Noida Airport - ప్రపంచం సరసన ‘నోయిడా’ విమానాశ్రయం

By Prasad Nov. 27, 2021, 02:00 pm IST
Noida Airport  - ప్రపంచం సరసన ‘నోయిడా’ విమానాశ్రయం

రాజకీయ విమర్శలు... ప్రతివిమర్శలు పక్కనబెడితే ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో నిర్మించనున్న ‘నోయిడా ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు (ఎన్‌ఐఏ) దేశంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా రూపుదిద్దుకోనుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ తో పాటు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిలో ఇది కీలకం కానుంది. పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగితే దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ (పీపీపీ) పద్ధతిలో దీనిని నిర్మించనున్నారు.

దేశ రాజధాని డిల్లీని ఆనుకుని ఉత్తరప్రదేశ్‌ నోయిడా సమీపంలో గౌతమబుద్ధ నగర్‌లోని జెవార్‌ వద్ద నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈనెల 25వ తేదీని ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమి పూజ చేశారు. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయానికి ఎట్టకేలకు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం మొత్తం పూర్తయితే ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. తొలి దశ నిర్మాణం మూడేళ్లలో అంటే 2024 నాటికి పూర్తవుతుంది. అప్పటికీ ఈ విమానాశ్రయం 3 వేల 224 ఎకరాల్లో నిర్మాణం జరుగుతుంది. మొత్తం నాలుగు దశల్లో జరిగే నిర్మాణం పూర్తయ్యేందుకు 20 ఏళ్ల సమయం పట్టనుంది. మొత్తం అంచనా రూ.29 వేల 560 కోట్లు. దీని వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతుంది.

తొలి దశలో 1.20 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించనుంది. తరువాత కాలంలో ఇది ఏడాదికి 7 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందిస్తుందని ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చెబుతుంది. 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎగుమతులు జరగనున్నాయి. అన్ని దశలు పూర్తయిన నాటికి ఈ ఎయిర్‌ పోర్టు 7,200 ఎకరాలకు విస్తరించనుంది. మొత్తం ఆరు రన్‌వేలను నిర్మించనున్నారు. ఈ ఎయిర్‌ పోర్టును యమునా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వైఐఏపీఎల్‌) అభివృద్ధి చేస్తోంది. యమునా ఎక్స్‌ప్రెస్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వైఈఐడీఏ) యూపీ ప్రభుత్వం తరపున ఏజెన్సీగా ఉంటుంది.

Also Read : Bjp.Modi - గెలుపు కోసం ప్రయాస.. మోడీ లక్ష్యం చేరేనా..?

ఇప్పుడు నిర్మించనున్న ఎయిర్‌ పోర్టు న్యూఢిల్లీ లో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 72 కిమీల దూరం. నొయిడా, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌కు 40 కిమీల దూరం. గ్రేటర్‌ నోయిడాకు 28 కిమీల దూరం. అలీఘర్‌, గుర్గావ్‌కు 65 కిమీలు, ఆగ్రాకు 130 కిమీల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు అనుసంధానంగా ఉంది. అలాగే వెెస్ట్రన్ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ ,ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే లకు అనుసంధానం చేస్తారు. ఇది పూర్తయితే ఈ ప్రాంతం గణనీయమైన అభివృద్ధి సాధించనుంది.

యూపీఏ పక్కన పెట్టిన ప్రాజెక్టు:

ఈ ప్రాజెక్టును 2001లో నాటి యూపీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర రక్షణ మంతి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రతిపాదించారు. అన్ని ప్రతిపాదనలు పూర్తయ్యే సరికి ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.5 వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు. తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఢిల్లీ కి దూరమవుతుందని, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ కంపెనీ ఆధునీకరిస్తున్నందున ఈ ప్రాజెక్టు అవసరం లేదని తేల్చింది. యూపీలో అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిరంగావ్‌, తుండ్లా సమీపంలో కుర్రికుప వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు రక్షణ శాఖ అభ్యంతరం చెప్పడంతో ఎత్మాద్‌పూర్‌ వద్ద భూమిని కేటాయించింది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టు మరోసారి జెవార్‌కు మారింది.

Also Read : CAG Report -కాగ్ రిపోర్ట్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కీలక ప్రకటన, ఎందుకిలా జరుగుతోంది?

అతిపెద్ద విమానాశ్రయాల్లో ప్రపంచంలో ఒకటి:

ప్రతిపాదిత నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని దశలు పూర్తయితే దేశంలో అతి పెద్ద విమానాశ్రయం అవుతుంది. ఇప్పటి వరకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పెద్దదిగా గుర్తింపు ఉంది. ఇక్కడ మూడు రన్‌వేలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఉన్న అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. చిగాగో (ఎనిమిది రన్‌వేలు), డల్లాస్‌ (ఏడు రన్‌వేలు) మాత్రమే ఇప్పటివరకు పెద్ద విమానాశ్రయాలుగా ఉన్నాయి. ఆమ్‌స్టర్‌డామ్‌, డెట్రాయిట్‌, బోస్టన్‌, డెన్వర్‌ విమానాశ్రయాలు ఆరు రన్‌వేలతో ఉన్నాయి. నోయిడా విమానాశ్రయం ఆరు రన్‌ వేలతో నిర్మించనున్నారు. ప్రయాణీకులు, కార్గో అవసరాలు పెరిగితే భవిష్యత్‌లో ఎనిమిది రన్‌వేలతో నిర్మించే విధంగా ప్రతిపాదనలు చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp