వైసిపి కార్యకర్త పై హత్యాయత్నం

By Voleti Divakar Feb. 23, 2021, 08:30 am IST
వైసిపి కార్యకర్త పై హత్యాయత్నం

కాకినాడ నగరపాలక సంస్థలో వైఎస్సార్ సిపికి చెందిన సీనియర్ కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురైన సంఘటన మరువక ముందే రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలపై పట్టపగలు హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టిస్తోంది. రాజమహేంద్రవరం ఎంపి
మార్గాని భరత్ రామ్ కు సన్నిహితుడైన, రియల్ ఎస్టేట్ వ్యాపారి దొండపాటి శ్రీనుపై హత్యాయత్నం జరిగింది. శ్రీను స్థానిక బాలికల హైస్కూలు సమీపంలోని అపార్ట్ మెంట్ వద్ద ఉండగా కారులో వచ్చిన దుండగలు కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీను తొలుత రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తరువాత కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రియల్ ఎస్టేట్ వివాదాలే కారణమా?

2019 వరకు టిడిపి, ప్రజారాజ్యం ఉన్న శ్రీనుపై గత ఎన్నికలకు ముందు వైసిపిలో చేరారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలే హత్యాయత్నానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. శ్రీను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని, ఈ నేపథ్యంలో ఏర్పడిన వివాదం ఆయన పై హత్యాయత్నం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కంపర రమేష్ హత్య కూడా ఇదే కారణంతో జరగడం గమనార్హం.

అదే టిడిపి వారైతే....

హత్యకు గురైంది....హత్యాయత్నం జరిగింది వైఎస్సార్ సిపి పార్టీకి చెందిన వారే కావడంతో టిడిపి నేతలకు మాట్లాడే అవకాశం లేకుండాపోయింది. అదే తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో కూడా రాయల సీమ ఫ్యాక్షన్ రంగప్రవేశం చేసిందని, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నుంచి కిందిస్థాయి నాయకుల వరకు రాద్దాంతం చేసేవారు. పంచాయితీ ఎన్నికల్లో జరిగిన గొడవలు, విజయవాడలో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై జరిగిన దాడులపై చంద్రబాబు స్పందనే ఇందుకు నిదర్శనం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp