కరోనా వచ్చినా ‘కళ్యాణ’ వైభోగమే.. ఆన్‌లైన్‌లో..

By Jaswanth.T Aug. 15, 2020, 12:43 pm IST
కరోనా వచ్చినా ‘కళ్యాణ’ వైభోగమే.. ఆన్‌లైన్‌లో..

భారతీయ సాంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యముంది. విదేశీయులను సైతం ఇక్కడి ఆచార, సాంప్రదాయాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. పలువురు పరదేశీయులు కూడా భారతీయ విధానంలో పెళ్ళి చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వడాన్ని ఇప్పటి వరకు మనం చూసారు.

అయితే కరోనా కాలంలో పెళ్ళి విధానంలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. చట్ట ప్రకారం అనేక ఆంక్షలు. కేవలం 20 మందికి మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. దీంతో వివాహం తదితర శుభకార్యాలకు బంధుమిత్ర సపరివార సమేతంగా నిర్వహించుకుందామనుకునే వారికి నిరాశనే మిగులుస్తోంది. ఒకప్పుడు 15 రోజుల పెళ్ళి విధానం అమలులో ఉండేది. పెళ్ళికి ముందు, పెళ్ళి తరువాత 15 రోజుల పండుగగా ఇప్పటిక్కూడా పలు సామాజికవర్గాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.

అయితే మారిన కాలానికి అనుగుణంగా అయిదురోజుల పెళ్ళిగా రూపాంతరం కూడా చెందింది. ఇంకాస్త ముందడుగు వేసిన ఇంకొందరైతే కేటరింగ్‌ దగ్గర్నుంచి, పురోహితుల వరకు అప్పటికప్పుడు పురమాయించేసుకుని కళ్యాణ మండపంలో పెళ్ళి చేసుకుని, ఏదో పండక్కి ఇంటికెళ్ళినట్టు వెళ్ళిపోవడాన్ని కూడా మనం చూసాం. అలాగే పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకు వాళ్ళు ఏదో ఒక గుడి దగ్గరకు చేరుకుని గుళ్ళలోనూ వివాహ తంతును ముగించుకుని ఎవరి ఇళ్ళకు వాళ్ళు చేరుకునేవారు. ఇంకొంచెం ముందుకు వెళితే రిజిష్టర్‌ మేరేజ్‌లు కూడా జరుగుతున్నాయి.

అయితే ఇప్పుడు కోవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌ పెళ్ళిళ్ళ సీజన్‌ మొదలైంది. ఈ ఆన్‌లైన్‌ పద్దతిలో అటుతరఫు, ఇటు తరఫు వాళ్ళు మాత్రమే పెళ్ళి తంతు వద్ద ఉంటారు. మిగిలిన బంధుమిత్ర, సపరివారానికి సదరు పెళ్ళిని ఏ ఫేస్‌బుక్‌ ద్వారానో, యూట్యూబ్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే ప్రారంభమైన ఈ క్రొత్త ట్రెండ్‌ ప్రస్తుతం ఊపందుకుంది. బాగా కావాల్సిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేని పరిస్థితులు ఇప్పుడున్నాయి. అలాగే అతిధులను పిలిచి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో మధ్యేమార్గంగా ఈ ఆన్‌లైన్‌ వివాహానికి ప్రాధాన్యం పెరుగుతోంది.

తమకు కావాల్సిన వారందరికీ యూట్యూబ్‌ లేదా ఫేస్‌బుక్‌ లింక్‌లను షేర్‌ చేస్తున్నారు. వీటి ద్వారా పెళ్ళి తంతును నేరుగా చూసుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఒకప్పుడు లగ్న పత్రికతో పాటు శుభకార్యం చేసేవారి స్థాయిని బట్టి ఏదో ఒక బహుమతిని కూడా ఇవ్వడం జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌ లింక్‌లను ఇస్తున్నారు. ఇది కోవిడ్‌ నేర్పిన నయాట్రెండ్‌గానే చెప్పుకోవాలి.

ఆత్మీయులు, బంధుమిత్రులు దగ్గర లేకుండా శుభకార్యం నిర్వహించుకోవడం, సదరు ఫంక్షన్‌ పెద్దలకు కాస్తంత కష్టమే. కానీ ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న కరోనా విపత్తు నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తప్పకుండా సమర్ధించాల్సిందే. కావాల్సిన వారు ఎక్కడో ఉన్నప్పటికీ వారి శుభ కార్యాన్ని కళ్ళారా చూసుకునేందుకు ఈ విధంగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా అభినందించదగ్గదే. అవసరం మనిషికి అన్నీ నేర్పుతుందంటారు పెద్దలు. ఇప్పుడు కూడా అదే అవసరం ఇటువంటి వాటిని కూడా అలవాటు చేస్తోందనే అనుకోవాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp