మంత్రి నాని ముఖ్య అనుచరుడు దారుణ హత్య.. .

By Karthik P Jun. 29, 2020, 02:47 pm IST
మంత్రి నాని ముఖ్య అనుచరుడు దారుణ హత్య.. .

ఆంధ్రప్రదేశ్‌ రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని  ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. మచిలీపట్నం చేపల మార్కెట్‌లో భాస్కర రావు ఉండగా గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు, రక్తపు మడుగులో పడి ఉన్న భాస్కర రావును ఆస్పతికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

భాస్కర రావు గతంలో మచిలీపట్నం మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా పని చేశారు. పేర్ని నానికి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో నాని విజయానికి కృషి చేశారు. ఈ క్రమంలో ఆయన హత్య జరగడం స్థానికంగా సంచలనమైంది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భాస్కర రావు హత్య విషయం నియోజకవర్గం అంతా దావాణంలా వ్యాపించడంతో వైసీపీ కార్యకర్తలు మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆస్పతి వద్దకు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆస్పత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

భాస్కర రావు హత్యతో కోపోద్రిక్తులైన వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి, టీడీపీ నేతల కొల్లు రవీంద్ర ఇంటిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంటి వైపు దూసుకెళుతున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. పట్టణంలో ముఖ్య ప్రాంతాలు, కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. భాస్కర రావు హత్యతో మచిలీపట్నంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp