పెట్రో ధరలపై నిర్మలమ్మ ‘ధర్మసంకటం’లో ఉన్నారంట...!

By Kalyan.S Mar. 06, 2021, 10:35 am IST
పెట్రో ధరలపై నిర్మలమ్మ ‘ధర్మసంకటం’లో ఉన్నారంట...!

పెట్రో ధరల పెరుగుదలపై దేశమంతా విస్తృతమైన చర్చ జరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ధరలపై పెదవి విరుస్తున్నారు. భారత రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా పెట్రోలు ధరలపై స్పందించారు. ధరలను అదుపులోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చొరవను గుర్తు చేశారు. ఈ ధరలు ద్రవ్యోల్పణానికి దారి తీసే ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఆయన ప్రకటన తర్వాత రెండు, మూడు రాష్ట్రాలు పన్నులను తగ్గించి ధరలు కాస్త దిగి వచ్చేందుకు మార్గాన్ని సుగమం చేశాయి. ఇప్పుడు తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల, తగ్గింపునకు పరిష్కారాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనదైన శైలిలో మాట్లాడారు.

పెట్రో భారం పెరిగిన నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని కోరుకుంటున్నారని, అయితే ఇది జరగాలంటే పన్నుల తగ్గింపునకు సంబంధించి కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. వినియోగదారులపై పడుతున్న భారం అర్థమైందన్న ఆర్థిక మంత్రి.. ధర నిర్ణయం అనేది ఓ ఇబ్బందికరమైన సమస్య అన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆమె ‘ధర్మసంకటం’ అనే పదాన్ని వాడారు. సమస్య తీవ్రంగా ఉంది కాబట్టే తాను ‘ధర్మసంకటం’ అన్న పదాన్ని వినియోగించినట్టు కూడా వివరణ ఇచ్చారు. ఇంధనాలపై కేవలం కేంద్రమే పన్నులు విధించడం లేదని, రాష్ట్రాలు కూడా పన్నులను వసూలు చేస్తున్నాయని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పన్నుల నుంచి వచ్చే రాబడిని కేంద్రం, రాష్ట్రాలు తీసుకుంటున్నాయని తెలిపారు. పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు 41 శాతం వెళుతోందని పాత్రికేయులతో సీతారామన్‌ శుక్రవారం పేర్కొన్నారు.

ఇక పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఫిక్స్‌డ్‌ రేటు ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తుండగా.. రాష్ట్రాలు వేర్వేరుగా వ్యాట్‌ను విధిస్తున్నాయి. జీఎస్టీ కింద వీటిని కలిపివేసి ఒకేరకంగా పన్ను విధించే అవకాశం ఉండనుంది. పెట్రోల్‌ రిటైల్‌ ధరలో కేంద్రం, రాష్ట్రాల పన్నుల వాటా 60 శాతం ఉండగా.. డీజిల్‌ ధరలో దాదాపు 56 శాతం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడానికి తోడుగా పన్నుల భారం అధికంగా ఉండటంవల్ల దేశీయంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర ఇప్పటికే రూ.100 దాటేసింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు ఉత్పత్తికి సంబంధించిన నియంత్రణను సడలించాలని పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థను భారత్‌ ఇప్పటికే కోరింది. అయితే దీన్ని ఒపెక్‌ దేశాలు విస్మరిస్తున్నాయి. గత ఏడాది ముడిచమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసిన ఆయిల్‌ను వినియోగించుకోవాలంటూ భారత్‌కు సౌదీ అరేబియా సలహా ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడిచమురు ధర శుక్రవారం 67 డాలర్లు దాటింది. గత ఏడాది భారత్‌ చాలా చవకగా ముడిచమురును కొనుగోలు చేసిందని, నిల్వ చేసిన దానిలోంచి భారత్‌ కొంత తీసుకోవాలని సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్‌ అబ్దులాజిజ్‌ బిన్‌ సల్మాన్‌ పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp