"సంతోషంగా లేరు" - గ‌డ్క‌రీ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

By Kalyan.S Sep. 15, 2021, 07:29 am IST
"సంతోషంగా  లేరు"  - గ‌డ్క‌రీ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆరు నెల‌ల కాలంలో న‌లుగురి సీఎంల‌ను మార్చ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. ఒక్క ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోనే అధికారం చేప‌ట్టిన త‌ర్వాత ముగ్గురు సీఎంలు మారారు. దీనిపై పార్టీలో చ‌ర్చ ఎలాగున్నా.. మోదీషా ద్వ‌యం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై దేశంలోని పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్పుడు సొంత పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ చేసిన కామెంట్స్ మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. రాజ‌కీయ నేత‌లెవ‌రూ ఆనందంగా ఉండ‌లేరంటూ గ‌డ్క‌రీ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారుతున్నాయి. ఇటీవ‌లి కాలంలో బీజేపీ వ‌ర‌స‌గా సీఎంల‌ను మారుస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న వ్యాఖ్య‌లు సొంత పార్టీపైనే సెటైర్ వేసిన‌ట్లుగా ఉన్నాయ‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

'మంత్రులం అవుతామో లేదో అనే సంధిగ్ధంలో ఎమ్మెల్యేలు ఆనందంగా లేరు. మంచి డిపార్ట్ మెంట్లు ద‌క్క‌లేద‌నే అసంతృప్తితో ఉన్నారు మంత్రులైన వారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే బాధా వారికి ఉంటుంది. ఇక సీఎంల‌యిన వారేమో.. తాము ఎంత కాలం ఆ ప‌ద‌విలో ఉంటామో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నారు...' అంటూ గ‌డ్క‌రీ చెప్పిన ఈ పొలిటిక‌ల్ జోక్ ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక‌ర‌కంగా గ‌డ్క‌రీ జోక్ గానే అన్నా.. అది ఎక్కువ‌గా బీజేపీకే వ‌ర్తిస్తోంది. దేశంలోని బీజేపీ సీఎంలు ఇప్పుడు ఒక‌ర‌కంగా ఈ ధోర‌ణిలో ఉన్నారు. అధిష్టానం ఎప్పుడు ఎవ‌రిని మారుస్తుందో తెలియ‌ద‌న్న‌ట్టుగా మారింది ప‌రిస్థితి.

కొన్ని నెల‌ల్లో న‌లుగురు సీఎంలు మారిపోయారు! ఇటీవ‌లి కాలంలోనే మూడు రాష్ట్రాల్లో సీఎంల‌ను మార్చేసింది బీజేపీ. తీర‌థ్ సింగ్ రావ‌త్, య‌డియూర‌ప్ప‌, రూపానీలు దిగిపోయారు. వారి స్థానంలో కొత్త వారు వ‌చ్చారు. అయితే కొత్త వారిని కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌ద‌వుల్లో ఉంచవ‌చ్చ‌నే టాక్ ఇప్ప‌టికే వినిపిస్తోంది. బొమ్మైని క‌ర్ణాట‌క సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశాలూ అంతంత మాత్ర‌మే. ఇక గుజ‌రాత్ కొత్త ముఖ్య‌మంత్రిని ఎన్నిక‌ల వ‌ర‌కే ఉంచుతార‌ని, అక్క‌డి సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రొక‌రిని కొత్త సీఎంగా చేస్తార‌నే ప్ర‌చారం ఇప్ప‌టికే ఊపందుకుంటోంది. దేశంలో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చినా.. బీజేపీ ముందుగా సీఎం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే రోజులు దాదాపు గ‌తించిన‌ట్లే క‌నిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు గ‌డ్క‌రీ ఇలా మాట్లాడ‌డం వ‌ల్ల ఇత‌ర రాష్ట్రాల‌లో ఏమైనా మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయా.. అనే చ‌ర్చ కూడా మొద‌లైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp