఎంఎం డీఎంకే ఇతర పార్టీలు కేవలం రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో సోనియానే పగ్గాలు చేపడుతారా..? లేక ఆ ఇద్దరిలో ఎవరికైనా అప్పగిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp