Narayana - నారాయణ..నారాయణ అంటున్న టీడీపీ, ఎందుకో తెలుసా

By Raju VS Nov. 29, 2021, 05:45 pm IST
Narayana - నారాయణ..నారాయణ అంటున్న టీడీపీ, ఎందుకో తెలుసా

మాజీ మంత్రి పి నారాయణ వ్యవహారం టీడీపీని కలవరపరుస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగిన ఆయన ఇటీవల టీడీపీకి దాదాపుగా దూరంగా ఉంటున్నారు. నెల్లూరు రాజకీయాల్లో ప్రత్యక్షంగా బరిలో దిగి పరాజయం పాలయిన నాటి నుంచి ఆయన టీడీపీకి ఎడంగానే సాగుతున్నారు. మొన్నటి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీకి సహాయ నిరాకరణ చేశారు. దాంతో వైఎస్సార్సీపీకి ఆయన అండగా నిలిచారంటూ ప్రచారం కూడా సాగింది. ఏపీలో వైఎస్ జగన్ నాయకత్వానికి జై కొట్టే దిశలో నారాయణ ఉన్నారనే ప్రచారంతో టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.

తెలుగురాష్ట్రాల్లోనే అతి పెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ గ్రూపు సంస్థల యజమానిగా నారాయణకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. తొలుత మండలిలో అవకాశం ఇచ్చి మంత్రిని చేశారు. సీఆర్డీయే, అమరావతి వ్యవహారాల్లో ఆయనదే కీలక పాత్ర. అందుకు నారాయణ కులం కూడా ఓ కారణంగా చెబుతారు. నారాయణను ముందుపెట్టి చంద్రబాబు కథ నడిపించారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి భూ అక్రమాల్లో నారాయణ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన మీద కూడా ఏసీబీ కేసులు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ స్థానం నుంచి అసెంబ్లీకి బరిలో దిగి ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో నారాయణ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ నేతల తీరు నారాయణకు రుచించడం లేదని సమాచారం. ఇప్పటికే ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. ఏపార్టీకి దగ్గర కావాలనే విషయంలో ఊగిసలాటలో గంటా ఉన్నారు. అదే సమయంలో నారాయణ మాత్రం వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు రావడం టీడీపీ లో అలజడి రేపింది.ఇప్పటికే నేరుగా చంద్రబాబు కూడా నారాయణతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. టీడీపీని వీడినా ఫర్వాలేదు గానీ వైఎస్సార్సీపీ వైపు వెళ్లవద్దని ఆయన సూచించినట్టు నారాయణ సన్నిహితుల అభిప్రాయం.

నారాయణ మాత్రం తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. కొంతకాలం వేచిచూసి తన భవితవ్యానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. అయితే నారాయణకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనే చర్చ కూడా ఉంది. గతంలోనే జగన్ తో ఏకాంతంగా బేటీ కావాలని యోచించినా సీఎం నుంచి సానుకూలత రాలేదు. దాంతో నారాయణ అడుగులు ఎటు ఉంటాయనేది టీడీపీకి తలనొప్పిగా మారబోతోంది. ఇప్పటికే నెల్లూరులో ఆ పార్టీ బోణీ కూడా కొట్టలేక బోల్తాపడుతోంది. నారాయణ వంటి నేతలు కూడా చేజారితే ఇక టీడీపీకి వరుస ఓటముల సోమిరెడ్డి తప్ప మరో దిక్కులేని స్థితిలోకి దిగజారిపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Also Read : Amravati, Kanakamedala, Rajya Sabha - రాజకీయం కోసమే వరద.. అజెండా మాత్రం అమరావతే.. నిరూపించిన టీడీపీ ఎంపీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp