మున్సిపల్‌ రాజకీయంలో రాజీ ఆట..!

By Karthik P Mar. 03, 2021, 04:30 pm IST
మున్సిపల్‌ రాజకీయంలో రాజీ ఆట..!

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. మునుపెన్నడూలేని రాజకీయం మున్సిపల్‌ పోరులో కనిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ నేతలు తమ ప్రాంతాలలో సరికొత్త రాజీ రాజకీయాన్ని నడిస్తున్నారు. పార్టీ రహిత గుర్తులపై జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో పార్టీ గుర్తుల మీద జరిగే మున్సిపల్‌ ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతోందో టీడీపీ నేతలకు క్లారిటీ వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నెగ్గుకురాలేమనే భావనలో తమ్ముళ్లు ఉన్నారు.

అందుకే అధికార పార్టీ నేతలతో బేరసారాలు నడిపిస్తున్నారు. పోలింగ్‌ జరగకుండానే మున్సిపల్‌ పోరును ముగించి, తద్వారా ఎంతో కొంత లబ్ధిపొందేందుకు సరికొత్త ప్రతిపాదనలను ప్రతిపక్ష టీడీపీ నేతలు అధికార పార్టీ నేతల ముందు పెడుతున్నారు. తద్వారా పురపాలికల్లో తమ ఉనికి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్న స్థానాలను బట్టి నాలుగు, ఆరు, పది సీట్లు తమకు ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఇలా చేస్తే.. మిగతా సీట్లలో పోటీ లేకుండా ఏకగ్రీవానికి సహకరిస్తామని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సహా పలు మున్సిపాలిటీల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు అధికార పార్టీ ముందు ఇలాంటి ప్రతిపాదనలు ఉంచారు.

చైర్మన్, వైస్‌చైర్మన్‌ పదవులు రెండూ వైసీపీ వారినే తీసుకోమంటుండడంతో అధికార పార్టీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు కూడా మిగులుతుండడంతో టీడీపీ నేతల ప్రతిపాదనలపై అధికార పార్టీ నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు. అంతర్గతంగా ఓ ఒప్పందం ప్రకారం ఈ రాజీ రాజకీయాలు సాగుతున్నాయి. కానీ అదే సమయంలో టీడీపీ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. అధికార పార్టీ తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తోందంటూ ఎన్నికలు బహిష్కరిస్తున్నామనే ప్రకటనలు చేస్తున్నారు. మార్కాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి కందుల నారాయణరెడ్డి ఈ తరహా ప్రకటన చేయడం గమనార్హం. తమ అధినేత చంద్రబాబు దృష్టిలో పని చేస్తున్నట్లు కనిపించేందుకు తెర ముందు పోరాటం చేస్తూ.. తెర వెనుక మాత్రం బేరసారాలు సాగిస్తున్నారు. టీడీపీ నేతల తీరును గమనిస్తున్న  స్థానికులు ముక్కునవేలేసుకుంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp