రాష్ట్రమంతా ‘తొక్కే’స్తాడట

By Jaswanth.T Aug. 01, 2020, 10:24 am IST
రాష్ట్రమంతా ‘తొక్కే’స్తాడట
అదేనండీ మన చినబాబు రాష్ట్ర మంతా సైకిల్‌ తొక్కేస్తానంటున్నాడట. ఈ యేడాది చివరి నాటికి కరోనా కరుణించి కాస్తంత శాంతిస్తే చినబాబు సైకిల్‌ బైటకు తీస్తాడని టీ.డీ. పార్టీ వర్గాల భోగట్టా. ఇప్పటికిప్పుడు ఇంత ఉత్పాతం ఎందుకు అనుకుంటున్నారా 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా (ఇప్పుడున్న స్థానం కంటే మెరుగైన స్థానంలో నిలపడం కోసమని కొందరు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు..) అంటూ లీకులు కూడా ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని పాదయాత్రలు అధికార పీఠం వద్దకే చేరాయి. వాటి నుంచి స్ఫూర్తి పొందిన చినబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వయోభారంతో ఉన్న చంద్రబాబు మరో సారి పాదయాత్ర చేసే స్థితిలో ఉండరని, ఈ నేపథ్యంలో భావి వారసుడుగా పెదబాబు భావిస్తున్న చినబాబు చేపట్టబోయే సైకిల్‌ యాత్ర తమకు కలిసొస్తుందని ఈ బాబులిద్దరి భక్తులు భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల టాక్‌.

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా ఒకటుంది. ఎన్నికలైపోయి యేడాది దాటిపోయింది. ‘‘యేడాది చూస్తాం.. ఆ తరువాత మా తడాఖా చూపిస్తాం’’ అని చంద్రబాబు చెప్పి కూడా యేడాది దాటిపోయింది. అధికారంలో ఉండగా టీ.డీ. పార్టీలో ప్రధానంగా వెలిగిన నాయకులందరూ చీకట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కన్పిస్తున్న వాళ్ళు కూడా ప్రజలతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు కొన్ని జిల్లాల్లోనైతే పార్టీ కేడర్‌ మాట అటుంచి నాయకులే పత్తాలేకుండా పోయిన ఘటనలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యత మొత్తం పెదబాబు, చినబాబులే ట్విట్టర్‌లోనూ, జూమ్‌లోనూ మోస్తున్నారు. 2019 ఓటమి తరువాత ప్రజలకు దూరంగా ఉండి హైదరాబాదులోనే కాలం గడుపుతున్న ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల తరువాత చేపట్టబోయే సైకిల్‌ యాత్రకు సొంత పార్టీ కేడర్‌ నుంచి వచ్చే మద్దతు ఎంత? అన్న ప్రశ్న ప్రధానంగా విన్పిస్తుంది.

మరో కోణంలో ఆలోచిస్తే.. ఆఖరి యేడాదిలో చేస్తే సరిపోతుంది (చంద్రబాబు లాజిక్‌ ప్రకారం) అనుకునున్న సంక్షేమ పథకాలన్నింటినీ అధికారంలోకొచ్చిన మొదటి యేడాదిలోనే ప్రారంభించి అమలు చేస్తున్నాడు సీయం వైఎస్‌ జగన్‌. మరో వైపు విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో కూడా సంస్కరణల బాట పట్టించి, ప్రజలకు ప్రయోజనకరమైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి తోడు వయస్సు చిన్నదే అయినా రాజకీయంగా రాటుదేలిన నిర్ణయాలతో ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సైతం ఊపిరి సలపనీయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌పై బలంగా ఉన్న ప్రజల దృష్టిని మరల్చేటంతటి శక్తియుక్తులు చినబాబుకు ఉన్నాయా? అన్న సందేహం కూడా సొంత పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు.

అవకాశం వచ్చినప్పుడే తనను తాను నిరూపించుకోలేకపోయాడు అన్న ఉద్దేశ్యమే వారిలో ఇంకా కన్పిస్తోంది. అధికారంలో ఉన్నన్నాళ్ళూ అప్రకటిత యువరాజుగా చెలామణి అయ్యారే తప్ప తనకు తానుగా ప్రజలు గుర్తు పట్టగలిగే స్థాయిలో ఎటువంటి ప్రభావం చూపలేదన్నది సీనియర్‌ల అభిప్రాయంగా చెబుతున్నారు. అటువంటిది ఇప్పుడు ప్రత్యేకంగా అవకాశాన్ని సృష్టించుకుని నేరుగా ప్రజల్లోకి వెళ్ళి నిరూపించుకోగలిగేటంతటి సామర్ధ్యంపై ఆ పార్టీనేతలు పూర్తిగా బైట పడకపోయినా లోలోన మల్లగుల్లాలు పడుతున్నారు. ట్విట్టర్‌లో తప్పితే ప్రత్యక్షంగా మైకుల ముందుకు వస్తే చినబాబు బండారాన్ని అన్ని రకాలుగానూ మీడియా ఆడుకుంటోంది. అటువంటప్పుడు నేరుగా ప్రజల ముందుకే వెళితే పరిస్థితేంటి, తదనుగుణంగా వచ్చే పరిణామాలు ఏంటన్న మీమాంశ వారిలో లేకపోలేదు. అయినప్పటికీ ‘అయిననూ పోయి రావలె హస్తినకు..’ అన్న రీతిలో సైకిల్‌ యాత్రకు తలలాడిస్తున్నట్లుగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. పైగా అమరావతి అంశం ఎలాగూ అవకాశంగా లభించింది. ఈ అంశాన్ని ఎత్తుకుని చినబాబు ప్రజల్లోకి వెళితే చాలు టీ.డీ. పార్టీ భవిష్యత్‌ ఏమిటో తేలిపోతుంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp