మాస్క్‌ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై అధికారి దాడి.. కటకటాల్లోకి నెట్టిన పోలీసులు

By Kotireddy Palukuri Jun. 30, 2020, 01:27 pm IST
మాస్క్‌ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై అధికారి దాడి.. కటకటాల్లోకి నెట్టిన పోలీసులు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో స్వియ రక్షణ చర్యల్లో భాగంగా మాస్క్‌ ధరించడం తప్పనిసరి. తనతోపాటు ఇతరులకు కూడా దీని వల్ల మేలు జరుగుతుంది. డాక్టర్లు, నిపుణులు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంపై పదేపదే చెబుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే కొంత మంది మాత్రం ఇది పాటించడంలేదు. పాటించాలని చెప్పే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ ప్రజలే అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలానే వ్యవహరిస్తూ తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు.

నెల్లూరులోని ఏపీ టూరిజం హాటల్‌లో ఓ అధికారి మాస్క్‌ పెట్టుకోవాలని సూచించిన మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విధులు నిర్వహించే సమయంలో మాస్క్‌ లేని డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను గమనించిన కాంట్రాక్ట్‌ ఉద్యోగిని ఉషారాణి మాస్క్‌ పెట్టుకోవాలని సూచించారు. డిప్యూటీ మేనేజర్‌ను అయిన నాకే చెబుతావా అంటూ సదరు భాస్కర్‌.. మహిళా ఉద్యోగిపై కర్రతో దాడి చేశారు. అడ్డుకోబోయిన తోటి ఉద్యోగులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. వారిని దూషించారు.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఉద్యోగిని ఫిర్యాదులో ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఉషారాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. భాస్కర్‌ దాడి చేస్తున్న దృష్యాలు కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. దీంతో పోలీసులు భాస్కర్‌ను అరెస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఏపీ టూరిజం ఉన్నతాధికారులు సదరు డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను సస్పెండ్‌ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp