ఎర్రబెల్లి బుక్కయ్యారు

By Ritwika Ram Jul. 10, 2021, 09:30 pm IST
ఎర్రబెల్లి బుక్కయ్యారు

నోటి నుంచి మాట వచ్చేప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి. ఒకసారి నోరు జారిన మాటను వెనక్కి తీసుకోలేం. ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన రాజకీయ నాయకులే విస్మరిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నోరు జారారు. ఆయన ఉద్దేశంలో ఏమి ఉన్నా.. ఇతరులకు వినిపించింది మాత్రం అభ్యంతరకరమే. ఓ మహిళా అధికారిని ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకంపై మాట్లాడుతున్న సమయంలో స్థానిక ఎండీపీవోను పిలుస్తూ ‘ఎంపీడీవో గారు ఉన్నాడయ్యా’ అని మంత్రి అడగ్గా.. అక్కడున్న వారు ఎంపీడీఓ మేడమ్‌ అని బదులిచ్చారు. దీంతో ఆమె వెంటనే మంత్రి వెనుక వచ్చి నిలబడ్డారు. ఈ సమయంలో ‘మేడమ్‌ నువ్వయితే బాగానే ఊపుతున్నావ్‌! కానీ ఈడ ఊపుతలేవు. బాగానే పనిచేస్తది. ఇవన్నీ పార్కులు మంచిగా తయారు చేయాలె’ అని ఎర్రబెల్లి అనడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వారు. ఆయన వ్యాఖ్యలతో ఆమె చిన్నబోయారు.

ఎర్రబెల్లి వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదమయ్యాయి. ఒక మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పలు సంఘాలు ఖండించాయి. మంత్రి తీరు సరికాదని, ద్వంద్వ అర్థాలతో మంత్రి మాట్లాడడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. సంస్కారం లేకుండా మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు క్రూరమైనవని మండిపడ్డాయి. ఈ వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని.. ఆయన్ను అరెస్ట్‌ చేయాలని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మకు ఫిర్యాదు చేసింది.

అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎర్రబెల్లి చెబుతున్నారు. సదరు ఎంపీడీవోతో తనకు ముందు ఉంచి పరిచయం ఉందని అంటున్నారు. ఆమెను కూతురుగా భావిస్తానని చెప్పారు. గతంలో ఎంపీడీవీ దుగ్గండి మండలంలో పనిచేశారని, అక్కడ ఉద్యోగులతో ఉరుకులు పరుగులు పెట్టించి పనులు చేయించారని తెలిపారు. అందుకే ఇక్కడెందుకు పనిచేయట్లేదని అడిగానన్నారు. కానీ తన కామెంట్లను కట్ చేసి కావాలనే వైరల్ చేస్తున్నారని ఆరోపించారు.

Also Read : ఫిర్యాదు సరే.. ఫలితమేది సోమిరెడ్డి..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp