శ్రీ‌కాకుళం టీడీపీకి నాయ‌కుడే లేడా?

By Kalyan.S Sep. 06, 2021, 11:40 am IST
శ్రీ‌కాకుళం టీడీపీకి నాయ‌కుడే లేడా?

సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న బెట్టి, యువ ర‌క్తంతో పార్టీని నింపి వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్న టీడీపీకి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో చుక్కెదుర‌వుతోంది. పార్టీని న‌డిపించే యువ నాయ‌కుడే క‌నిపించ‌డం లేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమైన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా అదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక్కడ పార్టీ తరఫున యాక్టివ్ గా ఉండే నాయకులు కనిపించడం లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఒకే కుటుంబం ఆ పార్టీ నుంచి పోటీ చేస్తోంది. గెలుపు లేదా ఓటమి ఆ కుటుంబానిదే అన్న‌ట్లుగా వ్యవహరిస్తోంది. పోనీ.. ఈ కుటుంబం నుంచి వారసులకు రాజకీయాలు ఆసక్తి లేకపోవడం వంటి పరిణామాలతో ఇక్కడి టీడీపీలో యువ నాయకత్వం కొరత భారీగా కనిపిస్తోంది.

శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గుండ అప్పల సూర్యనారాయణ ఫ్యామిలీ కొన్నేళ్లుగా చక్రం తిప్పుతోంది. 2004 2009 ఎన్నికల్లో గుండ అప్పల సూర్యనారాయణ ఓడిపోవడంతో 2014లో గుండ సతీమణి.. లక్ష్మీదేవి విజయం దక్కించుకున్నారు. వివాదరహితులుగా అవినీతి రహిత పాలిటిక్స్ చేసే నాయకులుగా గుర్తింపు ఉన్న ఈ కుటుంబం నుంచి వారసులు రాజకీయంగా ముందుకు వచ్చేందుకు ఆసక్తితో లేరు. అయినప్ప టికీ.. చంద్రబాబు వీరికే టికెట్ కేటాయిస్తున్నారు. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి కూడా వయో భారంతో మునుప టి మాదిరిగా పార్టీలో కార్యక్రమాలకు హాజరు కాలేక పోతున్నారు. ఇక గత ఎన్నికల సమయంలో యాక్టివ్గా కనిపించినా.. తర్వాత.. చాలా రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండున్నరేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయని భావిస్తే.. ఇక అప్పటికి ఈ కుటుంబం పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోతుంది.

మరోవైపు.. వైసీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు.. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరవేస్తూ వైసీపీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ఆ పార్టీకి తిరుగులేకుండా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌తో పాటు.. టీడీపీ శ్రేణులను కూడా వైసీపీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్క‌డ నుంచి టీడీపీకి సార‌థ్యం వ‌హించేందుకు యువ నాయ‌కులు వెనుక‌డుగు వేస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబు కూడా కురువృద్ధులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించుకోవడంతో గుండ కుటుంబానికి ఈ సారి టికెట్ దక్కడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఒకే కుటుంబం చేతిలో ఇక్క‌డి టీడీపీ ఉండ‌డమే ఇప్పుడు శాపంగా మారింది. ఆ కుటుంబం నుంచి ఆస‌క్తి చూపే యువ నేత‌లు లేక‌పోవ‌డం, ఇత‌ర కుటుంబాల వారిని ఎద‌గ‌నీయ‌క‌పోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి దిక్కెవ‌ర‌నే ప‌రిస్థితి ఎదురైంది. కేవలం ఒక కుటుంబాన్నే నమ్ముకుని చంద్రబాబు ఇక్క‌డ పార్టీని ఇరుకున ప‌డేశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : ఏపీ బీజేపీకి, పురంధేశ్వ‌రికి సంబంధం లేదా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp