ఎంఐ- 17 హెలికాప్టర్ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇప్పుడు డిఫెన్స్ చీఫ్ ని..

By Raju VS Dec. 08, 2021, 09:00 pm IST
ఎంఐ- 17 హెలికాప్టర్ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇప్పుడు డిఫెన్స్ చీఫ్ ని..

ఎంఐ -17 హెలికాప్టర్ మరోసారి ప్రమాదానికి గురయ్యింది. గతం నుంచి ఈ మోడల్ హెలికాప్టర్లు పదే పదే ప్రమాదానికి గురవుతుండడం విశేషం. గత నెలలో కూడా అరుణాచల్ ప్రదేశ్ లో ఓ ప్రమాదం జరిగింది. నవంబర్ 19న జరిగిన ప్రమాదంలో హెలికాప్టర్ కూలింది. అయితే ఆ ఘటనలో అంతా ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా తమిళనాడులో జరిగిన ప్రమాదంలో డిఫెన్స్ చీఫ్‌, ఆయన కుటుంబీకులు సహా పలువురు ఉన్నత స్థాయి అధికారులు కూడా ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదానికి గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియకపోయినప్పటికీ పదే పదే ఆ మోడల్ హెలికాప్టర్ ప్రమాదాలకు గురి అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేసిన దోర్జీ ఖండూ 2011లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కూడా ఎంఐ-17 కి చెందిన వీ5 మోడల్ హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆరాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో ఆయన హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకే అప్పట్లో ఈ ప్రమాదం జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం, అందులో ముఖ్యమంత్రి ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర విషాదం నింపింది.

ఆ తర్వాత 2015లో వైష్ణోదేవి ఆలయ మార్గంలో మరో హెలికాప్టర్ కూలింది. ఆ ప్రమాదంలో కెప్టెన్ సుమితా విజయన్ సహా మరో మహిళా పైలట్ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూలోని కాత్రా పట్టణ బస్టాండ్ సమీపంలో ఈ హెలికాప్టర్ కూలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read : Bipin Rawat Biography - జీవితాంతం దేశ రక్షణలోనే బిపిన్ రావత్

2017లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా దేవేంద్ర ఫడ్నవిస్ హెలికాప్టర్ కూడా ప్రమాదానికి గురయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వీటీ 6ఎంఎం మోడల్ హెలికాప్టర్ అది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ఫడ్నవిస్ బయటపడ్డారు.

అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఏపీ చరిత్రలోనే ఓ దుర్దినంగా భావిస్తారు. 2009 సెప్టెంబర్ 2న జరిగిన ఆ ప్రమాదం ఏపీ చరిత్రనే మార్చేసింది. వైఎస్సార్ నేటికీ ప్రజల మదిలో మెదులుతున్నప్పటికీ మహానేతను శాశ్వతంగా దూరం చేసిన హెలికాప్టర్ ప్రమాదం నేటికీ అందరినీ కలచివేస్తోంది.

2017 జూలై 14న జరిగిన అరుణాచల్ ప్రదేశ్ హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు అధికారులు మరణించారు.
మిల్ ఎంఐ-17 గా పిలిచే ఈ రష్యన్ తయారీ హెలికాప్టర్ పలు ప్రమాదాలకు కారణంగా మారడం మాత్రం విస్మయకరంగా ఉంది. రెండు టర్బైన్లతో ప్రయాణించే హెలికాప్టర్ అయినప్పటికీ పదే పదే కూలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరగడంతో దేశవ్యాప్తంగా ఈ హెలికాప్టర్ల చుట్టూ పెద్ద చర్చ సాగుతోంది.

Also Read : Bipin Rawat - సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp