నేను చూసిన దుర్గం రైల్వే స్టేషన్

ప్రతి మనిషి జీవితంలోనూ రైలుకి స్థానం ఉంటుంది. రైలును ఇష్టపడని వాళ్లుండరు. ఒకటో తరగతిలో రైలు బొమ్మ ఉండేది. దాన్ని ఎన్నిసార్లు చూసి ఉంటానో గుర్తు లేదు. రాయదుర్గానికి రైల్వేస్టేషన్ వుండేది. Narrow Gauge , చిన్న రైలు. అంతా కలిసి మూడు నాలుగు పెట్టెలుండేవి. బళ్లారి నుంచి రోజుకి రెండుసార్లు రైలు వచ్చేది. ఒక గుండ్రటి చట్రంలో ఇంజన్ని పెట్టి తిప్పేవాళ్లు. వచ్చిన రైలు మళ్లీ అదే దారిలో వెనక్కి వెళ్లాలి. ముందుకి పట్టాలు లేవు. ఇంజన్ని రివర్స్ చేసే సదుపాయం అది. కొంత కాలానికి ఆ గుండ్రటి చట్రం చెడిపోతే వచ్చిన రైలు, అలాగే వెనక్కి వెళ్లేది. అంటే ఇంజన్ వెనక్కి పరుగు తీసేది. రివర్స్‌లో వెళ్లే రైలుని జీవితంలో మళ్లీ ఎప్పుడూ చూడలేదు.
ఊహ వచ్చిన తర్వాత చేసిన తొలి రైలు ప్రయాణం ఇదే. పెద్ద శబ్దంతో పొగ వదులుతూ వచ్చిన రైలుని చూసి భయంతో చాలాసేపు ఏడ్చినట్టు గుర్తు. తర్వాత రైల్లోని ఫ్యాన్లు చూసి ఏడ్పు మానేశాను. థియేటర్లలో తప్ప ఇళ్లలో ఫ్యాన్లు లేని కాలం. కొంత కాలం నడిచిన తర్వాత రైలు ఆగిపోయింది. అపుడప్పుడు గూడ్సలు వచ్చేవి. కాలక్రమేనా స్టేషన్ శిథిలమైపోయింది. ఇప్పుడు టుంకూరు వరకూ పునరుద్ధరించారు. రాయదుర్గం జంక్షన్‌గా మారింది. రైలు ఇక తిరగదనుకున్న వూళ్లో కూత వినిపిస్తోంది.
సాయంత్రం పూట పిల్లలం షికారు వెళ్లి ఒంటరి స్టేషన్ బెంచీల మీద కబుర్లు చెప్పుకునే వాళ్లం. పట్టాల మీద అటూఇటూ చేతులు కట్టుకుని నడవడం ఓ సరదా. అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్తున్నప్పుడు మధ్యలో గేట్లో వచ్చేవి. ఆ గేట్ పడితే ఒకటే సంబరం. వచ్చేది గూడ్స్ రైలైతే ఇంకా కిక్. చూసినంత సేపు చూడొచ్చు. మా వూరు చీమలవాగుపల్లెకు వెళ్లినప్పుడు మిద్దె ఎక్కితే జూటూరు రైల్వేస్టేషన్ కనపడేది. దూరంగా పొగలు గక్కుతూ వెళ్తున్న రైలుని నేను గుర్రం మీద వెళ్లి ఆపి దోచేసుకున్నట్టు కలలు కనేవాన్ని. నాకో గ్యాంగ్ కూడా వుండేది. నేను ఎవరెవరిని గ్యాంగ్‌లో చేర్చుకున్నానో ఆ సభ్యుల్లో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. వాళ్లలో కొంత మంది చచ్చిపోయారు కూడా.
శ్యామ్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడిది వైజాగ్. రాయదుర్గంలో పిన్ని దగ్గర ఉండి చదువుకునేవాడు. ఏడో తరగతిలోనే వాడు ఒంటరిగా రైల్లో వైజాగ్ వెళ్లేవాడు. ఆ రోజుల్లో వైజాగ్ వెళ్లాలంటే బస్సులో బళ్లారి వెళ్లాలి. అక్కడ్నుంచి రైలు ఎక్కి గుంటూరు వెళ్లాలి. అక్కడ వైజాగ్ రైలు ఎక్కాలి. రిజర్వేషన్ కూడా లేని రోజుల్లో సూట్‌కేసు మోసుకుని అంత చిన్న పిల్లాడు ఎలా వెళ్లే వాడో తలచుకుంటే ఇప్పుడు భయమేస్తుంది.
అనంతపురం (1976) వచ్చే వరకూ స్టేషన్ అంత పెద్దగా ఉంటుందని తెలియదు. అప్పట్లో మీటర్‌గేజ్ మాత్రమే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వుండేది. ఇది కాకుండా ప్యాసింజర్ రైళ్లు ఉండేవి. బ్రాడ్‌గేజ్ పడిన తర్వాతే బాంబే, ఢిల్లీ రైళ్లు వచ్చాయి. గుంతకల్లులో మా పెద్దమ్మ ఉండడంతో తరచూ రైలెక్కేవాన్ని. గుంతకల్లు జంక్షన్ చూసి కళ్లు తిరిగాయి. తప్పి పోతానేమో అని భయమేసింది.
అనంతపురం స్టేషన్ బయట వేడివేడి బజ్జీలు తినడం ఇష్టం. ఈ అంగడి ఇప్పుడు కూడా ఉంది. రైల్లో చెనిక్కాయలు, జాంపండ్లు కొని తింటూ వెళితే జర్నీ మజాగా ఉండేది. చివరి రోజుల్లో మతిస్థిమితం లేక మా తాత తాడిపత్రిలో రైలెక్కి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఆయన రైలెక్కడం మా ఊళ్లో వాళ్లు చూశారు. టికెట్ లేని వాళ్లని గుత్తి స్టేషన్లో దింపేస్తారని తెలిసి అక్కడంతా వెతికాను. 3 నెలల తర్వాత తిరిగొచ్చాడు. నాంపల్లి స్టేషన్ పరిసరాల్లోని ఒక కుటుంబం ఆయన్ని సురక్షితంగా సాకింది. ఇప్పటికీ ఆ పరిసరాలకి వెళితే వాళ్లు గుర్తొస్తారు. ఒక ముసలాయన్ని 3 నెలలు కాపాడారంటే ఎంత గొప్పోళ్లూ.
అర్ధరాత్రి వెంకటాద్రి ఎక్కి టికెట్ లేకుండా తిరుపతికి జర్నీ చేయడం రెండుమూడు సార్లు నడిచింది. టిసికి భయపడుతూ ఉండడం నచ్చక మానేశాను.
రైలు మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళుతుంది. ఎవరెవరినో కలుపుతుంది. కొందర్ని తీసుకెళుతుంది కూడా. ఆంధ్రజ్యోతిలో నా కొలీగ్ , రచయిత చక్రవేణు పట్టాలు దాటుతూ చనిపోవడం ఓ విషాదం. 40 ఏళ్ల క్రితం అనంతపురం ఆర్ట్స్ కాలేజీ అమ్మాయి రైలు పట్టాలపై శవంగా తేలింది. హత్యాచారం చేసి హత్య చేశారని పత్రికల్లో వచ్చినా కేసు మూసేశారు. పెద్దవాళ్ల పిల్లలు నిందితులని అనుమానం. నిజమో కాదో తెలియదు.
అనంతపురంలో రూపాలి గిఫ్ట్ షాపు యజమాని ఈ మధ్య రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా ఏళ్ల ముఖ పరిచయం కదా, ఆ రోజంతా బాధగా ఉండింది. జర్నలిస్టుగా ఉన్నప్పుడు రైలుకింద ఆత్మహత్యల ఫొటోలు కొన్ని వందలు చూసి ఉంటాను. ప్రతి ఫొటో ఏదో కథ చెబుతున్నట్టనిపించేది. మనుషులు ఎందుకంత నిస్సహాయంగా చనిపోతారు. ఆవేశంతోనా? లేదంటే ఈ ప్రపంచంలో ఎవరూ తమకు సాయం చేయరన్న నమ్మకంతోనా?
రైలు ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది. కొంత మందికి విముక్తిని కూడా!


Click Here and join us to get our latest updates through WhatsApp