'కారు'తో కార్చిచ్చు

తెలంగాణలో ఇప్పడు కారుకు తిరుగే లేదు. కారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో రాజ్యమేలుతున్నారు. అదే సమయంలో ప్రజల్లో కూడా అసంతృప్తి మొదలవుతున్నది. కార్లలో తిరిగే నాయకులు మమ్మల్ని అసలు పట్టించుకోరా.. మా ఊరు వాడలు ఎలా ఉన్నాయో చూడరా అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ప్రశ్నించే వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఆర్మూరులో జరిగిన ఘటన తెలంగాణలో పెద్ద చర్చనీయాంశమయ్యింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో వెలసిన ఫ్లెక్సీ పెద్ద వివాదానికి దారి తీసింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి రూ.3 కోట్లతో కొత్త కారు కొన్నారు. ఈ కారును పెద్ద ఫ్లెక్సీగా వేయించి 'రూ. 3 కోట్లతో కొత్త కారు కొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు. ఆర్మూర్ ప్రజల కోసం కాకపోయినా మీ కారు కోసం అయినా రోడ్డు వేయించండి' అంటూ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు ఒక ఫ్లెక్సీ వేయించారు. ఈ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యింది.
కాగా, ఈ సంఘటన జరిగిన తర్వాత మైలారం బాలు కారు అర్థరాత్రి దగ్దం కావడం వివాదానికి దారి తీసింది.బాలు తన కారును ఇంటి ముందు నిలిపి ఉంచగా.. గత వారం గుర్తు తెలియని దుండగులు కారును దగ్దం చేశారు. పాక్షికంగా కారు కాలిపోవడంతో బాలు ఆర్మూర్ పోలీసులకు పిర్యాదు చేశారు. గతంలో తాను ఎమ్మెల్యే కారు విషయంలో ఫ్లెక్సీ వేయడం వల్లే తనపై కక్ష కట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందిస్తూ... తాను నియోజకవర్గ అభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నానని.. అనుకోకుండా జరిగిన ఒక ఘటనను తన రాజకీయ ప్రత్యర్థులు పావులా వాడుకుంటున్నారని ఆయన అన్నారు.
మైలారం బాలు కారు దగ్దం ఘటనపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ స్పందిస్తూ.. 'ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కనీస మౌళిక వసతులు కల్పించమని అడగటం నేరమా' అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులు, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదగటం ఓర్వలేకనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.


Click Here and join us to get our latest updates through WhatsApp