మోదీ 28 ఏళ్ల క్రితం చెప్పిందే నిజ‌మైంది..!

By Kalyan.S Aug. 03, 2020, 08:10 pm IST
మోదీ 28 ఏళ్ల క్రితం చెప్పిందే నిజ‌మైంది..!

అది 1992వ సంవ‌త్స‌రం.. అయోధ్య‌లో రామాల‌య ఉద్య‌మం ఉధృతంగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అయోధ్య రామాలయం నిర్మించాలని, కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని కోరుతూ నాటి గుజ‌రాత్ నేత‌ నరేంద్ర మోదీ తిరంగా యాత్రను చేపట్టారు. ఫైజాబాద్ సమీపంలోని ఓ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆనాటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషి హాజరయ్యారు. ఆ మరుసటి రోజు మరళీమనోహర్ జోషితో కలిసి అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు అప్పటి ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ చీప్‌ మురళీమనోహర్‌ జోషీ, పలువురు పార్టీ సీనియర్లు మోదీ వెంట ఉన్నారు. అయోధ్య‌లో రామాల‌యం నిర్మాణం కోసం వీరంతా ఉద్య‌మం చేప‌డుతున్నారు. ఈ సందర్భంగా అయోధ్యను సందర్శించిన మోదీ.. మరోసారి ఇక్కడికి వస్తే అది మందిర నిర్మాణం జరిగాకే వస్తానంటూ శపథం చేశార‌ట‌. ఈ విషయాన్ని ఆనాడు మోదీ వెంట ఉన్న ఓ నాయకుడు చెప్పారు. మ‌ళ్లీ ఇప్పుడు సరిగ్గా 28 ఏళ్ల తరువాత అయోధ్య వివాదం సమసిపోవడంతో ప్రధానమంత్రి హోదాలో మోదీ అయోధ్యలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మోదీ ఆనాటి పర్యటనకు సంబందించిన ఫోటోసైతం సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామమందిర భూమిపూజ కార్యక్రమానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబ‌వుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈనెల 5న రామమందిరానికి శంకుస్థాపన జరగునుంది. ఇప్ప‌టికే శాస్ర్తోక్తంగా పూజ‌లు ప్రారంభ‌మయ్యాయి. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దీని కోసం దాదాపు 28 ఏళ్ల అనంతరం నరేంద్ర మోదీ అయోధ్యకు రావడం గమనార్హం.

ఆ ఫొటో వెనుక క‌థ ఇదే...

అయోధ్య రామ‌జ‌న్మభూమి వద్ద బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలిసి ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామాలయ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న స‌మ‌యంలో మోదీ అయోధ్య‌ను సంద‌ర్శించిన‌ప్పుడు తాను ఈ అరుదైన ఫోటోను తీసినట్టు స్థానిక ఫోటోగ్రాఫర్‌ మహేంద్ర త్రిపాఠి చెబుతున్నారు. అప్పట్లో రామజన్మభూమిని ఆనుకుని తనకు ఫోటో స్టూడియో ఉండేదనీ.. మోదీ ఇక్కడికి వచ్చిన సందర్భంగా తాను దీన్ని తీశానని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘మురళీ మనోహర్ జోషితో కలిసి ప్రధాని మోదీ వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. అప్పట్లో వీహెచ్‌పీ తరపున ఫోటోగ్రాఫర్ నేను ఒక్కడినే. ఈ చారిత్రక ఫోటోలను తీసినందుకు గర్వంగా భావిస్తున్నాను..’’ అని త్రిపాఠి పేర్కొన్నారు. అదే సమయంలో కొందరు జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్నారనీ.. గుజరాత్‌ బీజేపీ నేత అంటూ మోదీని జోషి పరిచయం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘మళ్లీ అయోధ్య ఎప్పుడు వస్తారని మేమంతా మోదీని అడిగాం. ‘రామ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడు మళ్లీ వస్తాను..’ అని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రధాని ఆ మాట నిలబెట్టుకుంటున్నారు...’’ అని త్రిపాఠి పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp