అందరివాడు మురళి.. ఫలించిన కృషి..

By Karthik P Jul. 31, 2021, 01:18 pm IST
అందరివాడు మురళి.. ఫలించిన కృషి..

రాజకీయాల్లో పోటీ చేయడం వల్లనే కాదు.. త్యాగాలు, నిబద్ధతతో పని చేయడం వల్ల కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్లవచ్చని తాజాగా ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన మేరిగ మురలీధర్‌ (మురళి)ను నిదర్శనంగా చూపవచ్చు. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన మురళీధర్‌ కాంగ్రెస్, వైసీపీలలో క్రియాశీలకంగా పనిచేశారు. చివరి నిమిషంలో టిక్కెట్‌ రాకపోయినా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడిన మురళి త్యాగానికి, ఆది నుంచి నిబద్ధతతో పార్టీ బలోపేతానికి చేసిన కృషికి దక్కిన ఫలితమే ఈ పదవని చెప్పవచ్చు.

ఉన్నత విద్యావంతుడైన మేరిగ మురళీధర్‌ ఎస్‌వీ యూనివర్సిటీలో పీజీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలానికి చెందిన మురళీ ఇంటర్‌ నుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పని చేశారు. డిగ్రీ చదివే రోజుల్లో కాలేజీ చైర్మన్‌గా పని చేశారు. రాజకీయ కుటుంబం కావడం, రాజకీయాలపై ఆది నుంచి ఉన్న ఆసక్తి.. ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల వైపు నడిపించింది. ఈ క్రమంలోనే ఆయన 1995లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1995లో రాపూరు జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు.

మేరిగ మురళీధర్‌ పెదనాన్న మేరిగ రామకృష్ణయ్య నెల్లూరు లోక్‌సభ, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. 1980లో సిట్టింగ్‌ ఎంపీ డి కామాక్షయ్య చనిపోవడం వల్ల 1983 అసెంబ్లీ ఎన్నికలతోపాటు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 1978లో సన్నపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి మద్ధతుతో గూడూరు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ద్వితియ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఇందిర కాంగ్రెస్‌ అభ్యర్థి పి.ప్రకాశ్‌రావు గెలిచారు. జనతా పార్టీ మూడు, కాంగ్రెస్‌ పార్టీ నాలుగో స్థానంలో నిలిచింది.

Also Read : రాజన్న దళం చిరంజీవి రెడ్డికి ఊహించని రీతిలో చైర్మన్‌ పదవి

మాజీ ఎంపీ మేకపాటి అనుచరుడుగా ఉన్న మురళీధర్‌ వైసీపీ అవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. వైసీపీ జిల్లా కో కన్వీనర్‌గా కాకాణి గోవర్థన్‌ రెడ్డితో కలసి పనిచేశారు. 2013లో జిల్లా అధ్యక్షడుగా బాధ్యతలు చేపట్టారు. 2012 ఉప ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీ క్యాడర్, ద్వితియ శ్రేణి నేతలను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా పని చేసి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆయనకు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది.

వైసీపీ తరఫున గెలిచిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్‌కుమార్‌ 2016లో పార్టీ ఫిరాయించడంతో గూడూరు కో ఆర్డినేటర్‌గా మురళీధర్‌ బాధ్యతలు చేపట్టారు. గూడూరు నియోజకవర్గంలో ఉన్న జమీందార్లు, పెద్దారెడ్లు తమ మైనింగ్‌ వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు సునీల్‌తోపాటు టీడీపీలోకి వెళ్లారు. నియోజకవర్గంలో వైసీపీకి పెద్దదిక్కు కరువయ్యారు. పార్టీ కార్యకలాపాలు నిర్వహించడానికి అప్పటి అధికార పార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఇలాంటి సమయంలో వైసీపీ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన మురళీధర్‌.. క్యాడర్‌ను సమీకరించి మళ్లీ పార్టీకి పూర్వవైభవం తెచ్చిపెట్టారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ మురళీకే దాదాపు ఖరారైంది. అయితే ఎన్నికలకు ముందు అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరుపతి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి వరప్రసాద్‌రావుకు గూడూరు టిక్కెట్‌ ఇవ్వాల్సి వచ్చింది. గూడూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్‌రావుకు తిరుపతి లోక్‌సభ టిక్కెట్‌ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలో సీనియర్‌ నేతలు ఉండడంతో.. వైసీపీ అధిష్టానం తప్పనిసరి పరిస్థితుల్లో వరప్రసాద్‌ను గూడూరు నుంచి పోటీ చేయించింది.

వస్తుందనుకున్న టిక్కెట్‌ రాకపోయినా మురళీధర్‌ నిరుత్సాహపడలేదు. అసంతృప్తికి లోనవకుండా ఆ ఎన్నికల్లో వర ప్రసాద్‌ విజయం కోసం పని చేశారు. ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ గూడూరు నియోజవర్గంలో పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి నడిపించారు. ఉప ఎన్నికల్లో గూడూరు ఇంఛార్జిగా వెళ్లిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి.. మురళీ పనితీరును వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలో ఆది నుంచి పని చేస్తూ.. అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించి అందరివాడుగా పేరొందిన మురళీకి పదవి దక్కడం నెల్లూరు జిల్లా వైసీపీ క్యాడర్‌లో జోష్‌ నింపింది.

Also Read : ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి , వైఎస్సార్ బంధుత్వం తెలుసా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp