తమ కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ ప్రధాని మోడికి లేఖ

By Amar S 02-12-2019 08:53 PM
తమ కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ ప్రధాని మోడికి లేఖ

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో వెల్లూరు జైలులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆమె భర్త మురుగన్ లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.

ఈమేరకు గతనెల 27న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్‌కి నళిని లేఖ రాశారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే నళిని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె తరపు లాయర్ పుగజెంది పేర్కొన్నారు. జైలు అధికారుల సాయంతో ప్రధాని మోదీకి నళిని లేఖ రాశారని ఆయన తెలిపారు. ‘మేము విడుదలవుతామని గత 26 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాం.. ఇప్పుడు ఆ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జైలు అధికారులు నా భర్త మురుగన్‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.. వారు నా భర్తను పెడుతున్న బాధలు చూడలేకపోతున్నాను. అందువల్ల మా కారుణ్య మరణానికి అనుమతించండి.’ అని ప్రధానికి రాసిన లేఖలో నళిని కోరినట్టు లాయర్ తెలిపారు.

అలాగే తమను వెల్లూరు జైలు నుంచి పుఝల్ జైలుకు తరలించాలంటూ నళిని తమిళనాడు ప్రభుత్వానికి కూడా వినతిపత్రం ఇచ్చారు. వెల్లూరు జైలు అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అయితే వెల్లూరు జైల్లో మురుగన్ వద్ద సెల్‌ఫోన్ దొరకడంతో జైలు అధికారులు ఆయనను ఒంటరిగా ఉంచుతున్నారు. దీనికి నిరసనగా గత పదిరోజుల నుంచి నళిని, మురుగన్ లు నిరాహార దీక్ష చేస్తున్నారు. నళినిని ప్రస్తుతం వెల్లూరులోని ప్రత్యేక మహిళా జైల్లో ఉంచారు. అయితే రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మొత్తం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలంటూ గతంలోనే తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ముందు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News