అసలు నిమ్మగడ్డకు ఏమైంది..?

ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వార్తల్లో వ్యక్తిగా మిగులుతున్నారు. సాధారణంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవాళ్లు పెద్దగా తెరపై కనిపించేవారు కాదు. ఎప్పుడో ఎన్నికల సందర్భంలోనో.. చట్టపరమైన కార్యక్రమాల పరంగానో కనిపించేవారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు..? అని జీకే ప్రశ్నలు కూడా వచ్చేవి అంటే అర్థం చేసుకోవచ్చు. ఓ రాజకీయ నాయకుడిలా నిమ్మగడ్డ రమేష్ మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. ప్రభుత్వంపై ఉన్న కోపంతోనో, తన పంతం నెగ్గాలన్నా ఆలోచనతోనో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు (జేడీ) జీవీ సాయిప్రసాద్‌ను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ చర్యే వివాదాస్పదమైన నేపథ్యంలో, అలాంటిదే మరొక నిర్ణయాన్ని నేడు ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్‌ను కూడా తొలగిస్తూ, ప్రభుత్వానికి సరెండర్ చేశారు. వరుసగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తున్న వారు అసలు నిమ్మగడ్డకు ఏమైందన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ను కోర్టు కొట్టేసినా ఆయన తీరులో మార్పు రావడం లేనట్లుగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకటనపై ఏపీ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాలు, పోలీసులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఇటువంటి పరిస్థితుల్లో తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని తేల్చి చెప్పారు. దీంతో ఆయనకు ఉద్యోగులపై నమ్మకం సన్నగల్లిందో ఏంటో... ప్రతి ఒక్కరిపైనా అనుమానాంగా చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులపైనే నమ్మకం ఉండడం లేదని వరుసగా తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా తెలుస్తోంది.
ఎన్నికల సంఘం అంటే స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ అనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే అందులో పని చేయడానికి ఆకాశం నుంచి ఎవరూ దిగిరారనే వాస్తవాన్ని నిమ్మగడ్డ గ్రహించినట్టు లేరనే విమర్శలొస్తున్నాయి. రోజుకో వివాదాస్పద నిర్ణయంతో ప్రభుత్వంతో ఘర్షణ వైఖరిని ఆయన కోరుకుంటున్నట్టు ...నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరే చెబుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాణీ మోహన్ సేవలు తనకు అవసరం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు ఎస్ఈసీ నేడు లేఖ రాశారు. తన కార్యాలయం నుంచి ఆమెను రిలీవ్ కూడా చేయడం గమనార్హం. ఇలా ఎంత మంది ఉద్యోగులను నిమ్మగడ్డ వద్దంటారో చూడాలి. ఈ నేపథ్యంలో చివరకు కార్యాలయంలో ఆయన ఒక్కరైనా ఉంటారా..? అని కొంత మంది చలోక్తులు విసురుతున్నారు. ఎస్ఈసీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను కూడా ప్రభుత్వమే నియమిస్తుందనే నిజాన్ని ముందుగా ఎస్ఈసీ జీర్ణించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల ఉత్తర్వులను కొట్టేసినా ఎస్ఈసీ నిమ్మగడ్డ తన వైఖరి మార్చుకోకపోవడం గమనార్హం.


Click Here and join us to get our latest updates through WhatsApp