బాడ్ న్యూస్ లే కాదు.. గుడ్ న్యూస్ లు ఉన్నాయ్..

By Jaswanth.T Jul. 31, 2020, 11:22 pm IST
బాడ్ న్యూస్ లే కాదు.. గుడ్ న్యూస్ లు ఉన్నాయ్..

కోవిడ్‌ 19పై జరుగుతున్న విస్తృత ప్రచారం అవగాహన పెంచుకునేందుకు మంచిదే అయినప్పటికీ, మరో కోణంలో ప్రజలను భయపెడుతోందన్న అపవాదు కూడా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న విస్తృత ప్రచారంలో పాజిటివ్‌ అంశాలను ఎంతగా ప్రచారం చేస్తున్నా, అవి తగిన ప్రాధాన్యతను పొందడంలేదు. దేశంలో పది లక్షల పాజిటివ్‌లు నమోదైనప్పుడు జరిగిన ప్రచారంతో పోలిస్తే పది లక్షల మంది దాన్నుంచి రికవరీ అయ్యారన్న విషయానికి జరగలేదనే చెప్పాలి. ఇటీవలే విడుదలైన బులిటెన్‌లో కరోనా నుంచి పది లక్షల మంది బైటపడ్డారన్నది దాని సారాంశం.

మొత్తం దేశంలో దాదాపు పదహారు లక్షల మందికి పాజిటివ్‌గా తేలగా, వారిలో పది లక్షల మందికిపైగా కోవిడ్‌ 19 నుంచి కోలుకుని, ఆయా చికిత్సా కేంద్రాల నుంచి డిశ్చార్జ్‌ కూడా అయ్యారు. ఇది శుభ పరిణామంగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు భయాందోళనలో కొట్టుకుపోతున్న వారికి ఇది మంచి ఊరటనిచ్చే అంశమేనని వివరిస్తున్నారు. రికవరీ శాతం దేశ వ్యాప్తంగా 65శాతం వరకు ఉండడం సానుకూల అంశం. అంతే కాకుండా మరణాల రేటు మొదట్లో తక్కువగా ఉండి, మధ్యలో కొంత పెరిగినట్టుగా కన్పించినప్పటికీ, ప్రస్తుతం తగ్గుతుండడం కూడా మంచి పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా కూడా కేసుల నమోదు సంఖ్య భారీగానే తగ్గుతుందన్న ఆశచిగురిస్తోంది.

రాష్ట్రాల వారీగా చూసినప్పుడు అత్యధిక కేసులు ఆంధ్రప్రదేశ్‌లో నమోదవ్వడం కొనసాగుతోంది. విస్తృతంగా టెస్టులు చేస్తుండడంతోనే అధిక కేసులు నమోదవుతున్నాయని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. ఏపీ తరువాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. అయితే ఇప్పటి వరకు నాలుగు, అయితే స్థానాలకే పరిమితమైన ఏపీలో ఇప్పుడు భారీగా కేసులు నమోదై మొదటి స్థానానికి చేరుకోవడం పట్ల మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఒక వైపు టెస్టులు ఎక్కువగా ఉండడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందన్న వాదన ఉండగా, మరోవైపు క్షేత్రస్థాయలో నిబంధనలను ఖచ్చితంగా పాటించకపోవడం వల్లే కేసులు విస్తృతం అవుతున్నాయన్న వాదన కూడా విన్పిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp