సీఎం జగన్‌కు నందమూరి బాలకృష్ణ లేఖ

By Karthik P Jul. 13, 2020, 06:02 pm IST
సీఎం జగన్‌కు నందమూరి బాలకృష్ణ లేఖ

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. లేఖలో పలు విషయాలను విన్నవించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని కోరారు. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉన్న హిందూపురాన్ని జిల్లాగా చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు హిందూపురం నియోజవర్గంలోని మాల్గురులో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ఆయన విన్నవించారు. మాల్గురులో సరిపడా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. సీఎంతోపాటు ఈ విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్య శాఖ మంత్రికి కూడా లేఖలు రాశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో నియోజకవర్గం అభివృద్ధిపైనే కాదు కనీసం ప్రజా సమస్యలపై కూడా బాలకృష్ణ దృష్టి పెట్టలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తాగునీటి సమస్య హిందూపురం ప్రజలను వెంటాడింది. మహిళలు ఖాళీ బిందెలతో బాలకృష్ణ కార్యాలయం వద్ద పలుమార్లు నిరసనలు కూడా తెలిపారు. అన్ని వ్యవహారాలు తన పీఏకి వదిలేసిన బాలకృష్ణ చుట్టం చూపుగా నియోజకవర్గానికి వచ్చేవారు. అయినా గడచిన ఎన్నికల్లోనూ బాలకృష్ణ గెలిచారంటే.. ఆయన తండ్రి ఎన్టీఆర్‌పై స్థానిక ప్రజలకు ఉన్న అభిమానమే అని అక్కడ వారు చెబుతున్నారు.

అయితే ఈ సారి బాలకృష్ణలో ఆందోళన మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను వారి గ్రామాల్లోనే పరిష్కరిస్తోంది. ఏ సమస్య ఉన్నా స్థానికంగానే పరిష్కారం అవుతుండడం, చేనేతలు, ఇతర వర్గాల వారికి వివిధ పథకాలతో నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరుతుండడంతో ఈ సారి తనకు ఎదురుగాలి తప్పదనే నిర్ణయానికి బాలకృష్ణ వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుని, తద్వారా కొంత మందినైనా మభ్యపెట్టేందుకు ఈ లేఖ రాజకీయానికి తెరతీశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికలకు ముందు ప్రతి పార్లమెంట్‌ కేంద్రాని జిల్లాగా చేస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. దాంతోపాటు వైద్య విధానంలో సమూల మార్పు కోసం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రతి పార్లమెంట్‌ పరిధిలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నాలుగు నెలల క్రితమే నిర్ణయించారు. అయితే బాలకృష్ణ ఈ రెండు విషయాలపై ఇప్పుడు లేఖ రాయడం క్రెడిట్‌ హైజాక్‌లో భాగమనే వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బాలకృష్ణ తన నియోజకవర్గం అభివృద్ధిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలోచించడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp