అగ్ర రాజ్యంలో అల్లకల్లోలం..

By Kalyan.S Jul. 14, 2020, 07:06 am IST
అగ్ర రాజ్యంలో అల్లకల్లోలం..

ప్రపంచానికి పెద్దన్న.. కరోనా మహమ్మారి ముందు చిన్న బోతోంది. దాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక తల పట్టు కుంటుంది. అమెరికాలో కరోనా వైరస్‌ రికార్డుల మోత మోగిస్తోంది. ఒకే రోజు 66,570 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కల్లోలం రేపుతోంది. అమెరికాలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కాగా.. 60 వేలకుపైగా పాజిటివ్‌లు తేలడం గత ఐదు రోజుల్లో ఇది నాలుగోసారి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,87,470కి ఎగబాకింది. ఇప్పటి వరకు 1,37,631 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా కలవరం మొదలైంది మొదలు ఇప్పటివరకూ ఫేస్‌ మాస్క్‌ ధరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు విమర్శలకు తలొగ్గారు. తొలిసారిగా మాస్క్‌ ధరించి కనిపించారు. గత శనివారం వాల్టర్‌ రీడ్‌ మిలటరీ ఆస్పత్రికి వచ్చిన ఆయన అధ్యక్ష ముద్ర ఉన్న మాస్క్‌ ధరించి కనిపించారు. బ్రెజిల్‌లోనూ వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల్లో ఇక్కడ 35,558 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 18,46,249కి పెరిగింది.

దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో భారీగా వ్యాప్తి

కాలిఫోర్నియా, టెక్సస్‌, ఫ్లోరిడా, అరిజోనాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది.

లెక్కకు మించి...

జూలై 7న 53 వేల కేసులు.. 663 మరణాలు, 8న 61 వేల కేసులు.. 962 మరణాలు, 9న 63 వేల కేసులు.. 970 మరణాలు, 10న 66 వేల కేసులు.. 879 మరణాలు నమోదయ్యాయి! ఇక శనివారం ఒక్కరోజే అమెరికాలో రికార్డు స్థాయిలో 71 వేలకు పైగా కేసులు, 915 మరణాలు నమోదయ్యాయంటే అక్కడ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు! అమెరికాలో కేసుల సంఖ్య 33 లక్షలు, కరోనా మరణాల సంఖ్య 1.37 లక్షలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రాలవారీగా చూస్తే ఇన్నాళ్లూ న్యూయార్క్‌లో భారీగా కేసులు నమోదైతే.. ఇప్పుడు దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలైన టెక్సస్‌, ఫ్లోరిడా, అరిజోనా, కాలిఫోర్నియా వంటిచోట్ల కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో నమోదైన కేసుల్లో 30ు ఆ రాష్ట్రాలవే. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

జూలై 8 నుంచి రోజూ 850 మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలా 5 రోజుల్లో 3500 మందికి పైగా మరణించారు. మే మూడోవారం నుంచి తగ్గుతూ వచ్చిన మరణాల సంఖ్య జూలై 5న అతి తక్కువగా 200కు చేరుకుంది. కానీ, అనూహ్యంగా మళ్లీ భారీగా పెరగడం మొదలైంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కేసులు, మరణాలు పెరగడమే అమెరికాలో కరోనా ప్రస్తుత విశ్వరూపానికి కారణం. గతవారంలో అలబామా, అరిజోనా, ఫ్లోరిడా, మిస్సిసిపి, ఉత్తర కరొలినా, దక్షిణ డకోటా, టెక్సస్‌, టెన్నిసీ రాష్ట్రాల్లో ఒకరోజు అత్యధిక మరణాలు నమోదయ్యాయి. టెక్స్‌సలో గతవారంతో పోలిస్తే మరణాలు బాగా పెరిగాయి.

మళ్లీ లాక్ డౌన్..?

అమెరికాలో కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరగడానికి ప్రధాన కారణం 4 రాష్ట్రాలు. అవి.. టెక్సస్‌, ఫ్లోరిడా, అరిజోనా, కాలిఫోర్నియా. జూలై నెలలో తొలి 10 రోజుల్లో నమోదైన కేసులు 5,27,278. అందులో 2,90,700కేసులు ఈ నాలుగు రాష్ట్రాలవే. న్యూయార్క్‌ తర్వాత కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన టెక్స్‌స్ లో వారం రోజుల్లో రెండుసార్లు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ఆ రాష్ట్రంలో 72,500కేసులకు పైగా నమోదయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ ప్రకటించారు. ఇక, భారతీయులు, తెలుగువారు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియాలో కరోనా కారణంగా ఆస్పత్రులపాలైనవారి సంఖ్య రెట్టింపు అయ్యింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp