పదకొండోవాడిగా మిగిలిపోయే దురదృష్టం

By Guest Writer 18-11-2019 01:42 PM
పదకొండోవాడిగా మిగిలిపోయే దురదృష్టం

సకశేరుకాలు, అకశేరుకాలు..
అనులోమవిలోమాలు..
కర్ణికాజఠరికాంతర కవాటాలు..
పరపరాగ సంపర్కాలు..

ఇవన్నీ చదివే ఈరోజు సమాజంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాం. దాదాపుగా ఎనభయ్యవ దశకం వరకు ఎక్కువ మంది తెలుగు మాధ్యమంలోనే పదవ తరగతి వరకు చదివి, పిమ్మట కళాశాల స్థాయిలో ఇంగ్లీషు మాధ్యమానికి మారేవారు. తద్వారా అనేక భాషాపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కునేవారు. దీనికి ఉదాహరణ నేనే. అప్పటివరకూ ఉండే లోలకం పెండ్యులమ్ అయిపోయేది. భాస్వరం కాస్తా ఫాస్ఫరస్ అని చలామణి అయ్యేది. పిండిపదార్ధాన్ని స్టార్చనాలని దెబ్బలాడేవారు.

దీంతో మా చిన్నమెదడు (దీన్ని సెరిబెల్లమ్ అంటారు) కాస్తా మరింత చిన్నదైపోయినట్టు అనిపించేది. సరే, ఏవో తంటాలుపడి ఆ పదాలన్నీ నేర్చేసుకుని అంతకీ గుర్తుండని వాటికోసం కొన్ని కొండగుర్తులు కూడా పెట్టుకుంటూ రెండేళ్లూ బండిని నడిపేశాం.

కానీ ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివిన తెలుగు పాఠాలు, పద్యాలు, పురాణగాథలు, నాన్నగారి నోటివెంట నిత్యం నందివర్ధనాల్లా రాలిపడే సామెతలు, నుడికారాలు, జాతీయాలు, అమ్మకి మరీ కోపమొస్తే వినబడే తిట్లు, పత్తి వలిచి వత్తులు చేసినట్టు ప్రతిపదార్ధ సహితంగా పద్యాలు పాడే తెలుగు మేష్టరమ్మ కుముదవల్లి గారి నిబద్ధత... ఇవన్నీ కలిసి ఈనాడు నాకు తెలుగు భాషలో అక్షరదోషాలనేవి లేకుండా రాయగల నేర్పు, సాధ్యమైనంత సరళంగా ఎదుటివారితో సంభాషించగల ఓర్పు అందించాయని నిర్ద్వంద్వంగా చెప్పగలను.

Also Read: విద్య- ప్రభుత్వ బాధ్యత-ఇంగ్లీష్ మీడియం

ఉన్నత వర్గాల పిల్లలెప్పుడూ ఊళ్లోకెల్లా కాస్త మంచి బళ్లోనే చదువుకుంటారు. అలానే మావూళ్లో కూడా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గారి పిల్లలమైన మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం. కాస్తంత మంచి వ్యాపారవేత్తలు, డాక్టర్ల పిల్లలందరూ స్థానిక లింగమూర్తి కళాశాలకు అనుబంధంగా వుండే ఆదినారాయణ పాఠశాలలో చదువుకునేవారు. వారికొక బస్సు, యూనిఫాం ఉండేవి. ఎప్పుడూ ఆ బస్సు వెళ్తున్న దిశగా మేమంతా ఒకరకమైన అభద్రతాభావంతో చూస్తుండేవాళ్లం. భవిష్యత్తంతా వారిదేనని, ఇంజనీరింగ్, వైద్యకళాశాలల్లో సీట్లన్నీ వారే సాధిస్తారని ఒకరకమైన అపోహలో ఉండేవాళ్లం. ఆ అపోహలన్నీ మాకంటే పై తరగతుల్లో వుండే విద్యార్ధులు మా మెదళ్లలోకి చొప్పించినవే. అయితే అది పూర్తిగా అపోహ కూడా కాదు. ఎందుకంటే ఆయేడాది మావూరి నుంచి ఆరేడు మెడిసిన్ సీట్లు వస్తే అందులో నాలుగు ఆదినారాయణ పాఠశాల విద్యార్ధులవే అయుండేవి.

ఇవన్నీ కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల మానసిక ధైర్యానికి ఎంతోకొంత విఘాతాన్ని కలిగించేవన్న వాస్తవం నిర్వివాదాంశం. అయినా ఇంటర్మీడియెట్ విద్యలో భాషవల్ల ఎదురయే సమస్యలు ఎదుర్కొంటూ ఎన్ని తెలివితేటలున్నా పదకొండోవాడుగా మిగిలిపోయే దురదృష్టం మాకుండేది. ఈ సందర్భంలో అందరికీ వచ్చే ప్రధాన సందేహం.. అసలు అంతవరకూ చదివి ఉన్న మీడియం మారవలసిన అవసరమేమిటని?

మెడిసిన్ చదువంతా ఆంగ్లంలోనే ఉంటుంది. గ్రేస్ అనాటమీ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించి, మూడు వేరువేరు పుస్తకాలుగా బైండింగ్ చేయించుకుని ఒళ్లో పెట్టుకుని చదువుతోంటే రెండున్నరేళ్లూ దానికే సరిపోతుంది. అటువంటిది అకస్మాత్తుగా తెలుగు మాధ్యమం నుంచి వచ్చి, అవన్నీ ముందేసుకుని కూర్చుంటే కాస్ట్ ఎవే చిత్రంలో తన తోటి ప్రయాణికులంతా ప్రమాదంలో చనిపోతే టామ్ హేంక్స్ ఒక్కడూ ఒక దీవిలో చిక్కడిపోయినట్టు తయారవుతుంది.

ఈ కిరణజన్య సంయోగక్రియ, గరిమనాభి, పౌనఃపున్యం... ఇవన్నీ కొంత చదువు అయిపోయిన తరువాత కనబడవు. అవన్నీ ఇంగ్లీషు పదాలైపోయి మనల్ని వెక్కిరిస్తాయి. తెలుగు మీడియంలోనే చదువుకుంటూ సమాంతరంగా తత్సమాన ఆంగ్లపదాలు కూడా తెలుసుకుంటే కొంత ఉపయుక్తంగా ఉంటుంది. కానీ అవన్నీ జ్ఞాపకముంచుకోవలసిన ఆవశ్యకత విద్యార్థులకు అదనపు భారమే అవుతుంది. సమయం కూడా వృధా.

నా ఉద్దేశంలో ఒకటవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఆంగ్ల మాధ్యమంలోనే చదువు ఉండాలి. ఒకవేళ ఒక విద్యార్ధి తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోయినా, లేక వారు ఆంగ్లభాషలో సాధికారత లేనివారైనా ఆ విద్యార్ధితో అనునిత్యం తెలుగులోనే మాట్లాడుతూ వుంటారు. తద్వారా బడిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. అటువంటి విద్యార్ధుల్ని గమనించి వారికి వారికర్ధమయ్యే మాతృభాషలోనే పాఠ్యాంశాల్ని విశదపరిచి సహకరించాలి. ఐఐటి రామయ్యగారు అదే మాటనేవారు. వారికెలా చెబితే ఎక్కుతుందో అలానే చెప్పాలి తప్ప ఇదిలాగే చదవాలి, చదివితీరాలి అనడం ముర్ఖత్వం అని చెప్పేవారు.

Also Read: ఇంగ్లీష్ మీడియం-భిన్న అభిప్రాయం

ఇక రెండవది: మనదైన భాష. కమ్మనైన అమ్మమాట. ఎందుకు వదిలెయ్యాలి? స్కోరింగనో, రాయడం నేర్చుకున్నా లేకున్నా పరీక్షంతా తెలుగులోనో హిందీలోనో రాసెయ్యొచ్చన్న పనికిమాలిన సిద్ధాంతం వల్లనో సంస్కృతాన్ని రెండవ భాషగా ఎంచుకుంటున్నారు. దీనికి కారణం మన ఉపాధ్యాయులే. ఇంటర్మీడియెట్ చేరేముందు విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు వస్తారు. వారు ఇద్దరు ముగ్గురు అధ్యాపకుల్ని కలుస్తారు. ఆ అధ్యాపకులు వారికి తోచిన సలహాలిస్తారు. అదే రొడ్డకొట్టుడు వ్యవహారం. అందరూ వెళ్లే దారిలోనే మనమూ పోదామనే మూసధోరణి వదిలేసి మన పిల్లలకి మంచి తెలుగు అవకాశమున్నంతవరకూ నేర్పించాలన్న ధ్యాస కలగాలి.యితే మనమిలా అనేసుకుంటే వాళ్లకి తెలుగుభాష పట్టుబడిపోదు. దానికి తగిన కృషి తెలుగు నేర్పే అధ్యాపకులే చెయ్యాలి. తరగతి పుస్తకాలతో పాటు మనభాషలో అత్యంత ప్రాచుర్యమూ, ప్రజాదరణా పొందిన పుస్తకాలన్నింటినీ విద్యార్ధుల చేత చదివించాలి. సమయం లేదన్నమాట అవాస్తవం. తప్పకుండా ఉంటుంది. వారానికొక రెండు గంటలు కేటాయిస్తే నండూరి రామ్మోహనరావు విశ్వదర్శనం, కుటుంబరావు చదువు, ముళ్ళపూడి బుడుగు, మధురాంతకం రాజారాం మానవీయ గాథలు... ఇలా ఎన్నో ఉత్తమమైన గ్రంథాల్ని వారిచేత చదివించవచ్చు.

అవన్నీ చదవడం వల్ల ముందుగా భాషమీద కాస్త అవగాహన, అక్షరాలపై మమకారం, ఒత్తులు, పొల్లులు ఎలా వాడుతున్నారనే స్పృహ, మనదైన భావాన్ని ఎంతందంగా వ్యక్తీకరించవచ్చో అన్న విస్మయమూ కలుగుతాయి.

ఇక మాట్లాడే విషయానికొస్తే నలుగురు తెలుగువాళ్లు కలిసినపుడు తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడుకుంటూ, మనవైన పేర్లే వాడుతూ, మనసారా మన హాస్యాన్ని పండించుకుంటూ బ్రతకొచ్చు. వైట్ రైసు, కర్రీసు; సాంబారు, చట్నీసు; కర్డూ, షుగరూ... ఇవన్నీ మనం నిత్యం వాడే పదార్ధాలే, అనునిత్యం ఉపయోగించే పదాలే!

ఆ అన్నంగిన్నె ఇలా తొయ్యరా,
ఈ పాయసంలో పందారెక్కువైందమ్మాయ్
పకోడీల్లో అల్లం ఉల్లిపాయలూ తగలాలి..

ఇలా మాటాడుకుంటే ఉండే అందం పుడ్డింగులూ, వెడ్డింగులూ అంటూ పెద్ద పుడింగులా మాట్లాడితే రాదు.

సినిమాల్లో దాదాపుగా కథానాయికలందరూ వేరే రాష్ట్రాలకు చెందినవారే ఉంటున్నారు. అదేమీ క్షమించరాని నేరం కాదు. కంటికింపుగా కనబడే యువతీయువకుల్ని చూడటానికేగా సినిమాకి పోయేది? అలాగే నటనాపరంగా అద్భుతమైన ప్రతిభ కలిగిన పరభాషా నటులు ప్రతినాయకులుగా వస్తున్నారు. డబ్బింగ్ చెప్పించి వారినీ మనకి అలవాటు చేశారు. ఇక సంగీత దర్శకత్వం సైతం వేరే రాష్ట్రాలవారికి ధారాదత్తం చేసేసి పాట్లుపడుతున్నారు. నిర్మాతకి ఆ సాహిత్యంలో విరుపులు అర్ధంకావు. దర్శకుడికి తీరికుండదు. హీరో అవన్నీ చూసుకుంటే అప్రదిష్ట. గాయకుడికి అసలు భాషే రాదు. ఇక మంచిపాట ఎలా వస్తుంది?

ముందు మన భాషమీద గౌరవం ఉన్న ఏ వ్యక్తయినా వారి అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకోవాలి. వారి పిల్లలు ఇంట్లో ఎంత తెలుగు మాట్లాడుతున్నారు, వారంతా ఏ మీడియంలో చదువుతున్నారు, మన సాహిత్యంలో వారికెంత ప్రవేశముంది, ఉచ్చారణా దోషాలు లేకుండా భాషను పలకడం ఎలా?.... ఇత్యాది విషయాలన్నీ ఒక టేబ్యులర్ ఫామ్ వేసుకుని బాక్సులన్నీ చెక్ చేసుకోండి. ఆ తరువాత ఏ మీడియం ఉండాలో మీడియా ముందు మాట్లాడుదురుగాని!

.....జగదీశ్ కొచ్చెర్లకోట

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News