మూడు రాజధానులపై చంద్రబాబుకు ఒక అవకాశం

By Sannapareddy Krishna Reddy Aug. 02, 2020, 10:52 am IST
మూడు రాజధానులపై చంద్రబాబుకు ఒక అవకాశం

రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని దేశంలోనే సీనియర్ రాజకీయ వేత్త అయిన చంద్రబాబు స్వయంగా రాసిన లేఖను, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కన్నా లక్ష్మీనారాయణ చేత రాయించిన లేఖనూ బుట్టదాఖలా చేసి, బిల్లు మీద గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో తెలుగుదేశం నాయకత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. న్యాయపోరాటం చేస్తాం, కోర్టులో బిల్లును అడ్డుకుంటాం అని బింకాలు పలికినా అదంత సులభం కాదని అందరికీ తెలుసు. వీలయినంత త్వరగా పరిపాలనా రాజధాని తరలింపు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.

అమరావతి 2.0 పోరాటం అని ట్విట్టర్లో చంద్రబాబు, లోకేష్ బాబు సహా తెలుగుదేశం ట్విట్టర్ యోధులు బీరాలు పలుకుతున్నా అదంత సులభం కాదని వారికే తెలుసు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ రోజుల్లో ఏ నిరసన అయినా జూమ్ ద్వారా ఎవరి ఇంట్లో వారు కూర్చుని చేయాలి కానీ, ఎవరూ రోడ్డెక్కే పరిస్థితి ఉండదు.

దీనికి చంద్రబాబు తన మేధాశక్తి ఉపయోగించి ఒక పరిష్కారం చెప్పారు. "అందరూ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, మళ్లీ ప్రజాతీర్పు కోరదాం. మీకు ఇప్పుడున్న 151 స్థానాలు వస్తే రాజధాని విషయం ఎత్తను" అని అధికార పార్టీకి ఆఫర్ ఇచ్చారాయన. ఒకటో తరగతి చదివే పిల్లవాడు కూడా నవ్వేంత హాస్యాస్పదమైన ఆలోచన ఇది. చంద్రబాబు పార్టీ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు ఆయనతో ఉన్నది 21 మంది. ఇరవై ఒక్క మందితో 151 మందిని ఎవరైనా ఒడ్డి పందెం కాస్తారా?

మెజారిటీ ప్రజల అభిప్రాయమే ఫైనల్

ప్రజాస్వామ్యంలో ప్రజలే అధినేతలు. ఏం జరిగినా ప్రజల్లో అత్యధికుల అభిప్రాయానికి లోబడే జరగాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు కూడా రాజధాని అమరావతిలో కేంద్రీకృతం అయి ఉండాలని కోరుకుంటున్నారు అని చంద్రబాబు అన్నా, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా రాజధాని వికేంద్రీకరణ కోరుకుంటున్నారని జగన్ అన్నా ఆ సంగతి ప్రజలు స్వయంగా చెప్పడమే పద్ధతిగా ఉంటుంది. అయితే ప్రజాస్వామ్యంలో రెఫరెండం కోరే అవకాశం అధికార పార్టీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని కాదని రెఫరెండం నిర్వహించే అవకాశం ప్రతిపక్షానికి ఉండదు.

అధికార పార్టీ మెడలు వంచే అవకాశం

అయితే అధికార పార్టీ మెడలు వంచి, ప్రజల అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఇక్కడ చంద్రబాబు చేతుల్లో ఉంది. ఆల్రెడీ జంప్ అయిన ఇద్దరు ఎమ్మెల్యేలను వదిలేసి, మిగిలిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల చేత రాజీనామా చేయించి, ఇప్పటికిప్పుడు కాకపోయినా, కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక అయినా నిర్వహించబోయే ఉప ఎన్నికల్లో రాజధాని అన్న ఒక్క పాయింట్ మీదే ప్రచారం చేసి, జగన్ తను చేపట్టిన సంక్షేమ పథకాలను చెప్పుకుని ప్రచారం చేసుకున్నా, తెలుగుదేశం తరఫున చంద్రబాబు, లోకేష్ బాబు లాంటి నాయకులు "అమరావతిలోనే రాజధాని మొత్తం ఉండాలంటే మాకు ఓటేయండి. మూడు చోట్ల మూడు రాజధానులు కావాలంటే అవతలి వారికి ఓటేయండి" అని సింగిల్ పాయింట్ ఎజెండాతో ప్రచారం చేసి, అత్యధిక మెజార్టీతో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తే దేశమంతా అమరావతి వైపు చూస్తుంది. అప్పుడు జగన్ మీదనే కాక, కోర్టు మీద కూడా ఒత్తిడి పెరిగి, ఒక రాష్ట్రం, ఒక రాజధానికి ఒప్పుకోవలసిన పరిస్థితి వస్తుందేమో.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి, రాజధాని వికేంద్రీకరణ వలన నష్టపోయే రైతులు కానీ, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు కానీ పోరుబాట పట్టే అవకాశం లేదు కాబట్టి అమరావతి కోసం పోరాటం చేయడానికి చంద్రబాబుకు ఇంతకన్నా మరో మార్గం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp