సామాన్యుల పాలిట వరం వలంటీర్ వ్యవస్థ

By Sanjeev Reddy Aug. 15, 2020, 01:00 pm IST
సామాన్యుల పాలిట వరం వలంటీర్ వ్యవస్థ

65 ఏళ్ల వయసు , కాలంతెచ్చిన ఒంటరితనం , స్వయంగా వెళ్లలేని భౌతిక స్థితి , సమయానికి ఎవరు అండగా లేని పరిస్థితి మరి ఆసరాగా నిలిచేదెవరు ?
కిలోమీటర్లు నడిచే పరిస్థితి , కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగే అగత్యం , దరఖాస్తు రాయటానికి మరొకరిని తోడు తీసుకెళ్ళాల్సిన దుస్థితి , వీటిని తప్పించే సహాయకుడెవరు ? .

కాలు కదిపితే కరోనా భయం , గడప దాటనివ్వని లాక్ డౌన్ ఆంక్షలు , పొరపాటున మనకి కూడా వచ్చిందేమో అన్న భయం . ఏ రాత్రో దగ్గో తుమ్మొ వస్తే ఇక అంతే .. చెప్పలేని భయం .. ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచి అవసరాలు తీర్చి ఆదుకునే ఆత్మీయుడు ఎవరూ ?.

గత ఏడాది కాలంలో పై ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన పేరు విలేజ్ వలంటీర్ . క్షేత్ర స్థాయిలో సామాన్య ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి పలు పథకాల అమలులో , కోవిడ్ 19 వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి వారి నుండి పలు ప్రశంసలు పొందింది విలేజ్ , వార్డ్ వలంటీర్ వ్యవస్థ ..

2019 ఎన్నికల ముందు వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు గురించి జగన్ ప్రకటించి మేనిఫెస్టోలో పొందు పరిచినప్పుడు భిన్న అభిప్రాయాలు వచ్చాయి . ఇది సాధ్యమవుతుందా , అనవసరపు చర్య , అంతమందితో పనేముంది లాంటి వ్యాఖ్యలు పలు పార్టీల నుండి , కొన్ని వర్గాల నుండి అనుమానాలు వ్యక్తమయ్యాయి .

వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే వలంటీర్ , గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక చేపట్టి 2.61 లక్షల మందిని వలంటీర్స్ గా , 1.34 లక్షల మందిని సచివాలయ ఉద్యోగస్తులుగా మొత్తం 3.95 లక్షల మందికి 2019 ఆగస్ట్ 15 వ తారీఖున గ్రామ స్థాయిలో ఉద్యోగాలు కల్పించారు .

ప్రభుత్వ పాలన సరళతరం కావటానికి , ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ది క్షేత్ర స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చెందటానికి కృషి చేయటానికి, గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటైన వలంటీర్ వ్యవస్థ అచిరకాలంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బలమైన వారధిగా ఏర్పాటైంది అని చెప్పొచ్చు .

సామాజిక పెన్షన్స్ , ఆరోగ్య శ్రీ , రేషన్ , ఓటర్ లాంటి పలు కార్డులకు అప్లై చేసుకోవటానికి గతంలోలా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగే పని లేకుండా 50 నివాసాలకు ఒకరు చొప్పున కేటాయించిన వలంటీర్స్ స్వయంగా ఇంటింటికి తిరిగి అర్హులను గుర్తించి అప్లై చేసే దశ నుండి కార్డు ఇచ్చేవారకూ అన్ని పనులు నిర్వహించటమే కాకుండా వృద్ధ ,వితంతు , దివ్యంగ పెన్షన్స్ , ఇతర పథకాల లబ్దిని ప్రతి నెలా నిర్ణీత గడువులోగా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరుస్తూ సంక్షేమ పథకాల అమలులో కీలక భాగస్వాములయ్యారు.

ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి అమలు చేసిన లాక్ డౌన్ సమయంలో వలంటీర్ వ్యవస్థ చేసిన కృషికి దేశవిదేశాల నుండి ప్రశంసలు లభించాయి . లాక్ డౌన్ సమయంలో ఇంటింటికి తిరిగి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేస్తూ , వైరస్ పాజిటివ్ అనుమానితుల్ని , ఇతర దేశాల నుండి , రాష్ట్రాల నుండి వచ్చిన వారి సమాచారం తీసుకొని ప్రభుత్వానికి అందించి ,వారికి టెస్ట్స్ చేయించి తగు వైద్యం అందించే ప్రక్రియలో వారి కృషిని గమనించి ఇతర రాష్ట్రాలు , కేంద్రంతో పాటు కొన్ని ఇతర దేశాలు ప్రశంసించడమే కాకుండా కొన్ని రాష్ట్రాలు ఏపీని అనుసరించి వలంటీర్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకొంటుండగా , బ్రిటన్ , ఇండోనేషియా సైతం ఏపీ బాటలో పయనిస్తూ వలంటీర్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోనుండటం విశేషం .

ప్రభుత్వం ఇటీవలి చేపట్టిన రైతు భరోసా కేంద్రాలకు , జనతా బజార్లకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తూ , వైఎస్సార్ చేయూత పధకం ద్వారా గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను కార్పోరేట్ కంపెనీల ద్వారా మార్కెటింగ్ చేసుకొనే ప్రక్రియ నిర్వహణా భాద్యతలు కూడా చేపట్టిన విలేజ్ వలంటీర్ వ్యవస్థ వైసీపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొన్నది అని చెప్పొచ్చు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp