పక్కా నాన్‌ లోకల్‌.. నెల్లూరు రెడ్ల రాజకీయం

By Karthik P Jun. 10, 2021, 07:38 pm IST
పక్కా నాన్‌ లోకల్‌.. నెల్లూరు రెడ్ల రాజకీయం

లోకల్, నాన్‌లోకల్‌.. ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఉంది. రాజకీయమైనా.. ఇతర ఏ రంగమైనా.. లోకల్, నాన్‌లోకల్‌ అనే అంశాలు తమ వంతు పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రాజకీయంలో లోకల్, నాన్‌లోకల్‌ అంశంపై జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. నాన్‌లోకల్‌ అభ్యర్థి లోకల్‌ అభ్యర్థితో పోటీ పడడం కొంచెం కష్టమే. ఇంకా చెప్పాలంటే.. నాన్‌లోకల్‌ అంశాన్ని ప్రత్యర్థి తన ప్రచారాస్త్రంగా మలుచుకుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి.. అమలాపురం మున్సిపల్‌ ఎన్నికల వరకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.

నెల్లూరు నేతలు ప్రత్యేకం..

లోకల్, నాన్‌లోకల్‌ మధ్య పోరు జరిగితే.. లోకల్‌ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువ. కానీ నెల్లూరు జిల్లా రెడ్డి నాయకుల విషయంలో ఇది రివర్స్‌. జిల్లా దాటి వెళ్లి మరీ నెల్లూరు రెడ్డి నాయకులు విజయాలు సాధించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడికి భిన్నంగా.. రచ్చ గెలుస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇతర ఏ జిల్లా నేతలకు లేని ఈ ట్రాక్‌ రికార్డు నెల్లూరు జిల్లా నేతలకు మాత్రమే సొంతం.

బెజవాడ కుటుంబం..

నెల్లూరు జిల్లాలో బెజవాడ, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి, తిక్కవరపు కుటుంబాలు ఇతర జిల్లాలో తమ సత్తాను చాటాయి. నెల్లూరు జిల్లాకు చెందిన బెజవాడ గోపాల్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గానూ సేవలందించారు. బెజవాడ పాపిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున 1984లో ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం బెజవాడ కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లో లేరు.

నేదురుమల్లి రాజకీయం..

నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. నెల్లూరు జిల్లా అవతల విజయవంతమైన రాజకీయ నాయకుడుగా పేరొందారు. నేదురుమల్లి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1994లో నేదురుమల్లి నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

Also Read : పుంగనూరులో టీడీపీ బెంగ తీరేది కాదు!

మాగుంట కుటుంబం...

నెల్లూరు జిల్లాకే చెందిన మరో రాజకీయ కుటుంబం మాగుంట. పారిశ్రామిక వేత్త అయిన మాగుంట సుబ్బరామిరెడ్డి తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకు దగ్గరయ్యారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసిన మాగుంటను ప్రకాశం జిల్లా ప్రజలు ఆదరించారు. గెలిచింది ఒకసారైనా.. మాగుంట తన సేవా కార్యక్రమాలతో ప్రకాశం జిల్లా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నక్సల్స్‌ దాడిలో ఆయన అమరుడయ్యారు. రాజకీయ వారసురాలిగా వచ్చిన ఆయన సతీమణి మాగుంట పార్వతమ్మ 1996 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుంచి గెలిచారు. ఆమె తర్వాత సుబ్బరామిరెడ్డి తమ్ముడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు నుంచి పలుమార్లు పోటీ చేశారు. 1998, 2004, 2009, 2019 ఎన్నికల్లో శ్రీనివాసుల రెడ్డి విజయం సాధించారు. ఇప్పటికీ మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు ఉందంటే అది సుబ్బరామిరెడ్డి ఘనతే.

మేకపాటి.. ఘనాపాటి..

రచ్చ గెలిచి.. ఇంట గెలిచిన నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి. మేకపాటి కూడా తన జాతీయ రాజకీయ జీవితాన్ని జిల్లా బయట మొదలుపెట్టి జిల్లాలో ముగించారు. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మేకపాటి.. తొలిసారి 1989లో ఒంగోలు లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1996, 1998 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన మేకపాటి.. 2004 ఎన్నికల్లో నరసారావుపేట నుంచి బరిలో నిలుచున్నారు. అక్కడ విజయం అందుకున్నారు. 2009 ఎన్నికల నాటికి సొంత జిల్లాకు వచ్చారు. 2009లో నెల్లూరు లోక్‌సభ నుంచి గెలిచారు. వైసీపీలో చేరిన సమయంలో ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో.. వైసీపీ తరఫున నిలుచున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో మేకపాటి ఘన విజయం సాధించారు. 2014లోనూ మరోసారి నెల్లూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్‌ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

విశాఖలో టీఎస్‌ఆర్‌..

తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి (టీఎస్‌ఆర్‌) నెల్లూరు జిల్లా వాసి అయినా.. ఆయన రాజకీయం అంతా విశాఖలో సాగింది. బడా కాంట్రాక్టర్‌ అయిన సుబ్బిరామిరెడ్డి.. విశాఖ నుంచి లోక్‌సభకు పలుమార్లు పోటీ చేశారు. 1996, 1998 ఎన్నికల్లో గెలిచిన సుబ్బిరామిరెడ్డి.. 1999లో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2012 నెల్లూరు లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి.. వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో సుబ్బిరామిరెడ్డి నెల్లూరులో పోటీ చే శారు తప్పితే.. అంతకు ముందు జిల్లా రాజకీయాల్లో ఆయన పాత్ర అంతంతమాత్రమే.

విజయసాయిరెడ్డి.. వేమిరెడ్డి..

నెల్లూరు జిల్లాకే చెందిన రెడ్డి నాయకులు.. వి.విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిలు. ప్రస్తుతం వైసీపీలో ఈ ఇద్దరు నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు.. పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంఛార్జిగా ఉంటూ... అక్కడ రాజకీయ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ సాధించిన విజయంలో విజయసాయి రెడ్డిది కీలక పాత్ర. ఇక వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తాను ఇంఛార్జిగా ఉన్న నెల్లూరు, కర్నూలు జిల్లాలల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ప్రస్తుత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి.. వైసీపీ నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఇంఛార్జిగా ఉన్నారు. ఏపీలో పదమూడు జిల్లాలకు గాను నెల్లూరు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు ఐదు జిల్లాల రాజకీయాలను శాసిస్తున్నారు.

Also Read : నేదురుమల్లి వారసులు ఏం చేస్తున్నారు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp