పుంగనూరులో టీడీపీ బెంగ తీరేది కాదు!

By Ramana.Damara Singh Jun. 10, 2021, 06:45 pm IST
పుంగనూరులో టీడీపీ బెంగ తీరేది కాదు!

రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి తిరుగులేని నియోజకవర్గాల గురించి ఆలోచిస్తే ఠక్కున గుర్తుకొచ్చే పేరు పులివెందుల. ఆ తర్వాతే మిగతావన్నీ. వైఎస్ హయాం నుంచి అక్కడ ఆ కుటుంబ సభ్యులు తప్ప వేరేవారికి ఓటర్లు అవకాశం ఇవ్వడంలేదు. అంతలా కాకపోయినా ఆ స్థాయిలో అధికార పార్టీకి దన్నుగా నిలిచే నియోజకవర్గాల జాబితా తయారుచేస్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అందులో మొదటి స్థానం ఆక్రమిస్తుంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో టీడీపీకి చెందిన మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ఇలాకాగా ఉన్న పుంగనూరును పెద్దిరెడ్డి హస్తగతం చేసుకొని తన కోటగా మలచుకున్నారు. ఆయన రోజురోజుకూ మరింత బలపడుతున్న తీరు చూసి భవిష్యత్తులో ఇక్కడ కాలు మోపే పరిస్థితి కూడా ఉండదేమోనన్న బెంగ టీడీపీకి పట్టుకుంది.

సూపర్ స్ట్రాంగ్ పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లాలో తిరుగులేని నేతల్లో పెద్దిరెడ్డి ఒకరు. ఇదే జిల్లాకు చెందిన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే.. కాంగ్రెస్ నాయకుడిగా పెద్దిరెడ్డి ధీటుగా ఎదుర్కొని నిలబడ్డారు. వైఎస్సార్సీపీ ఏర్పడిన తర్వాత జగన్ కు అండగా ఉంటూ.. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రస్తుతం మంత్రిగా కీలకపాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెసులో ఉన్నప్పుడు పీలేరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి.. 2009లో నియోజకవర్గాల పునర్విభజన, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పుంగనూరుకు మారి.. అక్కడా ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్సార్సీపీ ఏర్పడిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అంతకుముందు ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి హవా ఉండేది. టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఆయన.. పెద్దిరెడ్డి రాకతో విఫలనేతగా మారారు. దాంతో 2019 ఎన్నికల్లో కొత్త అభ్యర్థి, మహిళను రంగంలోకి దింపి పెద్దిరెడ్డికి చెక్ చెప్పాలన్న లక్ష్యంతో అమర్నాథ్ రెడ్డికి మరదలు వరసయ్యే బంధువు అనీషారెడ్డిని టీడీపీ బరిలోకి దించింది. ఆమె కూడా కొన్ని ఆస్తులు అమ్మి భారీగానే ఖర్చు పెట్టి ప్రచారం చేశారు. అయితే జగన్ ప్రభంజనం, స్థానికంగా పెద్దిరెడ్డి ప్రాబల్యం ముందు అవేవీ పనిచేయలేదు. 42వేల ఓట్ల భారీ తేడాతో అనీషారెడ్డి ఓటమిపాలయ్యారు.

మరింత దిగజారిన టీడీపీ

ఎన్నికల అనంతరం గత రెండేళ్లలో టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. అధికార పార్టీ దూకుడు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డికి ఎదురులేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓటమి చెందిన అనీషారెడ్డి ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయారు. ప్రజల్లో ఎక్కడా కనిపించడంలేదు. అమర్నాథ్ రెడ్డి కూడా అతిధి తరహాలో అప్పుడప్పుడు వచ్చి పోవడం తప్ప.. ప్రజల్లోగానీ, పార్టీ శ్రేణులతోగానీ మమేకం కావడంలేదు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటన్నింటి ప్రభావం స్పష్టంగా కనిపించింది. నియోజకవర్గంలో టీడీపీ ఒక్కటంటే ఒక్క చోటయినా గెలవలేక చతికిల పడింది. వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలం పెంచుకుంటూ మరింత పటిష్టంగా మారుతుండటంతో తమ పార్టీ బతికి బట్టకట్టడం కష్టమేనన్న బెంగ టీడీపీ కార్యకర్తలకు పట్టుకుంది.

Also Read : 13 ఏళ్ల పోరాటం.. జగన్ చొరవతో శుభం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp