పని తీరుకు పట్టం.. నవీన్ నిశ్చల్‌కు ఆగ్రోస్ చైర్మన్ పదవి

By Ritwika Ram Jul. 19, 2021, 06:15 pm IST
పని తీరుకు పట్టం.. నవీన్ నిశ్చల్‌కు ఆగ్రోస్ చైర్మన్ పదవి

నమ్ముకున్న వాళ్లని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నటికీ మోసం చేయరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా చెప్పే మాట ఇది. జగన్ ను నమ్ముకుంటే తిరుగు ఉండదని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలను నిజం చేస్తూ ఒక్కరో ఇద్దరో కాదు.. 135 మందికి వివిధ కార్పొరేషన్లు, అథారిటీల పదవులు ఇచ్చారు వైఎస్ జగన్. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాదు.. పార్టీ కోసం కష్టపడ్డ కింది స్థాయి లీడర్లను కూడా అందలమెక్కించారు. హిందూపురంలో వైఎస్సార్ సీపీకి పెద్దదిక్కుగా ఉన్న నవీన్ నిశ్చల్‌ కు నామినేటెడ్‌ పదవిని అప్పగించారు. ఏపీ ఆగ్రో డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. పని తీరుకు పట్టంకట్టారు.

స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే..

హిందూపురం రాజకీయాల్లో 20 ఏళ్లగా బుక్కపట్నం నవీన్ నిశ్చల్ కొనసాగుతున్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆయన పాలిటిక్స్‌ పై ఆసక్తి పెంచుకున్నారు. 1989లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హిందూపురం నుంచి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గాజుల సోమశేఖర్.. నవీన్ నిశ్చల్‌ కు సమీప బంధువు. దీంతో అప్పుడే ఆయన రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. అప్పటి నుంచే మాస్ నాయకుడిగా ఎదిగి హిందూపురంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read : రాజన్న దళం చిరంజీవి రెడ్డికి ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ పదవి ఎలా దక్కింది..?

రెండు సార్లు జస్ట్ మిస్..

2004లో తొలిసారి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు నవీన్ నిశ్చల్. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత ఐదేళ్లు ప్రజల్లో తిరిగారు. ఎలాగైనా గెలవాలని భావించారు. కానీ 2009లో కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. దీంతో ఇంటిపెండెంట్ గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి అబ్దుల్ ఘనికి 45 వేల ఓట్లు వస్తే.. స్వతంత్రుడిగా బరిలో నిలిచిన నవీన్ నిశ్చల్‌ కు 36 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కనీసం పోటీ ఇవ్వలేదు. నవీన్ కనుక కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఉంటే గెలిచే వారని ఇప్పటికీ చెప్పుకుంటారు.

బాలకృష్ణతో ఢీ అంటే ఢీ

తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు నవీన్. 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన గెలుపు దాదాపు ఖాయమని అనుకున్నారంతా. 1999 నుంచి ఐదేళ్లకోసారి అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు మారుతూ ఉండటం, గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో తనకు అనుకూలంగా ఉంటుందని నవీన్ భావించారు. కానీ అనూహ్యంగా సినీ నటుడు, ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ ఎంటర్ అయ్యారు. హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలోకి వచ్చారు. దీంతో టీడీపీ గెలుపు ఖాయమని అంతా భావించారు. అయితే నవీన్ నిశ్చల్ ఎక్కడా తగ్గలేదు. ముమ్మరంగా ప్రచారం చేశారు. రికార్డు స్థాయిలో ఓట్లు నమోదయ్యాయి. కౌంటింగ్ హోరాహోరీగా సాగింది. చివరికి 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు నవీన్ నిశ్చల్. బాలకృష్ణకు గెలుపు అంత ఈజీగా ఇవ్వలేదు.

Also Read : 'కాయల' కృషి పండింది.. అభిమానానికి జగన్ అందలం

2019లో ఎన్నికలకు దూరం..

వరుస ఓటములు ఎదురైనా నవీన్ నిశ్చల్ కుంగిపోలేదు. మరింత దూకుడుగా ముందుకు కదిలారు. 2019లో తానే గెలుస్తానని ప్రకటించుకున్నారు. సర్వేలు కూడా ఆయనకు అనుకూలంగా వచ్చాయి. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. మహమ్మద్‌ ఇక్బాల్‌ను హిందూపురం అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. దీంతో నవీన్ నిశ్చల్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే పార్టీ నచ్చజెప్పడం, భవిష్యత్‌పై భరోసా ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఎపీ రాష్ట్ర ఆగ్రోస్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. హిందూపురంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నందుకు, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందుకు తగిన బహుమతి అందించారు జగన్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp