మోదీ ఈవీఎంల వ్యాఖ్యల వెనుక కారణాలేంటి..?

By Kalyan.S Apr. 07, 2021, 08:30 am IST
మోదీ  ఈవీఎంల వ్యాఖ్యల వెనుక కారణాలేంటి..?

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఐదింట్లో బెంగాల్‌ మినహా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సోంలో పోలింగ్‌ కూడా పూర్తయింది. సర్వేలు కొన్ని చోట్ల బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు చెబుతున్నాయి. సీఏఏ, వ్యవసాయ చట్టాలు, ప్రైవీకరణ విధానాలే ఇందుకు కారణంగా వెల్లడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ 41వ స్థాపన దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ వాటి గురించే ప్రధానంగా చర్చిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అస్థిరతకు కుట్ర జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. స్వార్థపర శక్తులు, రాజకీయ ప్రయోజనాలను ఆశించి కుట్రకు ప్రయత్నిస్తున్నాయని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘‘పేద రైతుల భూములు లాగేసుకుంటారనీ, ఓ వర్గం వారిని దేశం నుంచి వెళ్లగొడతారనీ, సీఏఏ, సాగు చట్టాలు, కార్మిక చట్టాలు.. ఇలా ప్రతీ దానిపైనా అబద్దాలు చెబుతున్నారు. వరుస ఓటములను తట్టుకోలేని పార్టీలు, దీర్ఘకాలంగా బీజేపీ అంటే పడని పార్టీలు దీనికి ఒడిగడుతున్నాయి. అపోహలు, భయాలు సృష్టిస్తున్నారు. ఇది మనకో సవాల్‌. కార్యకర్తలు దీనిపై అప్రమత్తంగా ఉండాలి. నిజానిజాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరచాలి’’ అని మోదీ అన్నారు. ప్రజా జీవితంలో ఇప్పుడు ఇదో కొత్త పద్ధతి మొదలయ్యిందంటూ వ్యాఖ్యానించారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌, బీజేపీ నేతల వద్ద దొరకవడం వంటి ఆరోపణల నేపథ్యంలో వాటిపై కూడా మోదీ మాట్లాడారు. ‘‘ఈవీఎంలంటే బీజేపీ ఎలక్షన్‌ విన్నింగ్‌ మెషీన్లని అభివర్ణిస్తున్నారు. వాటిని ట్యాంపర్‌ చేశామని ఆరోపిస్తూ గెలుస్తున్నామంటున్నారు. ఆ పార్టీలు విజయం సాధించినపుడు ఈవీఎంలు భేష్‌. మనం గెలిస్తే మాత్రం ఈవీఎంల తారుమారు వల్లట! దేశ ప్రజల పరిణితిని ఈ పార్టీలు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. వారి ఆశలు, ఆకాంక్షలు వేరు. పార్టీల కంటే కూడా ప్రభుత్వాల పనితీరును వారు బేరీజు వేస్తున్నారు. ఐదేళ్లూ నిజాయితీతో పనిచేశాం కాబట్టే మళ్లీ గెలిపించారు. వారి అవసరాలను అర్థం చేసుకుని స్పందిస్తున్నాం కాబట్టే గెలిపిస్తున్నారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా ఆయా రాష్ట్రాల్లో పోలింగ్‌ పూర్తయిన రోజే ఎన్నడూ లేని విధంగా కుట్రలు, స్వార్థపర శక్తులు అంటూ మోదీ మాట్లాడడం ఆసక్తిగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp