పెనుతుపానుగా నివర్‌..!

By Karthik P Nov. 25, 2020, 06:15 pm IST
పెనుతుపానుగా నివర్‌..!

వాతావరణ శాఖ ఊహించినట్లుగానే నివర్‌ పెను తుపానుగా మారుతోంది. రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా రూపుదిద్దుకుని తుపానుగా మారింది. దీనికి నివర్‌ తుపాను అని నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటుతుందనుకున్న నివర్‌ తుపాను దిశ మార్చుకుని తమిళనాడు వైపు వెళ్లింది. పుదుచ్చెరి, తమిళనాడులపై నివర్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రోజు అర్థరాత్రికి కలైకర్, మహాబలిపురం మధ్య తీరం తాటే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఇప్పటికే నివర్‌ ప్రభావం ప్రారంభమైంది. తమిళనాడు, పుదుచ్చెరిలలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు చెన్నైలో ఈదురుగాలలతో కూడిన కుండపోత వర్షం పడింది. ఏపీలోనూ నివర్‌ ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షం పడుతోంది. నివర్‌ ప్రభావం ఏపీలో నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు, రాయలసీమ జిల్లాల్లో ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆయా జిల్లాల్లో ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మబ్బులు పట్టి చల్లని గాలులు వీస్తున్నాయి.

ప్రస్తుతం నివర్‌ తుపాను కడలూరుకు 180 కిలోమీటర్లు, పుదుచ్చెరికి 190 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. ఉదయం ఆరు గంటల వేగంతో తీరం వైపు కదులుతున్న నివర్‌.. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 11 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ప్రస్తుత వేగం కొనసాగితే.. అర్థరాత్రికి నివర్‌ తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వేగం పెరిగితే అర్థరాత్రికి ముందుగానే తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 – 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

తుపాను ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. తుపాను ప్రభావ జిల్లాల అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు రాష్ట్ర, కేంద్ర విపత్తు సహాయక బృందాలను ఇప్పటికే పంపారు. వీలైనంత మేర పంటలను రక్షించుకునేలా రైతులకు వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు అందించింది. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp